Dushara Vijayan: హీరోయిన్‌గా పనికి రావన్నారు: దుస్సారా విజయన్
ABN , First Publish Date - 2021-07-28T20:50:31+05:30 IST
కథలో పసలేని చిత్రాల్లో నటించడం కంటే మంచి కథాకథనంతో కూడిన ఒక్క చిత్రంలో నటిస్తే చాలని కోలీవుడ్ హీరోయిన్ దుస్సారా విజయన్ అభిప్రాయపడింది. అలాగే, ఛాలెంజింగ్ పాత్రలను చేయాలని ఉందని చెప్పింది.

కథలో పసలేని చిత్రాల్లో నటించడం కంటే మంచి కథాకథనంతో కూడిన ఒక్క చిత్రంలో నటిస్తే చాలని కోలీవుడ్ హీరోయిన్ దుస్సారా విజయన్ అభిప్రాయపడింది. అలాగే, ఛాలెంజింగ్ పాత్రలను చేయాలని ఉందని చెప్పింది. ముఖ్యంగా స్టార్ హీరో ధనుష్ నటనతో పోటీపడి నటించాలని ఉందనే కోరికను వ్యక్తం చేసింది. ‘బోదైౖయేరి బుద్ధిమారి’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన దుస్సారా ఆ తర్వాత ‘అన్బుళ్ళ గిల్లి’ అనే చిత్రంలో నటించింది. కానీ, ఈ చిత్రం ఇంకా విడుదలకు రాలేదు. ఈ నేపథ్యంలో దర్శకుడు పా. రంజిత్ - హీరో ఆర్య కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సార్పట్ట పరంపర’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ప్రశంసలు అందుకుంటోంది దుస్సారా విజయన్. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘‘మాది దిండిగల్ జిల్లాలోని ఓ గ్రామం. నాన్న డీఎంకేలో రాజకీయ నేత. ఆరో తరగతి నుంచే నటనంటే అమితమైన ఇష్టం. ప్లస్‌టూ మంచి మార్కులు రావడంలో ఇంజనీరింగ్‌లో చేర్చారు. కానీ, నా ధ్యాసంతా నటనపైనే ఉండేది. ఇందుకోసం అనేక స్కెచ్‌లు వేశాను. మోడలింగ్‌లోకి ప్రవేశించి అటు నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టాలని భావించాను. ఇందుకోసం ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో చేరాను. నాలుగేళ్ళ కోర్సు అది. ఒక యేడాది మాత్రమే పూర్తి చేశా. ఈ క్రమంలో ‘ఫేస్ ఆఫ్ చెన్నై’ విజేతగా నిలిచాను. ఆ తర్వాత ‘బోదై యేరి బుద్ధిమారి’ అనే చిత్రంలో నటించే అవకాశం దర్శకుడు చంద్రు ఇచ్చారు. నా రెండో చిత్రం ‘అన్బుళ్ళ గిల్లి’. దర్శకుడు శ్రీనాథ్. చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు.
కొత్త ముఖానికి ఈ ఇద్దరు దర్శకులు అవకాశం ఇచ్చారు. వీరికి రుణపడివుంటా. ఆరేళ్ళపాటు ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. చాలామంది దర్శకులు నన్ను హీరోయిన్ మెటీరియల్ (హీరోయిన్‌గా పనికిరావంటూ) కాదంటూ హేళనగా మాట్లాడారు. ఇలా నిరుత్సాహ పరచడం వల్లే నాలో పట్టుదల మరింతగా పెరిగింది. ఈ క్రమంలో దర్శకుడు రంజిత్ ట్విట్టర్‌లో నా ఫోటో చూసి ‘సార్పట్ట పరంపర’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం కోసం ఆర్టిస్టులందరూ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం. నా పాత్రను ఇష్టపడి చేశాను. అందుకే ప్రతి ఒక్కరూ మారియమ్మా అదరగొట్టావ్ అంటూ అభినందిస్తున్నారు. ఇలాంటి పాత్రలు మళ్ళీమళ్ళీ రావు. కానీ, వచ్చిన ఒక్క పాత్ర అయినా సరే పదికాలాల పాటు చిరస్థాయిగా నిలిచిపోవాలి. ముఖ్యంగా ఛాలెంజింగ్ పాత్రలను చేసేందుకు అమితంగా ఇష్టపడతా. హీరో ధనుష్ మంచి నటుడు. ఆయనతో నటనలో పోటీ పడాలని వుంది. ఢీ అంటే ఢీ (ధనుష్, దుషారా) తరహాలో. దర్శకుల్లో మణిరత్నం, బాలా, శీను రామసామి వంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఉంది’’ అని చెప్పారు.