సౌత్, బాలీవుడ్ సినిమాల మధ్య ఎటువంటి పోటీ లేదంటున్న Karan Johar

ABN , First Publish Date - 2022-05-23T01:48:10+05:30 IST

బాలీవుడ్‌లో సౌత్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’(Bahubali) ప్రాంచైజీతో మొదలైన కలెక్షన్ల పర్వం ఇంకా కొనసాగుతునే ఉంది. దక్షిణాది నుంచి హిందీలోకి డబ్ అయిన

సౌత్, బాలీవుడ్ సినిమాల మధ్య ఎటువంటి పోటీ లేదంటున్న Karan Johar

బాలీవుడ్‌లో సౌత్ సినిమాలు భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’(Bahubali) ప్రాంచైజీతో మొదలైన కలెక్షన్ల పర్వం ఇంకా కొనసాగుతునే ఉంది. దక్షిణాది నుంచి హిందీలోకి డబ్ అయిన ‘కెజియఫ్’(KGF), ‘పుష్ప’(Pushpa), ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) బీ టౌన్‌లో భారీ స్థాయి కలెక్షన్లను కొల్లగొట్టాయి. ఈ నేపథ్యంలో సౌత్ వర్సెస్ నార్త్ అనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు స్పందించారు. తాజాగా బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు, ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ (Karan Johar) ఈ అంశంపై మాట్లాడాడు.        


‘జగ్‌జగ్ జీయో’ (Jugjugg Jeeyo) సినిమాకు కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరించాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. వరుణ్ ధావన్, కియారా అడ్వాణీ, అనిల్ కపూర్, నీతూ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్‌ను మే 22ను విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సౌత్ వర్సెస్ బాలీవుడ్ అంశంపై మీడియా ప్రశ్నించింది. అందుకు కరణ్ జోహార్ సమాధానమిచ్చాడు. ‘‘సౌత్ సినిమాలు ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజియఫ్’ మంచి వసూళ్లను రాబట్టాయి. ఈ కలెక్షన్లను చూసి అవి నిజమైన ఇండియన్ సినిమా అని నేను గర్వంగా చెప్పగలను. భారతీయ చిత్రాల కీర్తి, ప్రతిష్ఠలను ఇవి మరింత పెంచాయి. రాజమౌళి, సుకుమార్, కెజియఫ్ మేకర్స్ మనం ఎంత దూరం ప్రయాణించగలం, ఇంక ఎంత సాధించగలమో చెప్పారు. వారందరు కలసి సినిమా స్థాయిని పెంచారు. ‘గంగూబాయి కతియావాడి’ కూడా మంచి కలెక్షన్లను కొల్లగొట్టింది. ‘భూల్ భూలయ్యా-2’ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ లిస్ట్‌లో మా చిత్రం ‘జగ్‌జగ్ జీయో’ చేరాలని ఆశిస్తున్నాను. తెలుగు, తమిళ్, మరాఠీ ఇలా ప్రతి భాష నుంచి వస్తున్న సినిమాలు భారీ వసూళ్లను సాధించాలని కోరుకుంటున్నాను. ఒకరిని, మరొకరితో పోల్చుకోవడానికీ మనకు భాష అవసరం లేదు. భారతీయ సినిమాను చూసి గర్వపడాలి’’ అని కరణ్ జోహార్ పేర్కొన్నాడు.           


దక్షిణాది, బాలీవుడ్ సినిమాల మధ్య ఎటువంటి పోటీ లేదని కరణ్ జోహార్ తెలిపాడు. ‘‘నేను కొన్నేళ్ల క్రితమే ‘బాహుబలి’ని ప్రజెంట్ చేశాను. నిజం చెప్పాలంటే ఇండియన్ సినిమా మీద నాకు నమ్మకం ఉంది. ఒకే ఇండస్ట్రీలో ఏవిధంగా పోటీ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే. నార్త్‌లో సౌత్ సినిమాలు భారీ వసూళ్లను రాబట్టినప్పుడే చిత్ర పరిశ్రమ అంతా ఒకటిగా మారింది’’ అని అతడు స్పష్టం చేశాడు.

Updated Date - 2022-05-23T01:48:10+05:30 IST