Mushtaq Nadiadwala: పాకిస్తాన్‌లో ఉన్న నా పిల్లలను వెనక్కి తీసుకురావాలి.. బాంబే హైకోర్టులో పిటిషన్ వేసిన బాలీవుడ్ నిర్మాత
ABN , First Publish Date - 2022-08-19T18:37:13+05:30 IST
బాలీవుడ్(Bollywood)లో ఎన్నో హిట్ సినిమాలు తీసి గుర్తింపు పొందిన నిర్మాత ముస్తాక్ నడియాడ్‌వాలా (Mushtaq Nadiadwala)...

బాలీవుడ్(Bollywood)లో ఎన్నో హిట్ సినిమాలు తీసి గుర్తింపు పొందిన నిర్మాత ముస్తాక్ నడియాడ్‌వాలా (Mushtaq Nadiadwala). ఆయన పాకిస్తాన్‌లోని తన భార్య మరియమ్ చౌదరి (Maryam Choudhary) మైనర్లు అయిన తన ఇద్దరు పిల్లలను అక్రమంగా బందీలుగా ఉంచిందని ఆరోపిస్తూ పిటిషన్ వేశాడు. ఈ కేసులో తనకు న్యాయం చేయాలంటూ ఈ నిర్మాత బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో తన పిల్లలను పాకిస్థాన్ నుంచి భారత్‌కు సురక్షితంగా తీసుకురావాలని డిమాండ్ చేశాడు. ఈ అంశంపై స్పందించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోర్టు కోరింది.
ముస్తాక్ వేసిన పిటిషన్‌లో పిల్లలు విజిటింగ్ వీసాపై పాకిస్థాన్ వెళ్లారని, ఆ గడువు 2021లోనే ముగిసిందని పేర్కొన్నాడు. అయినప్పటికీ, మరియమ్ తన 9 ఏళ్ల కొడుకు, 6 ఏళ్ల కుమార్తెను అక్రమంగా పాకిస్తాన్‌లో ఉంచుకుంది. ఇది ఇమ్మిగ్రేషన్ చట్టానికి విరుద్ధమని, కాబట్టి తన పిల్లలను భారత్‌కు తిరిగి తీసుకురావాలని ముస్తాక్ కోరుతున్నాడు. కాగా.. న్యాయమూర్తి నితిన్ జామ్దార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ వ్యాజ్యాన్ని విచారించింది. ఈ అంశం రెండు దేశాలకు సంబంధించినది కావడంతో కోర్టు విదేశాంగ మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసి స్పందన కోరింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 29న జరగనుంది.
అసలేం జరిగిందంటే..
ముస్తాక్, మరియమ్ చౌదరి ప్రేమకథ లండన్‌లో ప్రారంభమైంది. కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత, ఈ జంట 2012 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. అనంతరం మరియం భారతదేశానికి వచ్చి, ఆమె ఇక్కడ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. ఈలోగా వారికి ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే, 2020 సంవత్సరంలో, ఆమె తన పిల్లలతో కలిసి పాకిస్తాన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె పిల్లల చట్టపరమైన సంరక్షకత్వం కోసం 2021లో లాహోర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను లాహోర్ కోర్టు ఆమోదించింది.