భావోద్వేగాల నాన్న!

ABN , First Publish Date - 2021-01-24T16:02:00+05:30 IST

‘మల్లేశం’, ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’, ఓటీటీలో విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’లో ఆయన భావోద్వేగాలతో కూడుకున్న తండ్రి పాత్రలు పోషించారు.

భావోద్వేగాల నాన్న!

‘మల్లేశం’, ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’, ఓటీటీలో విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’లో ఆయన భావోద్వేగాలతో కూడుకున్న తండ్రి పాత్రలు పోషించారు. చిత్రసీమలో ఇప్పుడిప్పుడే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. రాబోయే పదికి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తున్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఆనంద చక్రపాణి చెబుతున్న విశేషాలివి...


‘ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘అనగనగా ఓ అతిథి’లో నేను చేసిన పాత్రను ప్రేక్షకులు అంత త్వరగా మరువలేరు. నేను బాగా చేశానని ప్రశంసించినవారిలో అగ్ర దర్శకులు, నటులు, నిర్మాతలు ఉన్నారు. సినిమా విడుదలైన తరువాత రోజుకి వంద మెసేజ్‌లు వచ్చేవి... ‘మీరు చాలా సహజంగా నటించారు’... అని మెచ్చుకుంటుంటే సంతోషమేసింది. ‘మల్లేశం’ నా సెకండ్‌ ఇన్నింగ్స్‌కి లాంచ్‌ ప్యాడ్‌ అయితే... అది విడుదలైన ఏడాదిలో మరో గొప్ప పాత్ర ‘అనగనగా ఓ అతిథి’లో చేశాను.  


ప్రతి పాత్ర కోసం మానసికంగా, శారీరకంగా సిద్థమవడం ఎంతో కష్టమైన ప్రక్రియ. నటుడనేవాడు అనేక పాత్రల్లో ఒదిగిపోవాల్సి వస్తుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధం లేని పరిస్థితుల్లో జీవించాల్సి వస్తుంది. ఉదాహరణకు... కుమారుడు మరణించే సన్నివేశం ఉందనుకోండి? నిజంగా తన బిడ్డ మరణిేస్త ఏం జరుగుతుందనేది అనుభవిస్తూ తెరపైకి తీసుకురావాలి. అదెంత కఠినమైన సందర్భమో వర్ణించలేం.  


నేను సమయాన్ని, అదృష్టాన్ని నమ్ముతాను. నా జీవితంలో అనుభవాలు అటువంటివి. నా మొదటి సినిమా ‘దాసి’ 1989లో విడుదలైంది. తర్వాత నాకు తగిన పాత్ర రాలేదు. బతకడం కోసం ఎన్ని పనులు చేసినా, నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలనే అవకాశం ఎప్పుడొస్తుందా? అని కాచుకుని కూర్చున్న మాట నిజం. ఆ అన్వేషణలో వచ్చిన అవకాశం ‘మల్లేశం’. నిజంగా 30 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో నటుడిగా నాకు పునర్జన్మ లభించింది. జీవితంలో నాకు లభించిన గొప్ప అవకాశం అది. ‘మల్లేశం’లో నా పాత్రను, నటనను రకరకాలుగా అర్థం చేసుకున్నారు. ‘ఎమోషనల్‌ ఫాదర్‌గా ఇతను పర్ఫెక్ట్‌’ అనుకున్నారు. ఇప్పుడు ‘అనగనగా ఓ అతిథి’ తర్వాత మరిన్ని వైవిధ్యమైన పాత్రలు వస్తున్నాయి. 


చాలావరకు నేను పోషించినవి తండ్రి పాత్రలే. తండ్రి పాత్రల్లోనూ నేను అన్వేషించేది ఏమిటంటే... గతంలో పోషించిన పాత్రలకు, ఈ పాత్రకు మధ్య వైవిధ్యం ఉందా? లేదా? అనేది చూస్తా. కథలో పాత్ర పరిధి ఎంత? నటనకు అవకాశం ఎంతుంది? అనేవి చూస్తా.  ఉత్సవ విగ్రహం లాంటి పాత్ర చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అయితే నాకు నచ్చిన దర్శకులతో పనిచేేస అవకాశాలు వచ్చిన కొన్ని సందర్భాల్లో మాత్రం పాత్ర ఏమిటనేది చూడకుండానే సినిమా చేశా. కొన్ని సందర్భాల్లో సినిమా నిడివి ఎక్కువైందని దర్శక, నిర్మాతలు భావిస్తే, ముందుగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుల సన్నివేశాలకే కత్తెర పడుతుంది. పాత్ర కోసం ప్రాణం పెడతాం కాబట్టి అలాంటప్పుడు బాధగా ఉంటుంది. అయితే ఇండస్ర్టీలో ఇవన్నీ సహజం.


