Hrithik Roshan: ఫ్యాన్ కాళ్లు మొక్కిన హృతిక్ రోషన్.. మీరు నిజంగా గ్రేటంటూ..
ABN , First Publish Date - 2022-08-28T15:29:31+05:30 IST
బాలీవుడ్లో భారీ అభిమానగణం ఉన్న యాక్టర్స్‌లో హృతిక్ రోషన్ ఒకరు. బీ టౌన్లో ఎంతో వినయ విధేయతలతో మెలిగే నటుల్లో ఈ క్రిష్ నటుడు
బాలీవుడ్లో భారీ అభిమానగణం ఉన్న యాక్టర్స్‌లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) ఒకరు. బీ టౌన్లో ఎంతో వినయ విధేయతలతో మెలిగే నటుల్లో ఈ క్రిష్ నటుడు కచ్చితంగా ఉంటారు. ఆయన సామాన్యులకు ఇచ్చే గౌరవం కారణంగా ఈ హాండ్సమ్ హీరో పలుమార్లు వార్తల్లో సైతం నిలిచాడు. మంచి ప్రవర్తనతో ఈ నటుడు తాజాగా సైతం మరోసారి వార్తల్లో నిలిచాడు.
హృతిక్ ప్రస్తుతం ‘విక్రమ్ వేద(Vikram Vedha)’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 2017లో వచ్చిన తమిళ హిట్ మూవీ ‘విక్రమ్ వేద’కి ఇది అధికారిక రిమేక్. మాతృకకి డైరెక్షన్ చేసిన పుష్కర్, గాయత్రినే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళ సినిమాలో విజయ్ సేతుపతి పాత్రని హృతిక్ చేస్తున్నాడు. ఈ మూవీలో మరో ప్రధానపాత్రలో సైఫ్ అలీఖాన్ (Saif AliKhan) నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. అందులో హృతిక్ నటనకి ప్రశంసలు వస్తున్నాయి.
ఈ తరుణంలోనే హృతిక్ ముంబైలో జరిగిన ఓ ఈవెంట్‌కి హాజరయ్యాడు. దీంతో ఎప్పటిలాగే అభిమానులు ఆయన్ని చూసి రచ్చ రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో.. ఓ అభిమాని సడెన్‌గా స్టేజ్ మీద ఉన్న హృతిక్ దగ్గరకి వచ్చి ఆయన కాళ్లు మొక్కాడు. దాంతో వెంటనే హృతిక్ సైతం ఆ అభిమాని పాదాలకు మొక్కాడు. ఈ వైరల్ వీడియోని చూసిన పలువురు నెటిజన్లు, ఫ్యాన్స్ నటుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘హృతిక్ నిజంగా గ్రేట్. ఆయనలాంటి వాడిని ఇంతవరకూ చూడలేదు’, ‘బాలీవుడ్లోనే చాలా వినయ విధేయతలు ఉన్న వ్యక్తి హృతిక్’, ‘హృతిక్ నిజంగా ఏంజెల్’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.