రాజ్యసభ సభ్యుడిగా ప్రముఖ నటుడు Mithun Chakraborty?

ABN , First Publish Date - 2022-07-05T16:53:44+05:30 IST

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్రముఖ సినీనటుడు మిథున్ చక్రవర్తిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ అధిష్ఠానవర్గం యోచిస్తున్నట్లు సమాచారం....

రాజ్యసభ సభ్యుడిగా ప్రముఖ నటుడు Mithun Chakraborty?

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు ప్రముఖ సినీనటుడు మిథున్ చక్రవర్తిని రాజ్యసభకు పంపించాలని బీజేపీ అధిష్ఠానవర్గం యోచిస్తున్నట్లు సమాచారం.పశ్చిమ బెంగాల్‌లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేసిన మిథున్‌ను రూపా గంగూలీ స్థానంలో రాజ్యసభ సభ్యుడిగా పంపించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అనంతరం మిథున్ చక్రవర్తి క్రియాశీల రాజకీయాల్లోకి రాలేదు. రాజ్యసభ సభ్యత్వం ఆయన్ను వరిస్తే బెంగాల్ రాజకీయాల్లో మిథున్ చక్రవర్తి మళ్లీ యాక్టివ్ రోల్‌లో కనిపిస్తారని భావిస్తున్నారు. డిస్కో డాన్సర్‌ సినిమా ద్వారా క్రేజ్ సంపాదించిన మిథున్ ఆరోగ్యం బాగోలేక కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 


రూప గంగోపాధ్యాయ, స్వపన్ దాస్‌గుప్తాల రాజ్యసభ పదవీకాలం ముగిసింది. రాష్ట్రపతి ఎన్నికలు ముందున్నాయి. ఆ ఎన్నికల్లో రాజ్యసభ ఎంపీలు ఓటు వేస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ముందే రాజ్యసభలో బీజేపీ ఖాళీలను భర్తీ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఎంపీ పదవి వరిస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మిథున్ చక్రవర్తి కోల్‌కతాకు వచ్చి బీజేపీ కార్యాలయాన్ని సందర్శించడం సంచలనం రేపింది.ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి రెండు ఓట్లు చాలా ముఖ్యమైనవి.పశ్చిమబెంగాల్ నుంచి ఖాళీ అయిన ఈ రెండు స్థానాలకు అభ్యర్థులు బెంగాల్ నుంచి మాత్రమే ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వానికి కేంద్రం హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఢిల్లీ నేతల పిలుపు మేరకు మిథున్ చక్రవర్తి కోల్‌కతా వచ్చారు. 


మిథున్ సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సుకాంత మజుందార్‌తో సమావేశమయ్యారు. మిథున్‌ను రాబోయే రోజుల్లో రాష్ట్ర బీజేపీకి ఎలా చురుగ్గా ఉపయోగించుకుంటారనే దానిపై ప్రాథమిక చర్చలు జరిగినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఈసారి బీజేపీకి పూర్తి స్థాయిలో అండగా ఉంటానని,పార్టీ ఇచ్చిన పనిని కొనసాగిస్తానని మిథున్ చక్రవర్తి ప్రకటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.


Updated Date - 2022-07-05T16:53:44+05:30 IST