ఒక నటుడు పాత్రలో లీనం కావాలంటే ముందే సైకలాజికల్‌ ప్రాసెస్‌ కొంత జరుగుతుంది. సన్నివేశాలను బట్టి పాత్రను అర్థం చేసుకున్నాక దాని స్వభావం తెలుస్తుంది. అటువంటి స్వభావం కల వ్యక్తులు సమాజంలో మన చుట్టూ ఎవరున్నారని ఆలోచిస్తా. వాళ్లతో నాకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటా. అవసరం అనుకుంటే మరోసారి వాళ్లను కలుస్తా. ‘మల్లేశం’ కోసం కొన్ని రోజుల ముందే పల్లెటూరుకు వెళ్లా. ‘అనగనగా ఓ అతిథి’లో తాగుబోతుగా నటించా. ‘నిజంగా తాగుబోతులు కూడా అలా ఉండరేమో! అంత బాగా చేశారు... ఎలా సాధ్యమైంది?’ అని చాలామంది నన్ను అడిగారు. నటుడికి అబ్జర్వేషన్‌ చాలా ముఖ్యం. అర్చన, నసీరుద్దీన్‌ షా, నవాజుద్దీన్‌ సిద్థిఖీ వంటి వాళ్లు అబ్జర్వేషన్‌ బాగా చేస్తారు. అందువల్ల తెరపై పాత్ర మాత్రమే కనిపిస్తుంది. సూక్ష్మ పరిశీలన ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. 


తెలుగు సినిమాల్లో విగ్రహంలా కనిపించాలనో, క్యారెక్టర్‌ ఫిట్నెస్‌ కోసమో పరభాషా నటులను తెచ్చుకున్న సందర్భాలు ఎక్కువ. నటనకు ఆస్కారమున్న పాత్రలకు, కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలకు తెలుగులో చేయగలిగిన నటులు ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకుంటున్నారు. వెబ్‌ సినిమాలు, సిరీస్‌లు పెరగడం... మూస ధోరణి సినిమాలు తగ్గడంతో తెలుగు క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు అవకాశాలు పెరుగుతున్నాయి.  


పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’లో అనన్యా నాగళ్ల తండ్రిగా, నాగచైతన్య హీరోగా శేఖర్‌ కమ్ముల తీస్తున్న ‘లవ్‌ స్టోరీ’లో సాయి పల్లవికి తండ్రిగా, వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ‘విరాటపర్వం’లో కానిేస్టబుల్‌ పాత్రలో, అల్లరి నరేశ్‌ ‘నాంది’లో కీలక పాత్రలో నటించా.  ‘జీవో 111’లో ప్రధాన పాత్రలో నటిస్తున్నా. ‘ఊరికి ఉత్తరాన’లో హీరో తండ్రిగా నటిస్తున్నా. మొత్తం మీద నేను నటించిన 12 చిత్రాలు ఈ ఏడాదిలో విడుదల కానున్నాయి..’ అంటూ ముగించారు. చక్రపాణి మరిన్ని వైవిధ్యభరిత పాత్రల్ని పోషించాలని కోరుకుందాం.  

- సత్య పులగం


గ్లిజరిన్‌ లేకుండానే...

ఇప్పటివరకు నేను ఏ సినిమాలో కూడా గ్లిజరిన్‌ అనేది వాడలేదు.  సాధ్యమైనంత వరకు గ్లిజరిన్‌ వాడకుండా కన్నీళ్లు తెప్పిస్తా. ‘మల్లేశం’ సినిమాలో ఒక సీన్‌ కోసం దర్శకుడు ఏడు టేక్స్‌ తీశారు. ఆ సినిమా సింక్‌ సౌండ్‌లో చేశాం. నడిచిన శబ్దం వచ్చినా, దగ్గినా రీ టేక్‌కి వెళ్ళాల్సిందే. అయితే దర్శకుడు తీసిన ఏడు టేక్స్‌ కూడా గ్లిజరిన్‌ లేకుండానే కన్నీళ్లు తెప్పించా. ఇదేదో గొప్ప అని చెప్పడం లేదు. సీన్‌ సహజంగా ఉండాలనేది నా తపన. 

Updated Date - 2021-01-24T16:02:00+05:30 IST