BoycottBollywood: ట్రెండింగ్‌పై స్పందించిన అక్షయ్ కుమార్.. అది సరైన పద్ధతికాదంటూ..

ABN , First Publish Date - 2022-08-09T21:17:12+05:30 IST

బాలీవుడ్‌లో గత కొన్నిరోజులుగా సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే...

BoycottBollywood: ట్రెండింగ్‌పై స్పందించిన అక్షయ్ కుమార్.. అది సరైన పద్ధతికాదంటూ..

బాలీవుడ్‌లో గత కొన్నిరోజులుగా సినిమాలను బాయ్‌కాట్ (boycott) చేయాలంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్  ‘రక్షాబంధన్ (Raksha Bandhan)’, ఆలియా భట్ నటించిన ‘డార్లింగ్స్‌’పై ఇటువంటి యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి. ఈ పరిణామంపై తాజాగా అక్షయ్ కుమార్ స్పందించాడు.


అక్షయ్ కుమార్ (Akshay Kumar) నటించిన తాజా చిత్రం ‘రక్షాబంధన్’. ఈ మూవీ ఆగస్టు 11న విడుదలకానుంది. ఈ తరుణంలో ఈ మూవీని కూడా బాయ్‌కాట్ చేయాలంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ పరిస్థితిపై అక్షయ్ స్పందించాడు. అక్షయ్ మాట్లాడుతూ.. ‘మీకు సినిమా చూడాలని అనిపించకపోతే చూడొద్దు.. ఇది స్వేచ్ఛ దేశం, అందులో సినిమా పరిశ్రమ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా చూడాలనుకుంటున్నారా లేదా అనేది వారి ఇష్టం. అది బట్టల పరిశ్రమ లేక సినిమా పరిశ్రమ.. ఏ పరిశ్రమ అయినా సరే.. అన్నీ దేశ ఆర్థిక వ్యవస్థకు సహాయపడతాయి. కానీ సినిమాలను బహిష్కరించడం అస్సలు సమంజసం కాదు’ అని చెప్పుకొచ్చాడు.


అలాగే.. కొన్ని రోజుల క్రితం ఇదే విషయం మీద ఆమీర్ ఖాన్(Aamir khan).. ‘బాయ్‌కాట్ బాలీవుడ్.. బాయ్‌కాట్ ఆమీర్ ఖాన్.. బాయ్‌‌కాట్ లాల్ సింగ్ చడ్డా.. ఇలాంటివి విని నాకు చాలా బాధేసింది. చాలామంది నాకు ఈ దేశం అంటే ఇష్టం లేదని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నాకు ఈ దేశం అంటే నిజంగా చాలా ఇష్టం’ అని తెలిపాడు. కాగా.. ‘లాల్ సింగ్ చడ్డా’, ‘రక్షాబంధన్’ ఒకేరోజు విడుదలకానున్నాయి. ఈ రెండు మూవీస్‌లో ఏది ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుందో చూడాలని అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2022-08-09T21:17:12+05:30 IST