40 యేళ్ళ సినీ జీవితంలో ఎలాంటి మచ్చలేదు: ఆర్‌బీ చౌదరి

ABN , First Publish Date - 2021-06-20T20:13:21+05:30 IST

కోలీవుడ్‌ హీరో విశాల్‌ తనపై నగర పోలీసు కమిషనర్‌కు చేసిన ఫిర్యాదుపై ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఆర్‌.బి.చౌదరి వివరణ ఇచ్చారు. నాలుగు భాషల్లో..

40 యేళ్ళ సినీ జీవితంలో ఎలాంటి మచ్చలేదు: ఆర్‌బీ చౌదరి

కోలీవుడ్‌ హీరో విశాల్‌ తనపై నగర పోలీసు కమిషనర్‌కు చేసిన ఫిర్యాదుపై ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు ఆర్‌.బి.చౌదరి వివరణ ఇచ్చారు. నాలుగు భాషల్లో 92 చిత్రాలు నిర్మించిన తాను 40 యేళ్ళ జీవిత చరిత్రలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోలేదని, పైగా తనపై ఎలాంటి మచ్చలేదనే విషయం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు బాగా తెలుసని ఆర్‌బి చౌదరి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. పైగా ఈ సంఘటన జరిగినపుడు తాను నగరంలో లేనని, అందువల్లే తనపై ఫిర్యాదు చేసినవెంటనే స్పందిచలేకపోయినట్టు తెలిపారు. విశాల్‌ నటించిన ‘ఇరుంబుత్తిరై’ చిత్రానికి ఫైనాన్స్‌ చేసిన సమయంలో ష్యూరిటీగా స్టాంప్‌ పత్రాలు, గ్రీన్‌ షీట్‌, ప్రొనోట్‌, చెక్కులు, లెటర్‌హెడ్‌ ఇచ్చినమాట వాస్తవమేనని చెప్పారు. 


అయితే, వీటిని దర్శకుడు శివకుమార్‌ వద్ద భద్రపరిచామన్నారు. కానీ, ఆయన మరణంతో ఈ పత్రాలను తిరిగి స్వాధీనం చేసుకోలేదన్నారు. పైగా శివకుమార్‌ బ్యాచిలర్‌ కావడంతో ఆయన ఈ పత్రాలను ఎక్కడ భద్రపరిచారో ఎవరికీ తెలియదన్నారు. అయితే, శివకుమార్‌ స్నేహితుల ద్వారా ఈ పత్రాల కోసం గాలించామని, అయినప్పటికీ అవి లభించలేదన్నారు. ఈ విషయాన్ని తనకు విశాల్‌కు మధ్యవర్తిగా ఉన్న లక్ష్మణన్‌ అనే వ్యక్తికి తెలియపరిచి... విశాల్‌కు చెప్పాల్సిందిగా కోరానని తెలిపారు. కానీ, విశాల్‌... ఈనెల 7వ తేదీన తనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వార్త తెలుసుకుని ఆశ్చర్యపోయినట్టు వివరించారు. వాస్తవానికి ఈ పత్రాల కోసం ఇద్దరం కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసివున్నట్టయితే బాగుండేందన్నారు. కానీ, విశాల్‌ ఒక్కరే ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ వార్త మీడియా ద్వారా తెలుసుకుని చాలా బాధపడినట్టు తెలిపారు. ఈ పత్రాలు ఎవరివద్దనైనా ఉంటే తక్షణం తమకు అందజేయాలని ఆర్‌.బి.చౌదరి ఆ ప్రకటనలో కోరారు. 

Updated Date - 2021-06-20T20:13:21+05:30 IST