ఆ నటి ప్రమోట్ చేసే వస్తువులను కొననంటున్న బాలీవుడ్ సింగర్.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-17T20:19:34+05:30 IST

మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాన్‌మన్ సుకేష్ చంద్రశేఖర్‌తో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌..

ఆ నటి ప్రమోట్ చేసే వస్తువులను కొననంటున్న బాలీవుడ్ సింగర్.. కారణం ఏంటంటే..

మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాన్‌మన్ సుకేష్ చంద్రశేఖర్‌తో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez)‌కి ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈ భామకి సైతం సంబంధం ఉండొచ్చనే అభియోగంతో ఆమె సంబంధించిన దాదాపు 7 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఇటీవలే జప్తు చేసింది. ఈ నేపథ్యంలో బీ టౌన్ ప్రేక్షకులతోపాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఈ నటిపై విమర్శలు చేశారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనా మహాపాత్ర (Sona Mohapatra) సోషల్ మీడియాలో జాక్వెలిన్‌పై ఘాటుగా విమర్శలు చేసింది.


సోనా ట్విట్టర్‌లో జాక్వెలిన్‌ ఫొటోలు ఉన్న బ్యూటీ ఉత్పత్తుల ప్రకటన పిక్‌ని షేర్ చేసింది. దానికి.. ‘ఉచితంగా వచ్చే ఖరీదైన, లగ్జరీ బహుమతుల కోసం అడ్డదారులు తొక్కే.. ఇలాంటివారి వారు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ప్రమోట్ చేసే వస్తువులను కొనకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. మంచి నైపుణ్యంగానీ, మెచ్చుకోదగిన గుణంగానీ ఆమె దగ్గర ఉందా? లేదు. అందుకే అలాంటి వారు ప్రమోట్ చేసే వస్తువులను నేను కొనను’ అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చింది.


అంతేకాకుండా ఆ పోస్ట్‌ని కొనసాగిస్తూ.. ‘ఇలాంటి వారు రోల్ మోడల్స్‌గా రాబోయే తరం మీద చెడు ప్రభావాన్ని చూపుతారు. అంతేకాకుండా.. లింగ సమానత్వం గురించి నిబద్ధతతో మేం చేస్తున్న పోరాటాన్ని నాశనం చేస్తారు. అలాగే ఎదిగే మార్గం మరింత కఠినం అవుతుంది. తొందరగా ఎదగడానికి ఇలాంటి మహిళలు చేసే పనులు మమ్మల్ని మళ్లీ వెనక్కి నెట్టేస్తాయి’ అని సోనా వెటకారంగా, కొంచెం ఘాటుగా రాసుకొచ్చింది.


కాగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో, చంద్రశేఖర్‌ను ఫెర్నాండెజ్‌కు పరిచయం చేసిన సహాయకురాలు పింకీ ఇరానీపై ఏజెన్సీ అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. జాక్వెలిన్ కోసం ఇరానీ ఖరీదైన బహుమతులను ఎంచుకుని, చంద్రశేఖర్ చెల్లింపులు చేసిన తర్వాత వాటిని తనకి అప్పగించినట్లు ఆరోపణలు వచ్చాయి. పలువురు మోడల్స్, బాలీవుడ్ సెలబ్రిటీల కోసం చంద్రశేఖర్ దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేశాడని విమర్శలు ఉన్నాయి.Updated Date - 2022-05-17T20:19:34+05:30 IST

Read more