అమితాబ్, షారుఖ్, అజయ్, అక్షయ్‌కి... గుట్కా మరకలు చూపించిన IAS ఆపీసర్!

ABN , First Publish Date - 2022-04-22T23:39:55+05:30 IST

ఓ ఐఏఎస్ ఆఫీసర్ గుట్కాలకు ప్రచారం కల్పించటం విషయంలో నేరుగా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్‌ను టార్గెట్ చేశారు. వార్ని ట్యాగ్ చేస్తూ సొషల్ మీడియాలో ఆలోచింపజేసే ట్వీట్ చేశారు...

అమితాబ్, షారుఖ్, అజయ్, అక్షయ్‌కి... గుట్కా మరకలు చూపించిన IAS ఆపీసర్!

ఆరోగ్యానికి ఎంతో హానికరం అవ్వటమే కాకుండా క్యాన్సర్‌కు కూడా దారితీసే గుట్కాలను బాలీవుడ్ స్టార్స్ ఎండార్స్ చేయటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సొషల్ మీడియాలో దుమారం రేగటంతో ఈ మధ్యే అక్షయ్ కుమార్ ఇక పై పొగాకు ఉత్పత్తులకు తాను ప్రచారం చేయనని ప్రకటించాడు. అయితే, తాజాగా ఓ ఐఏఎస్ ఆఫీసర్ గుట్కాలకు ప్రచారం కల్పించటం విషయంలో నేరుగా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్‌ను టార్గెట్ చేశారు. వార్ని ట్యాగ్ చేస్తూ సొషల్ మీడియాలో ఆలోచింపజేసే ట్వీట్ చేశారు... 


ఐఏఎస్ ఆఫీసర్ అవనీశ్ శరణ్ కోల్‌కతాలోని చారిత్రక హౌరా బ్రిడ్జ్ పరిస్థితిని ప్రతిబింబిస్తూ ఓ ట్వీట్ చేశారు. అందులో ఆయన ‘‘లాలా జలంతో తడిసిన గుట్కా... 70 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రఖ్యాత వారధిని... తుప్పుపట్టేలా చేస్తోందని కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ తెలియజేసింది. గుట్కా నమిలి ఉమ్మివేసే వారి నుంచీ హౌరా బ్రిడ్జ్ దాడిని ఎదుర్కొంటోంది’’ అన్నారు. అంతే కాదు, ఐఏఎస్ ఆఫీసర్ ఓ ఫోటోను కూడా నెటిజన్స్‌తో షేర్ చేశారు. అందులో మనం హౌరా బ్రిడ్జ్‌కు సంబంధించిన ఓ పిల్లర్‌పై తీవ్రస్థాయిలో గుట్కా మరకలు కనిపించటం చూడవచ్చు. ఇక ఈ ట్వీట్‌కు సదరు ఆఫీసర్ షారుఖ్, అజయ్, అక్షయ్, బిగ్ బి లాంటి వార్ని ట్యాగ్ చేయటం ఆన్‌లైన్‌లో పెద్ద చర్చకే దారి తీసింది. ఆరోగ్యానికి ఎలాగూ హానీ చేసే గుట్కాలు పరిసరాల్ని, ప్రఖ్యాత చారిత్రక కట్టడాల్ని కూడా పాడు చేస్తున్నాయంటూ చాలా మంది విచారం వ్యక్తం చేశారు. అటువంటి హానికర ఉత్పత్తులకి బోలెడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే బాధ్యతాయుతమైన బాలీవుడ్ సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించటం తగదని వ్యాఖ్యలు చేశారు. షారుఖ్, అజయ్ ‘విమల్’ పాన్ మసాలాకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తుండగా ఆ మధ్య అమితాబ్ కూడా ఓ పొగాకు ఉత్పత్తికి ప్రచారం కల్పించేందుకు ముందుకొచ్చాడు. కానీ, జనం నుంచీ విమర్శలు రావటంతో ఆయన వెనక్కి తగ్గాడు. 

Updated Date - 2022-04-22T23:39:55+05:30 IST