స్టార్ హీరోల చిత్రాల్లో చేసినా రాని గుర్తింపు ఆ సినిమాతో వచ్చింది: కరాటే కార్తి
ABN , First Publish Date - 2021-11-02T02:58:42+05:30 IST
నటన అంటే ఎంతో ఇష్టం కావడంతో సీఆర్‌పీఎఫ్ ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టి.. కమల్ హాసన్ నటించిన ‘దశావతారం’ చిత్రంలో జూనియర్ ఆర్టిస్టుగా తొలిసారి నటనకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ‘సింగం-3’, ‘దబాంగ్-3’, ‘బిగిల్’, ‘పేట’, ‘ఖైదీ’ వంటి పలు చిత్రాల్లో..
సినీ రంగంలో తన 14 యేళ్ళ పోరాటానికి తగిన గుర్తింపు, విజయం ‘డాక్టర్’ చిత్రం ద్వారా దక్కిందని నటుడు కరాటే కార్తి అంటున్నారు. సుధీర్ఘ కాలంగా చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ తనకు తగిన గుర్తింపుతో పాటు విజయం వరించలేదన్నారు. ఈ క్రమంలో హీరో శివ కార్తికేయన్ నటించి ఇటీవల విడుదలై విజయం సాధించిన ‘డాక్టర్’తో మంచి గుర్తింపుతో పాటు విజయం కూడా వరించిందని కార్తి పేర్కొన్నారు. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ, సీఆర్‌పీఎఫ్‌లో పనిచేసిన తనకు బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సైతం వచ్చిందన్నారు. అఖిల భారత కరాటే పోటీల్లో ఏకంగా 13సార్లు చాంపియన్‌గా నిలిచిన ఆయన జిమ్నాస్టిక్, సిలంబాట్టం, జూడో, కిక్ బాక్సింగ్ క్రీడల్లో శిక్షణ తీసుకున్నట్టు పేర్కొన్నారు. కానీ, తనకు నటన అంటే ఎంతో ఇష్టం కావడంతో సీఆర్‌పీఎఫ్ ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టి.. కమల్ హాసన్ నటించిన ‘దశావతారం’ చిత్రంలో జూనియర్ ఆర్టిస్టుగా తొలిసారి నటనకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.
ఆ తర్వాత ‘సింగం-3’, ‘దబాంగ్-3’, ‘బిగిల్’, ‘పేట’, ‘ఖైదీ’ వంటి పలు చిత్రాల్లో నటించినా కానీ, శివకార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ చిత్రమే తనను ఒక నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టిందని వెల్లడించారు. అదేవిధంగా పలు చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపిన కరాటే కార్తి ‘ఆలంబన’, ‘కన్నె నంబాదే’ వంటి మూవీలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, చిత్రపరిశ్రమలో ప్రతి నాయకులుగా చెరగని ముద్రవేసుకున్న దివంగత నంబియార్, రఘువరన్, నేటితరంలో ప్రకాష్ రాజ్ తరహాలో విలన్‌గా రాణిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని ఉందని కరాటే కార్తి వివరించారు.