నేను అతడిని కలుసుకోవడంతోనే.. అభిమానులను చూసే కోణం మారింది: రణ్‌వీర్ సింగ్

ABN , First Publish Date - 2022-03-17T01:12:52+05:30 IST

యాక్టింగ్, ఫ్యాషన్, స్టైల్‌తో అభిమానులను అలరించే బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్

నేను అతడిని కలుసుకోవడంతోనే.. అభిమానులను చూసే కోణం మారింది: రణ్‌వీర్ సింగ్

యాక్టింగ్, ఫ్యాషన్, స్టైల్‌తో అభిమానులను అలరించే బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్. ఈ మధ్యనే ‘83’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా అతడు నటిస్తున్న చిత్రం ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మధ్యనే షూటింగ్ నుంచి విరామం లభించడంతో హాలీడే‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. బ్రిటన్‌లో ఇంగ్లిష్ ప్రీమీయర్ లీగ్(ఈపీఎల్) గేమ్స్‌ను చూడటానికి వెళ్లాడు. ఈపీఎల్‌లో అతడికి ఆర్సెనల్ ఫుట్ బాల్ క్లబ్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఫుట్‌బాల్ ఆటగాడైన థియరీ హెన్రీ అంటే చాలా అభిమానం. థియరీ హెన్రీని 2016లోనే రణ‌వీర్ సింగ్ కలుసుకున్నాడు. ఆ మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.  


ఆర్సెనల్ ఆటగాడు థియరీ హెన్రీని కలుకోవడం తన జీవితంలో చెప్పుకోదగ్గ పరిణామం అని రణ్‌వీర్ చెప్పాడు. ‘‘సెలబ్రెటీగా ఉండి అభిమానిని ఏ విధంగా చూడాలనే విషయం అతడిని కలుసుకోవడంతోనే నాకు అర్థమైంది. అతడు గతంలో ఓ బ్రాండ్ ప్రచారం నిమిత్తం ముంబైకి వచ్చాడు. నా అభిమాన ఆటగాడిని కలుసుకోగలనా అనే ప్రశ్న నాలో తలెత్తింది. నాకు తెలిసిన వ్యక్తుల ద్వారా అతడిని కలుసుకున్నాను. అతడు నన్ను, నా స్నేహితులని అద్భుతంగా పలకరించాడు. ఆ సమయంలో నేను ఉబ్బితబ్బిబ్బయ్యాను. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోలేకపోయాను. ఆనంద భాష్పాలను రాల్చాను. అతడిని కలుసుకోవడం ఎంతో అద్భుతమైన విషయం. ఈ ఘటన నా జీవితాన్నే మార్చింది. అప్పటి నుంచి నేను అభిమానులను చూసే కోణం మారింది. అభిమానుల భావోద్వేగాలకు నేను కూడా ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు అదే విధంగా జరిగింది’’ అని రణ్‌వీర్ సింగ్ తెలిపాడు. 


థియరీ హెన్రీ ఫ్రాన్స్‌కు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు. ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున అతడు అనేక రికార్డులను నెలకొల్పాడు. హెన్రీ 1999 నుంచి 2007మధ్య ఆర్సెనల్‌కు ఆడాడు.

Updated Date - 2022-03-17T01:12:52+05:30 IST

Read more