ఓటీటీ ఫ్లాట్‌ఫాం ప్రారంభిస్తానంటున్న టీఆర్
ABN , First Publish Date - 2021-03-29T02:11:46+05:30 IST
హీరో సత్యరాజ్ హీరోగా శరవణా ఫిలిమ్స్ ఆర్ట్స్ పతాకంపై జి.సారా సమర్పణలో నిర్మాత జి.శరవణా నిర్మించిన చిత్రం ‘తన్నివండి’. దీనికి విద్య దర్శకత్వం

కోలీవుడ్: హీరో సత్యరాజ్ హీరోగా శరవణా ఫిలిమ్స్ ఆర్ట్స్ పతాకంపై జి.సారా సమర్పణలో నిర్మాత జి.శరవణా నిర్మించిన చిత్రం ‘తన్నివండి’. దీనికి విద్య దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య హీరోగా నటించగా, హీరోయిన్‌గా సంస్కృతి నటించింది. వీరితో పాటు బాలశరవణన్, తంబిరామయ్య, దేవదర్షిణి, వినుతలాల్, ఆడుకళం నరేన్ తదితరులు నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకనిర్మాత టి. రాజేందర్ తాజాగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా టీఆర్ మాట్లాడుతూ.. ఓటీటీ అనేది కాలపరిణామం. ఇకపై ఓటీటీలదే రాజ్యమని అందువల్ల నేను కూడా ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫాం లాంచ్ చేస్తానని తెలిపారు. చిన్న నిర్మాతలు, కొత్త దర్శకుల కోసమే. సినిమాలు నిర్మించి, విడుదల చేసేందుకు పోరాటం చేస్తున్న వారికోసం ఈ ఫ్లాట్‌ఫాం నెలకొల్పుతానని వెల్లడించారు.. థియేటర్లలో సినిమా టిక్కెట్ల ధరలు తగ్గించాలని ఎప్పటినుంచో కోరుతున్నాను. రైలులో కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, జనరల్ అని ఉంటాయి. కానీ, సినిమా థియేటర్‌లోనే ఒకే క్లాస్. సినిమా టిక్కెట్ ధర రూ.100, రూ.150, రూ.200గా ఉంటే పేద ఆడియన్స్ ఎలా థియేటర్‌కు వస్తారు? తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సినిమాలు థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శిస్తున్నారంటే అక్కడ టిక్కెట్ ధరలు రూ.50, రూ.70 మాత్రమే. ఈ విషయంలో ఎందుకో ప్రతి ఒక్కరూ మౌనంగా ఉంటున్నారు. థియేటర్‌కు 50 శాతం ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తారట. జీఎస్టీ మాత్రం ఫుల్‌గా చెల్లించాలట. ఇదేనా న్యాయం. ఇలాంటి విషయాలన్ని మాట్లాడేందుకు ఈ ‘తన్నివండి’ ట్రైలర్ లాంచ్ ఒక వేదికగా మారిందన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని టి. రాజేందర్ ఆకాంక్షించారు.