iBOMMA: ఇండియాలో ఇకపై ఆ సేవలు మాత్రమే అందిస్తామంటూ..
ABN , First Publish Date - 2022-08-23T22:03:37+05:30 IST
ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్ల కారణంగా సామాన్యుడు థియేటర్స్‌కి వెళ్లి చూడలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది

ప్రస్తుతం ఉన్న టికెట్ల రేట్ల కారణంగా సామాన్యుడు థియేటర్స్‌కి వెళ్లి చూడలేని పరిస్థితి నెలకొంది. దీంతో చాలామంది ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేవరకూ ఆగి అప్పుడు చూస్తున్నారు. అయితే.. ఓటీటీలు కూడా చాలా ఉండడంతో అన్నింటినీ డబ్బులు కట్టి సబ్‌స్ర్కైబ్ చేసుకొని సాధారణ సినీ అభిమానులకు కుదరని పని. దీంతో ఆ సినిమాలని ఏదో ఒక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూడటానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందులో.. ఇటీవలికాలంలో బాగా పాపులారిటీ సాధించిన సైట్ ఐబొమ్మ(iBOMMA). తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ గురించి తెలియని సినీ లవర్ ఉండడంటే అతిశయోక్తి లేదు.
ఈ సైట్లో ఓటీటీలలో విడుదలైన సినిమాల హెచ్డీ ప్రింట్లని పెడుతుంటారు. దీంతో నెట్ అందుబాటులో ఉన్నవారు టీవీ, మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడం లేదా డైరెక్ట్ ప్లే చేయడం ద్వారా చూసే వెసులుబాటు ఉంది. అయితే.. ఈ సైట్ తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలోనూ అందుబాటులో ఉంది. ఇతర దేశాల్లోనూ ఈ వెబ్‌సైట్‌కి మంచి పాపులారిటీ ఉంది. అయితే.. గత కొన్ని రోజులుగా ఈ సైట్ మెయిన్టెనెన్స్ ఖర్చు ఎక్కువ అవుతుండడంతో ఇండియాలో దాన్ని పూర్తిగా మూసీ వేయాలనుకుంటున్నట్లు ఆ సైటు యాజమాన్యం ప్రకటించింది. కానీ.. చాలామంది యూజర్లు రిక్వెస్టు మేరకు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.
అయితే.. తాజాగా ఈ సైట్ యాజమాన్యం ఇండియన్ యూజర్లకి షాక్ ఇచ్చింది. ఇకపై చివరి 30 సినిమాలు మాత్రమే సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. సెర్చింగ్ ఆప్షన్ని కూడా తొలగించేందుకు ఆలోచిస్తున్నట్లు తెలిపింది. దీని కారణం నిర్వహణ ఖర్చులు ఎక్కువ అవుతుండడంతోపాటు ప్యాషన్ తో పనిచేస్తోంటే తమ మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఐబొమ్మ యాజమాన్యం చెప్పుకొచ్చింది. అయితే అసలు ఏం జరిగిందనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వ లేదు. కాగా.. ఇది పైరసీ సైట్ కావడం వల్ల.. దీన్ని ఉపయోగించడం చట్టరీత్యానేరమనే విషయాన్ని యూజర్లు దృష్టిలో పెట్టుకోవడం మంచిది.