Brahmastram: రాజమౌళి ఉన్నా.. అవి లేకుంటే తుస్సుమంటది..!

ABN , First Publish Date - 2022-06-04T01:59:06+05:30 IST

సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతున్నాయి. దక్షిణాది నుంచి హిందీలోకి వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్’, ‘కెజియఫ్: చాప్టర్-2’ భారీస్థాయిలో కలెక్షన్లను

Brahmastram: రాజమౌళి ఉన్నా.. అవి లేకుంటే తుస్సుమంటది..!

సౌత్ సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతున్నాయి. దక్షిణాది నుంచి హిందీలోకి వచ్చిన ‘ఆర్ఆర్‌ఆర్’, ‘కెజియఫ్: చాప్టర్-2’ భారీస్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ కళ్లు సౌత్ మార్కెట్‌పై పడ్డాయి. అందువల్ల హిందీ సినిమాలను దక్షిణాది భాషల్లోకి డబ్ చేసి ఇక్కడ విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అడుగులు వేస్తున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్‌ను కూడా వ్యూహాత్మకంగా చేస్తున్నారు. యశ్ రాజ్ ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న సినిమాలన్నింటిని దక్షిణాది భాషల్లోకి డబ్ చేస్తుంది. ‘బ్రహ్మాస్త్ర’, ‘జవాన్’ కూడా సౌత్ లాంగ్వేజ్‌స్‌లో రిలీజ్ కాబోతున్నాయి.  

  

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor), ఆలియా భట్(Alia Bhatt) హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్రం మొదటి భాగం- శివ’(Brahmastram Part One: Shiva). అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించారు. కరణ్ జోహార్(Karan Johar) నిర్మాతగా వ్యవహరించారు. పాన్ ఇండియాగా ఈ చిత్రం తెరకెక్కింది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. దక్షిణాది భాషలకు దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి (SS Rajamouli) సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్స్ చేయడంలో రాజమౌళిని మించినవారు లేరు. జక్కన్నను అనుసరిస్తే చాలు సౌత్ మార్కెట్‌ను సులభంగా కొల్లగొట్టొచ్చని కరణ్ జోహార్ అనుకుంటున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలతో రాజమౌళి అన్ని భాషల్లోను ఫేమ్ సంపాదించుకున్నారు. అందువల్లే కరణ్ దక్షిణాది భాషలకు ప్రజెంటర్‌గా రాజమౌళిని ఎంచుకున్నారు. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్‌లో ప్రమోషన్స్ మొదలుపెట్టక ముందే వైజాగ్‌లో ఓ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. రాజమౌళి పేరు సినిమాకు తప్పకుండా ఉపయోగపడుతుంది. కానీ, కథ, ఎమోషన్స్ లేకుంటే మాత్రం చిత్రబృందం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. కేవలం, దక్షిణాది సినిమాల రికార్డుల బద్దలు కొట్టే లక్ష్యంతో ఈ బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తే అది తుస్సుమనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Updated Date - 2022-06-04T01:59:06+05:30 IST