ఎన్నికల్లో పనిచేయని ‘తారల’ మంత్రం.. వరుసబెట్టి ఓడిన సినీ తారలు
ABN , First Publish Date - 2021-05-04T20:17:50+05:30 IST
రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో సినీ గ్లామర్ ప్రభావం ఏమంతగా లేదని తేలిపోయింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కోలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులు చిత్తుగా ఓడిపోయారు.
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో సినీ గ్లామర్ ప్రభావం ఏమంతగా లేదని తేలిపోయింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున లేదా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కోలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులు చిత్తుగా ఓడిపోయారు. మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్ హాసన్ మాత్రం చివరి వరకు పోరాడి ఓటమి చెందారు. కోయంబత్తూరు సౌత్ స్థానం నుంచి బరిలోకి దిగిన ఈయన.. సమీప ప్రత్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదేవిధం గా చెన్నై పరిధిలోని మైలాపూరు, థౌజండ్‌లైట్, విరుగం బాక్కం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన సినీ తారలు కూడా ఓటమి పాలయ్యారు.
వీరిలో మైలాపూరు స్థానం నుంచి ఎంఎన్‌ఎం పార్టీ తరపున చేసిన నటి శ్రీప్రియ, థౌజండ్‌లైట్ స్థానం నుంచి కోటి ఆశలతో బరిలోకి దూకిన నటి ఖుష్బూ 33,044 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. అలాగే, విరుగంబాక్కం స్థానం నుంచి పోటీ చేసిన ఎంఎన్‌ఎం అభ్యర్థి, సినీ గేయ రచయిత స్నేహనన్, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన హాస్య నటుడు మయిల్‌స్వామి, తొండాముత్తూరు స్థానం నుంచి బరిలోకి దిగిన సినీ నటుడు మన్సూర్ అలీఖాన్, తిరువొత్తియూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన దర్శకుడు సీమాన్, ఆయన పార్టీ అభ్యర్థులంతా చిత్తుగా ఓడిపోయారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా పోలైన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి మూడో స్థానాన్ని దక్కించుకుంది. కానీ, డీఎంకే తరపున పోటీ చేసిన హీరో ఉదయనిధి స్టాలిన్, ఎన్నికల బరిలోకి దిగిన తొలిసారే విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈయన ట్రిప్లికేన్-చేపాక్ స్థానం నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థి పీఎంకే అభ్యర్థిపై 59,091 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అదేసమయంలో వందవాసి స్థానం డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన సినీ నిర్మాత అంబోత్ కుమార్ 36,068 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.