పొరుగింటి పుల్లకూర ఎప్పుడూ రుచే!
ABN , First Publish Date - 2021-06-13T22:01:51+05:30 IST
‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ ప్యాన్ ఇండియా స్థాయిలో విస్తరించింది. ఇప్పుడు తెలుగులో తెరకెక్కే చిత్రాలను నాలుగైదు భాషల్లో, ఇంకా అనువుగా ఉంటే ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనితో పొరుగింటి దర్శకుల కన్ను ఇప్పుడు టాలీవుడ్‌పై పడింది.

తెలుగుతెరపై సత్తా చాటడానికి పొరుగు దర్శకులు
ప్యాన్ ఇండియా స్థాయి చిత్రాలు ప్లాన్!
‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమా మార్కెట్ ప్యాన్ ఇండియా స్థాయిలో విస్తరించింది. ఇప్పుడు తెలుగులో తెరకెక్కే చిత్రాలను నాలుగైదు భాషల్లో, ఇంకా అనువుగా ఉంటే ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనితో పొరుగింటి దర్శకుల కన్ను ఇప్పుడు టాలీవుడ్‌పై పడింది. పర భాషా దర్శకులకు తెలుగు పరిశ్రమతో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. పాత రోజుల్లో చాలామంది తమిళ, కన్నడ, మలయాళ దర్శకులు తెలుగు తెరపై సత్తా చాటిన వారే! ఈతరం దర్శకులు కూడా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఆ దర్శకులపై ఓ లుక్కేద్దాం...
కేజీఎఫ్ క్రేజ్.. రెండు అవకాశాలు..
‘కేజీఎఫ్’ సినిమాతో దర్శకుడిగా ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆ సినిమా సక్సెస్‌తో కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ కూడా తెరకెక్కించారు. లాక్‌డౌన్ వల్ల ఆ చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ రెండు చిత్రాల క్రేజ్‌తో తెలుగులో కూడా ప్రశాంత్‌కు క్రేజ్ పెరిగింది. టాలీవుడ్ అగ్రహీరోలతో రెండు ప్యాన్ ఇండియా సినిమా అవకాశాలు అందుకున్నారు. అందులో ఒకటి ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’, మరొకటి ఎన్టీఆర్ సినిమా. ప్రస్తుతం ‘సలార్’తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ పూర్తయ్యాక ఎన్టీఆర్ సినిమా ప్రారంభిస్తారని తెలిసింది.

మురుగదాస్.. మాస్ మసాలా
బలమైన కథకు, కమర్షియల్ హంగులు జోడించి సినిమా చూపించడంలో దిట్ట ఎ.ఆర్.మురుగదాస్. తెలుగు ప్రేక్షకులకు ఆయన పరిచయం అవసరం లేదు. ‘స్టాలిన్’తో తెలుగు తెరపై తన మార్క్ చూపించిన ఆయన మహేశ్‌బాబుతో ‘స్పైడర్’ సినిమా తీశారు. అయితే అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన తెలుగులో మరో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇందులో కథానాయకుడు. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నదే అయినా ఇటీవల గీతా ఆర్ట్స్ నిర్మాతల్లో ఒకరైన బన్నీ వాసు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. పక్కా మాస్ మసాలా కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందట. అయితే బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వేణు శ్రీరామ్ ‘ఐకాన్’, తదుపరి బోయపాటితో ఓ సినిమా క్యూలో ఉన్నాయి. మరి మురుగదాస్‌కి బన్నీ డేట్లు ఎప్పుడు సర్దుబాటు చేస్తారో చూడాలి.

తమిళనాట బడా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ శంకర్. ఆయన సినిమా అంటేనే విజువల్ వండర్. ‘జెంటిల్‌మెన్’ సినిమా నుంచి మూడేళ్ల క్రితం విడుదలైన ‘రోబో 2.0’ వరకూ ప్రతి సినిమా ఓ సంచలమే. తమిళంలో ఆయన దర్శకత్వం వహించిన ఎక్కువ శాతం చిత్రాలు తెలుగులో కూడా సంచలన విజయాలు సాధించాయి. త్వరలో ఆయన తెలుగులో స్ట్రెయిట్ సినిమా తీయబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా ఈ చిత్రం ఉండబోతుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. శంకర్ ప్రస్తుతం ‘ఇండియన్ 2’ బడ్జెట్ వివాదాలతో సతమతమవుతున్నారు.

ఎనర్టిటిక్ హీరోతో...
‘రన్’, ‘పందెం కోడి’, ‘ఆవారా’ తదితర అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన దర్శకుడు లింగుస్వామి. దర్శకనిర్మాతగా ఆయనది ప్రత్యేక శైలి. తెలుగులో ఆయన చిత్రాలకు మంచి మార్కెట్టే ఉంది. అందుకే తెలుగు స్ట్రెయిట్ సినిమాతో తన సత్తా చాటాలనుకుంటున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో ఓ సినిమాను ప్రకటించారు. హీరోగా రామ్‌కి 19వ చిత్రమిది.

కమల్ టూ చరణ్...
కార్తి ‘ఖైదీ’, విజయ్ ‘మాస్టర్’ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన లోకేశ్ కనగరాజ్ ప్రస్తుతం కమల్‌హాసన్ హీరో, నిర్మాతగా ‘విక్రమ్’ సినిమా చేస్తున్నారు. తదుపరి లోకేశ్ టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారని సమాచారం. రామ్‌చరణ్‌కి ఆయనొక కథ చెప్పారని త్వరలోనే ఆ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉందని టాలీవుడ్‌లో కొద్దిరోజులుగా ఓ వార్త హల్‌చల్ చేస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. రామ్‌చరణ్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ పూర్తయ్యాక గానీ ఈ సినిమా గురించి ఓ క్లారిటీ రాదు.

గిరీశయ్య రెండో సినిమా..
‘అర్జున్‌రెడ్డి’ సినిమాను తమిళంలో ‘ఆదిత్య వర్మ’ టైటిల్‌తో రీమేక్ చేశారు గిరీశయ్య. ఇప్పుడాయన టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో భారీ విజయం అందుకున్న పంజా వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. దర్శకుడిగా ఆయనకు రెండో చిత్రమిది.
