విగ్గు లేకుండా నటించనన్న అక్కినేని.. కానీ?

ABN , First Publish Date - 2021-08-07T02:10:59+05:30 IST

అయితే విగ్గు లేకుండా నటించనని నాగేశ్వరరావు చెప్పేశారు. దర్శకనిర్మాత ఎల్వీ ప్రసాద్‌, సంగీత దర్శకుడు పాలగుమ్మి విశ్వనాథం తదితరులను దృష్టిలో పెట్టుకుని రెండు మూడు విగ్గులు తయారు చేయించారు. అవి పెట్టుకుని

విగ్గు లేకుండా నటించనన్న అక్కినేని.. కానీ?

మానస రాసిన ‘నవ్వినా కన్నీళ్లే’ నవల ఆధారంగా రూపుదిద్దుకొన్న చిత్రం ‘సీతారామయ్యగారి మనవరాలు’. నవలలోని ద్వితీయార్ధంలో మార్పులు చేసి స్ర్కిప్ట్‌ తయారు చేశారు రచయిత గణేశ్‌పాత్రో. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా క్రాంతికుమార్‌ దర్శకత్వంలో ఈ నవలను సినిమాగా తీయాలన్నది నిర్మాత దొరస్వామిరాజు ఆలోచన. అయితే ఈ కథ వినగానే వెంటనే తన అంగీకారాన్ని తెలపలేదు అక్కినేని. ఆయన కొంత సమయం తీసుకున్నారు. అక్కినేని ఓకే అంటే సరే లేకపోతే రచయిత వేటూరి సుందరరామమూర్తిని ఎలాగైనా ఒప్పించి, తాత పాత్ర వేయించాలని ఫిక్స్‌ అయ్యారు దొరస్వామిరాజు. ఆయనకు కథ అంతగా నచ్చింది మరి! అక్కినేని ఓకే చెప్పడంతో ఆ ఇబ్బంది లేకుండా పోయింది. 


ఇక మనవరాలి పాత్రకు మొదట గౌతమిని అనుకుని ఆమెకు అడ్వాన్స్‌ కూడా ఇచ్చారు. అయితే షూటింగ్‌ మొదలు పెట్టే సమయానికి ఆమెకు తమిళంలో ఓ పెద్ద హీరో సరసన నటించే అవకాశం రావడంతో ఈ సినిమా వదులుకొన్నారు. అప్పుడు మీనాను ఆ పాత్ర వరించింది. ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంలో అక్కినేని విగ్గు లేకుండా నటిస్తే బాగుంటుందన్నది క్రాంతికుమార్‌, దొరస్వామిరాజుల ఏకాభిప్రాయం. అయితే విగ్గు లేకుండా నటించనని నాగేశ్వరరావు చెప్పేశారు. దర్శకనిర్మాత ఎల్వీ ప్రసాద్‌, సంగీత దర్శకుడు పాలగుమ్మి విశ్వనాథం తదితరులను దృష్టిలో పెట్టుకుని రెండు మూడు విగ్గులు తయారు చేయించారు. అవి పెట్టుకుని స్టిల్స్‌ దిగారు. అయితే ఆ విగ్గులు ఆయనకు సూట్‌ కాలేదు. ఆ తర్వాత విగ్గు లేకుండా ఒరిజనల్‌ హెయిర్‌తో మరికొన్ని స్టిల్స్‌ దిగారు నాగేశ్వరరావు. అవి బాగున్నాయని అందరూ అనడంతో ఓకే అనక తప్పలేదు అక్కినేనికి.


1991 జనవరి 11న  ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రం విడుదలైంది. సినిమాకు మొదటి వారం టాక్‌ బాగున్నా కలెక్షన్లు బొత్తిగా లేవు. అయితే రెండో వారం నుంచి అనూహ్యంగా కలెక్షన్లు పెరిగి చిత్రం పెద్ద హిట్‌ అయింది. ఈ చిత్ర విజయోత్సవానికి మెగాస్టార్‌ చిరంజీవి హాజరయ్యారు.

-వినాయకరావుUpdated Date - 2021-08-07T02:10:59+05:30 IST