Ranbir Kapoor: కళలకి హద్దులు లేవు.. పాకిస్తానీ సినిమాల్లో నటిస్తా..

ABN , First Publish Date - 2022-12-13T13:58:00+05:30 IST

బాలీవుడ్‌లో మంచి స్టార్‌డమ్ ఉన్న నటుల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు.

Ranbir Kapoor: కళలకి హద్దులు లేవు.. పాకిస్తానీ సినిమాల్లో నటిస్తా..
Ranbir kapoor

బాలీవుడ్‌లో మంచి స్టార్‌డమ్ ఉన్న నటుల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. ఈ నటుడికి ఈ ఏడాదే బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ (Alia Bhatt) తో పెళ్లి కాగా.. ఇటీవలే ఆమె పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పబ్లిక్‌లో దాదాపు కనిపించలేదు. కూతురు పుట్టిన కొన్ని నెలల తర్వాత తాజాగా జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్‌ (Red Sea Film Festival)కు హాజరయ్యారు. ఈ తరుణంలో ఓ ఇంటర్వ్వూలో రణ్‌బీర్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఆ ఇంటర్వ్యూలో ప్రేక్షకుల మధ్యలో కూర్చున్న ఓ పాకిస్తానీ ఫిల్మ్ మేకర్ రణ్‌బీర్‌ని ఓ ప్రశ్న అడిగారు. గత కొన్నేళ్ల క్రితం భారత, పాకిస్తానీ నటులు ఒక పరిశ్రమలో మరొకరు నటించకుండా నిషేధం విధించారు. దీనిపై ఆ పాకిస్తానీ ఫిల్మ్ మేకర్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మనం కలిసి సినిమాలు చేయడానికి సౌదీ అరేబియా వంటి ప్లాట్‌ఫారమ్ ఉంది. నేను మీతో కలిసి ఒక చిత్రానికి సంతకం చేయాలనుకుంటున్నాను. సౌదీ అరేబియాలో మీ బృందంతో పాటు పాకిస్తానీ బృందంతో కలిసి పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని అడిగాడు.

దానికి రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘ఖచ్చితంగా సర్.. కళాకారులకు, ముఖ్యంగా కళలకు హద్దులు ఉండవని నేను నమ్ముతాను. మౌలా జాట్‌ సినిమాకి గానూ పాకిస్తాన్ చలనచిత్ర పరిశ్రమకు చాలా అభినందనలు. గత కొన్ని సంవత్సరాలలో మనం చూసిన అతి పెద్ద హిట్స్‌లో ఈ చిత్రం కూడా ఒకటి. కాబట్టి కచ్చితంగా మీతో కలిసి పని చేయడానికి ఇష్టపడతాను’ అని చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Updated Date - 2022-12-13T14:18:57+05:30 IST