Oscars 2022 నిర్వహకులపై మండిపడుతున్న లతా మంగేష్కర్ ఫ్యాన్స్.. ఏం జరిగిందంటే..
ABN , First Publish Date - 2022-03-28T19:49:51+05:30 IST
లతా మంగేష్కర్.. భారతదేశంలో ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా..

లతా మంగేష్కర్.. భారతదేశంలో ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతిశయోక్తి కాదు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఈ గాయని పాటలతో సినిమాల్లో తనదైన ముద్ర వేయడమే కాకుండా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అయితే గతేడాది కరోనా కారణంగా ఈ గాయని మరణించడంతో ఎంతోమంది ఆమె అభిమానులు షాక్‌కి గురయ్యారు. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా ఆమెని గుర్తు చేసుకుంటూ అభిమానాన్ని తెలుపుతూ ఉంటారు. తాజాగా ఈ లెజెండరీ గాయనిని అవమానించారంటూ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కార్యక్రమ నిర్వహకులను ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి.. ఏటా జరిగే ఆస్కార్ అవార్డుల్లో వివిధ దేశాలకి చెందిన దివంగత సినీ ప్రముఖులకు ఖచ్చితంగా నివాళులు అర్పిస్తూ ఉంటారు. మార్చి 27న జరిగిన 94వ ఆస్కార్ అవార్డుల వేడుకలో సైతం సిడ్నీ పోయిటియర్, విలియం హర్ట్, ఇవాన్ రీట్‌మాన్, బెట్టీ వైట్, నెడ్ బీటీ, సాలీ కెల్లర్‌మాన్, డీన్ స్టాక్‌వెల్, పీటర్ బొగ్డనోవిచ్, రిచర్డ్ డోనర్ వంటి దివంగత హాలీవుడ్ ప్రముఖులకు, అలాగే.. ఫ్రెంచ్ స్టార్ జీన్-పాల్ బెల్మోండోకి సైతం నివాళులు అర్పించారు. అయితే ఇటీవలే మరణించిన భారతీయ గాయని లతా మంగేష్కర్‌ని మాత్రం వారు గుర్తుచేసుకోలేదు.
ఇది లతా మంగేష్కర్ అభిమానుల కోపానికి కారణమైంది. దీంతో ఆస్కార్ నిర్వాహకులపై విమర్శలు చేయడం ప్రారంభించారు. లేజెండరీ గాయనిని పట్టించుకోరా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఓ అభిమాని.. ‘ఇండియన్ నైటింగేల్ లతా మంగేష్కర్‌కి ఆస్కార్ ఎందుకు నివాళి అర్పించలేదు. ఆమె ఓ లెజెండ్. ఈ ఘటన విచిత్రమే కాదు. క్షమించరానిది కూడా’ అంటూ ట్వీట్ చేశాడు.
ఓ లేడి అభిమాని అయితే.. ‘ఎన్నో అద్భుతమైన ప్రపంచ రికార్డులను సెట్ చేసిన లతా మంగేష్కర్ అన్ని ఆస్కార్స్‌లో ప్లే చేసిన పాటలకంటే ఎక్కువే పాడారు. అయినప్పటికీ ఆస్కార్స్ 2022 మెమోరియంలో ఆమెను గౌరవించకపోవడం సరికాదు. ఇది చూస్తుంటే వివక్ష ఇంకా కొనసాగుతోందని నాకు అనిపిస్తోంది’ అని ఎంతో ఎమోషనల్‌గా, ఘాటుగా ట్వీట్ చేసింది. అలాగే మరికొందరూ సైతం ఆస్కార్ 2022లో లతా మంగేష్కర్‌కి నివాళి అర్పిస్తారని అనుకున్నట్లు, కానీ అలా జరగకపోవడం చాలా బాధాకరం అంటూ ట్వీట్స్ చేశారు. అలాగే ఇండియన్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్‌ను కూడా గుర్తు చేసుకోకపోవడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.