టాలీవుడ్‌కు వ్యాక్సిన్‌ ఎప్పుడు?

ABN , First Publish Date - 2021-05-15T04:23:55+05:30 IST

కరోనా కాటుకు నష్టాల ఊబిలో కూరుకున్న పరిశ్రమల్లో వినోద పరిశ్రమ ముఖ్యమైనది. తొలి దశ నుంచి కోలుకుని, మళ్లీ గాడిన పడుతుందనుకున్న సమయంలో రెండో దశ విజృంభణతో....

టాలీవుడ్‌కు వ్యాక్సిన్‌ ఎప్పుడు?

కరోనా మహమ్మారి పంజా దెబ్బకు...

సభ్య సమాజం కకావికలమైంది.

మళ్లీ తిరిగి గాడిన పడేసే ఔషధం... 

వ్యాక్సిన్‌ ఒక్కటే! వైద్యులు సూచించేదీ అదే!

మరి, టాలీవుడ్‌  సంగతేంటి?

తెలుగు సినీ, టీవీ జనాలకు వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుంది?


కరోనా కాటుకు నష్టాల ఊబిలో కూరుకున్న పరిశ్రమల్లో వినోద పరిశ్రమ ముఖ్యమైనది. తొలి దశ నుంచి కోలుకుని, మళ్లీ గాడిన పడుతుందనుకున్న సమయంలో రెండో దశ విజృంభణతో  మరింత నష్టాల్లోకి బలవంతంగా నెట్టి వేయబడింది. లాభాల సంగతి అటుంచి... ఇంతకు ముందులా మళ్లీ చిత్రీకరణలు ప్రారంభమై, అంతా సవ్యంగా సాగాలంటే, ఎవరూ కరోనా బారిన పడకూడదు.


మహేశ్‌బాబు కాస్ట్యూమర్‌కు కరోనా సోకడంతో, ఆయన తాజా చిత్రం  ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణకు అర్థాంతరంగా ప్యాకప్‌ చెప్పవలసి వచ్చింది. ప్రభాస్‌ మేకప్‌మ్యాన్‌కు కొవిడ్‌ 19 పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో ‘రాధే శ్యామ్‌’ షూటింగ్‌ నిలిచింది. ఆ ప్రభావం ‘సలార్‌’, ‘ఆదిపురుష్‌’పై కూడా పడింది. పవన్‌కల్యాణ్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. అయితే, కరోనా బ్రేక్‌ వల్ల ‘హరిహర వీరమల్లు’, ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ చిత్రాల  షెడ్యూళ్లలో మార్పు చేసుకోవాల్సి వస్తుందట. అనిల్‌ రావిపూడికి కరోనా అని తేలడంతో ‘ఎఫ్‌ 3’ షూట్‌ వాయిదా పడింది. ఇప్పుడంటే తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉంది. దానికి ముందు యథావిధిగా షూటింగులు జరిగాయి. అప్పుడు హీరో హీరోయిన్లు, యూనిట్‌లోని కీలక సభ్యల్లో ఎవరొకరు కరోనా బారిన పడితే చిత్రీకరణలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. లాక్‌డౌన్‌ తర్వాత అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే... అందరికీ వ్యాక్సిన్‌ వేయించాలి.


తెలుగు నేలపై సుమారు 1700 థియేటర్లు (సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌ స్ర్కీన్లు కలిపితే) ఉన్నాయని ఓ అంచనా. వీటి ద్వారా 25 వేలమంది, పంపిణీ రంగం ద్వారా 10 వేల మంది... మొత్తం 35 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ  థియేటర్లకు ప్రాణవాయువు - చిత్రాలే. చిత్రనిర్మాణ రంగంలో సుమారు 15 వేలమంది ఉన్నారు. బుల్లితెర ద్వారా సుమారు 7 వేలమంది ఉపాధి పొందుతున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఆధారపడి 50 వేల కుటుంబాలు, టీవీ పరిశ్రమపై ఆధారపడి 7 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నాయి. 


కొవిడ్‌-19 తొలి దశ వ్యాప్తిని అరికట్టడానికి గతేడాది ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించినప్పుడు... కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) ద్వారా 14వేల సినీ కార్మికులకు సహాయం అందింది. కొందరు ప్రముఖులు వ్యక్తిగత స్థాయిలో, ఇబ్బందుల్లో ఉన్నవాళ్లకు తమకు చేతనైనంత సాయం అందించారు. దానాలు చేశారు. రెండో దశ వ్యాప్తికి ముందు సీసీసీ ద్వారా కార్మికులందరికీ వ్యాక్సిన్‌ ఇప్పించాలనుకుంటున్నట్టు ‘వైల్డ్‌ డాగ్‌’ బృందాన్ని అభినందించిన సందర్భంలో చిరంజీవి తెలిపారు. 


ముంబైలో బడా నిర్మాణ సంస్థలు, కార్మిక-నిర్మాత సంఘాలు తమ సిబ్బంది, సభ్యులకు కరోనా వ్యాక్సిన్‌ కావాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. తెలుగు చిత్రసీమలో 45 ఏళ్లు పైబడిన వారు వ్యాక్సిన్లు తీసుకుంటున్నారు. అయితే, అందరికీ లభించడం లేదు. వయసుతో సంబంధం లేకుండా ఈ కష్టకాలంలో ప్రజలకు వినోదం అందించడానికి కృషి చేస్తున్న సినీసీమలో కార్మికులందరి కోసం తెలుగు ప్రభుత్వాలు స్పెషల్‌ డ్రైవ్స్‌ నిర్వహిస్తే బావుంటుందని చిత్రసీమలో జనాల ఆశ.



వ్యాక్సిన్లు కొనడానికి ఫెడరేషన్‌ రెడీ!

‘‘హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఏడెకరాలు స్టూడియోకి ఎదురుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఓ పీహెచ్‌వో ఉంది. మా ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజులుగా 45 ఏళ్ల వయసున్న సినీ కార్మికులకు అక్కడ కరోనా రెండో డోసు వ్యాక్సిన్లు వేయిస్తున్నాం. రోజుకు 100 కంటే ఎక్కువ వ్యాక్సిన్లు లభించడం లేదు. మా ఫెడరేషన్‌లో మొత్తం 22వేల మంది ఉన్నారు. వ్యాక్సిన్‌ వచ్చిన తొలినాళ్లలో అవగాహన లేక చాలామంది వేయించుకోలేదు.


ఇప్పుడు అందరూ తొలి డోసు అడుగుతున్నారు. అలా వ్యాక్సిన్‌ తీసుకోవాలనుకుంటున్నవారు 10వేలమంది వచ్చేట్టున్నారు. వ్యాక్సిన్లు కొనడానికి ఫెడరేషన్‌ రెడీ. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌గారిని, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌గారిని వ్యాక్సిన్ల కోసం విజ్ఞప్తి చేశాం. చిరంజీవిగారూ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు మాకోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ వేయించే ప్రయత్నం చేస్తే బావుంటుంది’’ 


- అనిల్‌కుమార్‌ వల్లభనేని, తెలుగు ఫిల్మ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు

Updated Date - 2021-05-15T04:23:55+05:30 IST