కోలీవుడ్‌కు రూ.4 వేల కోట్ల నష్టం?
ABN , First Publish Date - 2021-06-04T21:46:21+05:30 IST
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. దీంతో కఠిన లాక్‌డౌన్ అమలవుతోంది. అంతకంటే ముందు అంటే ఏప్రిల్ 10వ తేదీ నుంచి సినిమా థియేటర్లు మూసివేశారు. ఆ తర్వాత సినిమా షూటింగులను రద్దు చేశారు. దీంతో కోట్లాది రూపాయల బడ్జెట్‌తో

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. దీంతో కఠిన లాక్‌డౌన్ అమలవుతోంది. అంతకంటే ముందు అంటే ఏప్రిల్ 10వ తేదీ నుంచి సినిమా థియేటర్లు మూసివేశారు. ఆ తర్వాత సినిమా షూటింగులను రద్దు చేశారు. దీంతో కోట్లాది రూపాయల బడ్జెట్‌తో నిర్మాణం పూర్తి చేసుకున్న అనేక చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. అలాగే, పలు భారీ ప్రాజెక్టుల సినిమాల షూటింగులు కూడా ఆగిపోయివున్నాయి. గత ఒకటిన్నర నెలగా తమిళ చిత్ర పరిశ్రమలోని 24 కళారంగాలకు చెందిన వారంతా తమతమ ఇళ్ళకే పరిమితమైవున్నారు. దీంతో చిత్ర పరిశ్రమ ఏకంగా రూ.4 వేల కోట్ల మేరకు నష్టపోయినట్టు సమాచారం. ఈ కష్టకాలంలో చిత్ర పరిశ్రమను ఆదుకోవడంతో పాటు సినీ కార్మికుల జీవనోపాధికి అవసరమైన సాయం చేయాలని దక్షిణ భారత సినీ నిర్మాణ కార్మికుల మండలి (ఫెఫ్సీ) అధ్యక్షుడు ఆర్.కె.సెల్వమణి ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.
తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ప్రతి యేడాది దాదాపు 600కు పైగా చిత్రాలు విడుదలవుతుంటాయని, ఈ పరిశ్రమపై ఆధారపడి సుమారుగా 60 వేల మంది కార్మికులు జీవిస్తున్నారని, అలాగే, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తోందని, అయితే, గత యేడాది మార్చి నెలాఖరు నుంచి అమలు చేసిన లాక్‌డౌన్ మొదులుకుని ఇప్పటివరకు పరిస్థితులన్నీ తలకిందులుగా మారిపోయాయని, దీంతో సినీ కార్మికుల జీవనాధారం ఇపుడు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిపెట్టే సినీ పరిశ్రమకు ప్రభుత్వ గుర్తింపు లేకపోవడంతో సినీ పరిశ్రమకు, కార్మికులకు దక్కాల్సిన ఏ ఒక్క రాయితీ అందడం లేదని, పైగా ఈ లాక్‌డౌన్ కారణంగా దాదాపుగా రూ.4 వేల కోట్ల మేరకు చిత్ర పరిశ్రమకు నష్టం వాటిల్లిందని ఆయన అంటున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కనీసం ఆరు నెలల పాటు అన్ని రకాల పన్నుల్లో రాయితీ ఇవ్వాలని సర్కారును ఆయన కోరుతున్నారు. అంతేకాకుండా, మళ్ళీ సినిమా షూటింగులు పునఃప్రారంభమయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అప్పటివరకు సినీ కార్మికుల జీవనోపాధికి అవసరమైన సాయాన్ని ప్రభుత్వంతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు సాయం చేసేందుకు ముందుకు కావాలని సెల్వమణి కోరుతున్నారు.