RRR కథకు రెండు తుపాకులు కావాల్సి వచ్చింది.. ఆ రెండూ వారే: రాజమౌళి
ABN , First Publish Date - 2021-12-28T23:43:06+05:30 IST
‘ఆర్ఆర్ఆర్’ కథా రచయిత అయిన మా నాన్న విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడైన మా అన్న కీరవాణి తనను వారి భుజాలపై మోస్తూ ఈ ప్రపంచానికి చూపిస్తున్నారని స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి చెన్నై

‘ఆర్ఆర్ఆర్’ కథా రచయిత అయిన మా నాన్న విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడైన మా అన్న కీరవాణి తనను వారి భుజాలపై మోస్తూ ఈ ప్రపంచానికి చూపిస్తున్నారని స్టార్ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి చెన్నై ట్రేడ్ సెంటరులో జరిగింది. ఇందులో రాజమౌళి మాట్లాడుతూ, నిర్మాత డీవీవీ దానయ్య 13 యేళ్ళ క్రితం తనకు అడ్వాన్స్ ఇచ్చారని, అప్పటినుంచి తనపైనా, ఆర్ఆర్ఆర్ కథపైనా నమ్మకం ఉంచినందుకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. తన ఆలోచనలు బిగ్ స్ర్కీన్‌పై వచ్చేందుకు పంచపాండవులైన ఐదుగురు ఈ చిత్రానికి పనిచేశారని,ఈ చిత్రం గురించి ఎందుకు ఇంతలా ఎగ్జైట్మెంట్గా ఫీలవుతున్నానంటే, భరతభూమిలోనే ఎమోషన్ ఉందన్నారు. దీన్ని ఈ చిత్రంలో చూపించినట్టు చెప్పారు.
ఈ చిత్ర కథకు రెండు తుపాకులు కావాల్సి వచ్చిందని, ఆ ఇద్దరే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అన్నారు. తారక్ ప్రేమను తట్టుకోవడం చాలా కష్టమన్నారు. నిజంగానే జూనియర్ ఎన్టీఆర్‌ది చైల్డ్ మెంటాలిటీ, లయన్ పర్సనాలిటీ అన్నారు. ఒక దర్శకుడిగా తన ఆలోచనలను క్రియారూపంలో పెట్టే హీరో ఎన్టీఆర్ అని, ఇలాంటి నటుడు లభించడం తనకు, తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమకే పెద్ద అదృష్టమన్నారు. ‘ఇక చెర్రీ గురించి ఒక విషయం నేర్చుకున్నా. బ్లాంక్ మైండ్‌తో వచ్చి దర్శకుడికి కావాల్సిన ఔట్‌పుట్‌ను ఇచ్చే నటుడు రామ్ చరణ్. తారక్ ఒక యాంబిషన్ ఉన్న హీరో అయితే, చెర్రీ సెక్యూర్డ్ ఆర్టిస్ట్. ఈ ఇద్దరు హీరోలు ఉత్తర దక్షిణ ధృవాలు. వీరిద్దరూ ఆయస్కాంతంలాంటి ‘ఆర్ఆర్ఆర్’ ద్వారా నాతో కనెక్ట్ అయ్యారు’ అని రాజమౌళి అన్నారు.
కోలీవుడ్ హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ తాను రాజమౌళికి వీరాభిమాని అని చెప్పారు. తన సంస్థ రెడ్జెయింట్పై ‘మగధీర’ చిత్రాన్ని రిలీజ్ చేశామని, ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కూడా మూడు ఏరియాల్లో పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నిర్మాత డీవీవీ దానయ్య, తమిళ హీరో శివకార్తికేయన్, నిర్మాతలు కలైపులి ఎస్.థాను, ఆర్.బి.చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.