రజనీకాంత్.. 3 నెలలపాటు అమెరికాలోనే!
ABN , First Publish Date - 2021-06-20T23:42:49+05:30 IST
సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం తెల్లవారుజామున అమెరికాకు బయలుదేరివెళ్ళారు. ఆయనతో పాటు సతీమణి లతా రజనీకాంత్ కూడా వెళ్ళారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్ ఎయిర్‌వేస్‌లో దోహా ఇంటర్నేషనల్
కోలీవుడ్: సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం తెల్లవారుజామున అమెరికాకు బయలుదేరివెళ్ళారు. ఆయనతో పాటు సతీమణి లతా రజనీకాంత్ కూడా వెళ్ళారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఖతార్ ఎయిర్‌వేస్‌లో దోహా ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి తొలుత చేరుకుని, అక్కడ నుంచి అమెరికాకు ప్రత్యేక విమానంలో వెళ్ళారు. అమెరికాలో పూర్తిస్థాయి వైద్యపరీక్షల తర్వాత మూడు నెలల పాటు అక్కడే విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత స్వదేశానికి తిరిగిరానున్నారు. 2011లో రజనీకాంత్‌కు సింగపూర్‌లో కిడ్నీ మార్పిడి చికిత్స జరిగింది. ఆ తర్వాత ఆయన అమెరికాకు వెళ్ళి అక్కడ పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కిడ్నీ ఆపరేషన్‌తో పాటు.. పూర్తిస్థాయి వైద్య పరీక్షలు చేయించుకుని పదేళ్ళు గడిచిన నేపథ్యంలో మరోమారు వైద్య పరీక్షల కోసం రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికాకు బయలుదేరి వెళ్ళారు. ఇందుకోసం శనివారం వేకువజామున 1.45 గంటల సమయంలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చారు.
ఆ సమయంలో అక్కడ వేచివున్న విలేకరులు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ, రజనీకాంత్ మాత్రం మీడియాతో మాట్లాడకుండా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఎయిర్‌పోర్టులోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 3.40 గంటలకు ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో దోహాకు బయలుదేరివెళ్ళారు. అక్కడ నుంచి మరో ప్రత్యేక విమానంలో రజనీకాంత్ దంపతులు అమెరికాకు వెళ్ళారు. కాగా, తన కుమార్తె ఐశ్వర్య, అల్లుడు ధనుష్ ఇప్పటికే అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. ధనుష్ ఓ హాలీవుడ్ షూటింగ్ నిమిత్తం గత ఫిబ్రవరి నుంచి అమెరికాలోనే ఉంటున్నారు. ఆయనతో పాటు ఐశ్వర్య కూడా అక్కడే ఉంటోంది. కాగా, ధనుష్ తన సినీ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు స్వదేశానికి వచ్చినా.. ఐశ్వర్య మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోనే మూడు నెలల పాటు ఉండనుంది. మూడు నెలల తర్వాత మళ్లీ రజనీ స్వదేశానికి తిరిగి రానున్నారని తెలుస్తోంది. ఇదిలావుంటే, రజనీకాంత్ - దర్శకుడు శివ కాంబినేషన్‌లో ‘అణ్ణాత్త’ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన భాగాన్ని రజనీ పూర్తి చేశారు. అదేసమయంలో ఈ చిత్రం షూటింగ్ కూడా మరికొన్ని రోజుల్లో పూర్తికానుంది. ఆ తర్వాత డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయనున్నారు.