పోలింగ్ అధికారిపై దాడి చేసినందుకు వెటరన్ యాక్టర్‌కి రెండేళ్ల జైలు.. 1996లో అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-07-08T15:07:39+05:30 IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు రాజ్ బబ్బర్‌ 1996లో ఓ ప్రభుత్వ అధికారిపై దాడి చేశారు...

పోలింగ్ అధికారిపై దాడి చేసినందుకు వెటరన్ యాక్టర్‌కి రెండేళ్ల జైలు.. 1996లో అసలేం జరిగిందంటే..

ప్రముఖ బాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు రాజ్ బబ్బర్‌ 1996లో ఓ ప్రభుత్వ అధికారిపై దాడి చేశారు. ఆ కేసుని విచారించిన లక్నోలోని MP/MLA కోర్టు దాదాపు  25 ఏళ్ల తర్వాత ఆ కేసులో తీర్పు వెలువరించింది. రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.8,500 జరిమానా కూడా విధించింది. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రంలో పని చేస్తున్న ఓ ప్రభుత్వ అధికారిని దూషించడమే కాకుండా ఆయనపై దాడికి కూడా పాల్పడ్డట్లు తాజాగా విచారణలో తేలింది.


ఈ సంఘటన మే 2, 1996న జరిగింది. అదే రోజు, శ్రీ కృష్ణ సింగ్ రాణా అనే పోలింగ్ అధికారి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అయినా బబ్బర్‌తో పాటు, ఆయన సహచరుడు అరవింద్ యాదవ్‌పై వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఆ ఫిర్యాదులో.. బబ్బర్,  ఆయన మద్దతుదారులు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఓటింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించారని, అధికారిక పనులను అడ్డుకున్నారని పేర్కొన్నారు. డ్యూటీలో ఉన్న వ్యక్తులపై దురుసుగా ప్రవర్తించారని, దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. ఆ దాడిలో కృష్ణ సింగ్ రాణాతో పాటు మరో పోలింగ్ ఏజెంట్ శివ్ సింగ్ కూడా గాయపడ్డారు.


ఆ సమయంలో.. రాజ్ బబ్బర్, అరవింద్ యాదవ్‌పై 143, 332, 353, 323, 504, 188 IPC, ప్రజాప్రాతినిధ్య చట్టం, ఏడు క్రిమినల్ చట్ట సవరణల కింద మార్చి 23, 1996న కోర్టులో ఛార్జిషీట్ దాఖలైంది. ఆ సమయంలో విచారణ తర్వాత రాజకీయ నాయకుడిగా మారిన నటుడు రాజ్ బబ్బర్‌కి బెయిల్ లభించింది.  ఆ సమయంలో బబ్బర్ సమాజ్ వాదీ పార్టీ తరుఫున లక్నో నుంచి ఎన్నికలలో పోటీ చేశారు. కాగా.. తాజాగా శిక్ష ఖరారు చేసిన సమయంలో ఈ మాజీ ఎంపీ కోర్టుకు హాజరయ్యారు.

Updated Date - 2022-07-08T15:07:39+05:30 IST