The Kashmir Files: ఇదో వల్గర్ చిత్రం.. ఇజ్రాయెల్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2022-11-29T18:24:00+05:30 IST
ఈ ఏడాది భారతీయ బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించిన అతి కొద్ది సినిమాల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) మూవీ ఒకటి...

ఈ ఏడాది భారతీయ బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించిన అతి కొద్ది సినిమాల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files) మూవీ ఒకటి. ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 350 కోట్లు వసూలు చేసిన బ్లాక్ బ్లస్టర్‌గా నిలిచింది. 1990లలో కశ్మీర్ లోయలో కశ్మీర్ పండిట్లపై జరిగిన దురాగతాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రంపై ఐఎఫ్ఎఫ్ఐ 2022 ఛైర్ పర్సన్ నడవ్ లపిడ్ (Nadav Lapid) సంచలన వ్యాఖ్యలు చేశాడు. లపిడ్ ఇజ్రాయెల్ చెందిన ప్రముఖ సినీ దర్శకుడు, రచయిత.
నవంబర్ 20 నుండి నవంబర్ 28 వరకు గోవాలో జరిగిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ని ప్రదర్శించారు. ఈవెంట్ ముగింపు వేడుకలో జ్యూరీ చైర్‌పర్సన్ నడవ్ లాపిడ్ మాట్లాడుతూ ఈ సినిమాపై విమర్శలు చేశారు. ఆ కార్యక్రమంలో నడవ్ మాట్లాడుతూ.. ‘ఈ విభాగంలో ప్రదర్శించిన 15 సినిమాల్లో 14 చాలా బావున్నాయి. కానీ 15వ సినిమా కశ్మీర్ ఫైల్స్ నచ్చలేదు. ఆ సినిమాని చూసి అందరం చాలా డిస్టర్బ్ అయ్యాం. దిగ్భ్రాంతికి గురయ్యాం. ఇది కళాత్మక పోటీకి తగని అసభ్య చిత్రంగా మాకు అనిపించింది. ఇటువంటి ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవంలో అలాంటి వల్గర్ చిత్రాన్ని ఎందుకు ప్రదర్శించారో అర్థం కాలేదు. ఆత్మ విమర్శను ఇక్కడ తీసుకోగలరు కాబట్టి ఇంత బహిరంగంగా అందరి ముందు మాట్లాడుతున్నా’ అని చెప్పుకొచ్చాడు.
ఐఎఫ్ఎఫ్ఐ 2022 జ్యూరిలో నాదవ్‌తో పాటు అమెరికన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ జింకో గోటో, ఫ్రెంచ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ జేవియర్ అంగులో బార్టురెన్, ఫ్రెంచ్ ఎడిటర్ పాస్కేల్ చవాన్స్, జాతీయ అవార్డు గెలుచుకున్న భారతీయ దర్శక రచయిత సుదీప్తో సేన్ సభ్యులుగా ఉన్నారు.
Read more