ఈ సినిమా కథ చదివి ఏడ్చేశా: Rajinikanth
ABN , First Publish Date - 2021-11-16T19:14:02+05:30 IST
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం ‘అన్నాత్తే (తెలుగులో ‘పెద్దన్న’)’. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ రివ్యూస్‌ని పొందింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం ‘అన్నాత్తే (తెలుగులో ‘పెద్దన్న’)’. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ రివ్యూస్‌ని పొందింది. కూతురికి చెందిన వాయిస్ బేస్డ్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ హూట్ యాప్ ద్వారా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు తలైవా.
రజనీ మాట్లాడుతూ..‘నేను నటించిన ‘పెట్టా’, శివ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘విశ్వాసం’ ఒకేసారి విడుదలయ్యాయి. ఆ మూవీ కూడా నా సినిమాతో పాటు మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఆ చిత్రాన్ని చూడాలని అనుకున్నా. ఆ మూవీ నిర్మాత సత్య జ్యోతి త్యాగరాజన్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఇంటర్వెల్ వరకూ ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. కానీ అంత పెద్ద విజయాన్ని ఎలా అందుకుందో అర్థం కాలేదు. అయితే ప్రీ-క్లైమాక్స్ వరకూ చూశాక నాలో ఉన్న అనుమానాలు పటాపంచాలు అయిపోయాయి. బాగా నచ్చడంతో మూవీ చివరి వరకూ చప్పట్లు కొడుతూనే ఉన్నా’ అని వెల్లడించారు.
అనంతరం నేను శివని కలిశానని సూపర్ స్టార్ తెలిపాడు. ఆయనతో హిట్ సినిమా తీయడం చాలా ఈజీ అని చెప్పిన ఆ దర్శకుడు 12 రోజుల్లో ‘అన్నాత్తే’ కథతో ఈ నటుడి దగ్గరకి వచ్చినట్లు రజనీ చెప్పాడు. కథ పూర్తి విన్న తర్వాత ఏడుస్తూ శివని కౌగిలించుకున్నట్లు తలైవా పేర్కొన్నాడు. వారు అనుకున్నట్లుగానే ఈ చిత్రం ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చాడు.
