Ponniyin Selvan 1: కెనడాలో థియేటర్ ఓనర్స్‌కి బెదిరింపులు.. సినిమాను ఆడిస్తే చంపేస్తామంటూ..

ABN , First Publish Date - 2022-09-29T17:28:55+05:30 IST

దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan)’..

Ponniyin Selvan 1: కెనడాలో థియేటర్ ఓనర్స్‌కి బెదిరింపులు.. సినిమాను ఆడిస్తే చంపేస్తామంటూ..

దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ (Ponniyin Selvan)’. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ మణిరత్నం (ManiRatnam) దర్శకత్వం వహించిన ఈ మూవీలో చియాన్ విక్రమ్ (Vikram), కార్తీ (Karthi), జయం రవి, ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai), త్రిష (Trisha) ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ మూవీ సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ తరుణంలో కెనడాలోని థియేటర్ యాజమానులకి చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి.


కెనడాలో ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1’ని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ అయిన KW టాకీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఆ యాజమాన్యం తాజాగా ఓ ట్వీట్ చేసింది. అందులో..‘సోమవారం బుకింగ్ అప్‌డేట్స్!. నాకు హామిల్టన్ (Hamilton), కిచెనర్ (Kitchener), లండన్ (London) నుంచి అప్‌డేట్‌లు వచ్చాయి. పీఎస్ 1 థియేటర్స్ ఆడితే దాడులు చేస్తామని థియేటర్ యజమానులందరిని బెదిరించారు. PS1 తమిళం లేదా KW టాకీస్ నుంచి ఇతర సినిమాలకి సంబంధించి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. #PS1TamilInCineplex #PS1TamilInLandmark’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా.. ఆ ట్వీట్‌కి బెదిరింపులు వచ్చిన ఈ మెయిల్ స్క్రీన్ షాట్స్‌ని కూడా షేర్ చేసింది.


అందులో.. ‘థియేటర్ యజమానులు, కార్మికులకు హెచ్చరిక. మీరు వ్యవస్థీకృత నేరస్థుడు KW టాకీస్ సలీమ్ సంబంధించిన సినిమాలు.. ముఖ్యంగా PS1, చుప్ సినిమాలను థియేటర్స్‌లో ఆడించొద్దు. ఒకవేళ అలా చేస్తే.. మేము మీ థియేటర్స్‌పై దాడి చేసి.. స్ర్క్రీన్స్‌ని చింపేస్తాం. వాటిని కూల్చేస్తాం. మీ ఉద్యోగులలో కొందరిని ఆసుపత్రిలో పడేలా చేస్తాం. మేము ఈ భారతీయ చలన చిత్రాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోకుండా.. ఇతర బ్లాక్‌బస్టర్ ఇంగ్లిష్ సినిమాలపై దాడి చేస్తూనే ఉంటాం. మీరు వాటిని థియేటర్స్ వేయడం ఆపే వరకు మేము అలానే కొనసాగిస్తాం. క్రిస్మస్ ఎంతో దూరంలో లేదు. మేము ఇంగ్లిష్, భారతీయ బ్లాక్ బస్టర్ చిత్రాలను లక్ష్యంగా చేసుకుంటాం. ల్యాండ్‌మార్క్ సినిమా థియేటర్ల చూసి నేర్చుకోండి. వారు తమను తాము రక్షించుకోవడానికి  ఆ సినిమాలను థియేటర్స్‌లో ఆడించరు. ఇది ఒక హెచ్చరిక మాత్రమే..’ అని రాసుకొచ్చారు.


అయితే.. ఈ బెదిరింపులకి స్పష్టమైన కారణం ఏది తెలియరాలేదు. కానీ.. ఇప్పటికి పలు చిత్రాల విషయంలో ఇలాంటి బెదిరింపులు వచ్చినప్పటికీ.. సౌత్ ఇండియన్ సినిమాలకు మాత్రం రాలేదు. కానీ.. ఇంతకుముందు.. దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ చిత్రానికి మొదటిసారి ఇలాంటి బెదిరింపులు రావడంతో పలు చోట్ల ఈ చిత్రం షోలను ఆపేశారు. తాజాగా పీఎస్ 1, చుప్ వచ్చాయి.



Updated Date - 2022-09-29T17:28:55+05:30 IST