వీరి స్నేహం జబర్దస్త్!
ABN , First Publish Date - 2021-11-21T05:30:00+05:30 IST
వీళ్లు చెడ్డీనాటి దోస్తులు కాదు.. కాలేజీలో కలిసిన గ్యాంగ్ అంత కన్నా కాదు.. కామెడీ స్కిట్స్ కోసం.. జీవిత పోరాటంలో ఎదురైనోళ్లు. ఒకరు గెటప్పులకి కేరాఫ్ అడ్రస్.. ఇంకొకరు ఆటో ‘ఫన్’చుల బ్యాంక్.....

వీళ్లు చెడ్డీనాటి దోస్తులు కాదు.. కాలేజీలో కలిసిన గ్యాంగ్ అంత కన్నా కాదు.. కామెడీ స్కిట్స్ కోసం.. జీవిత పోరాటంలో ఎదురైనోళ్లు. ఒకరు గెటప్పులకి కేరాఫ్ అడ్రస్.. ఇంకొకరు ఆటో ‘ఫన్’చుల బ్యాంక్.. మరొకరు యూత్‌ఫుల్ ఎంటర్టైనర్. వీళ్లే గెటప్ శీను, రామ్ ప్రసాద్, సుడిగాలి సుధీర్. ‘జబర్దస్త్’లో తొమ్మిదేళ్ల నుంచి కామెడీ చేస్తూ.. ‘స్నేహంలోనూ వీరికి పోటీ లేరు’ అనిపించుకుంటోన్న ఈ బుల్లితెర కమెడియన్లను ‘నవ్య’ పలకరించింది!
ఏళ్ల తరబడి నవ్వించేందుకు ఏ ‘టానిక్’ వాడతారు?
గెటప్ శీను: హ్యాపీగా ఉండటమే.. టానిక్.
రామ్ ప్రసాద్: సరదాతనం, హాస్యం.
సుడిగాలి సుధీర్: అంతా ప్రేక్షకుల మహిమ. వారు ఆదరిస్తున్నారు. వచ్చే ఫిబ్రవరికి తొమ్మిదేళ్లు పూర్తవుతాయి. జనాలకు హాస్యం ఇవ్వాలనే ఆరాటమే.. మాకు టానిక్.
స్కిట్స్ కోసం చేసే హోమ్‌వర్క్స్ గురించి..
గెటప్ శీను: కోట శ్రీనివాసరావు, కమల్ హాసన్లే స్ఫూర్తి. వాళ్లలా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాలనే తపన. నిజ జీవితంలోని సంఘటనలే ఎక్కువ తీసుకుంటా. కొందరి మాడ్యులేషన్ బావుంటుంది. మరికొందరి నడక చూస్తే నవ్వొస్తుంది. ఇద్దరిలోని ఫ్లేవర్స్ మిక్స్ చేసి చేస్తా. బిల్డప్ బాబాయ్ గెటప్‌కి బెండయ్యి నడిచే నడక ఒకరిది. మాండలికం మరొకరిది. రెండూ మిక్స్ చేయడంతో తెగ నచ్చింది జనాలకు. తిప్పడు, నర్సయ్య విభిన్నమైన పాత్రలకు చక్కని పంచ్‌లు పడితే పదేళ్లయినా జనాలు మర్చిపోరు. ఎక్కువ గెటప్స్ చేయడంతో ‘బుల్లితెర కమల్‌హాసన్’ అన్నారంతా. ఇదో పెద్ద బాధ్యత.
రామ్ ప్రసాద్: పుస్తకాలేమీ చదవను. కోట, బ్రహ్మానందం.. లాంటి గొప్ప నటుల సన్నివేశాలు చూసి స్ఫూర్తి పొందుతా. సినిమాల్లో నచ్చిన సన్నివేశాల్ని కాస్త కుడి, ఎడమ చేసి ట్రాక్స్ చేస్తా. నిజ జీవితం సంఘటనలు, మీడియాలో చూసింది.. రాస్తా. ‘జబర్దస్’్త అనేది సినిమాల్లో నటించేందుకు ఓ ఆడిషన్గా ఫీలై చేస్తాం.
సుధీర్: శీను మంచి లైన్ చెబుతాడు. రామ్ ప్రసాద్ చకచకా రాస్తాడు. వాళ్ల డిష్కషన్‌లో కొన్ని ఆలోచనలు పంచుకుంటా. నా పని తక్కువే(నవ్వులు).
అసలు మీలో ఇంత ముడిసరుకెక్కడిది?
గెటప్ శీను: మనిషిలోని ‘ప్రతిరోజూ’ ఓ స్కిట్ లాంటిదే. ప్రతి ఒక్కరి లైఫ్‌లో రోజూ కొత్త ఘటనలు, ప్రయాణాలు విభిన్నమే..అందుకే సినిమాలు, స్కిట్స్ బతుకుతున్నాయి. రోజువారి జీవితంలో చూసిందీ ఫన్నీగా చేస్తామంతే. బిజీవల్ల కో-ఆర్డినేషన్ లేక కొన్ని స్కిట్స్‌లో నాణ్యత లేకపోవచ్చు కానీ సరుకు అయిపోయే ప్రసక్తే లేదు.
రామ్ ప్రసాద్: ఇంత లాంగ్ ఇన్నింగ్స్ ఆషామాషీ కాదు. ఆ మాటకొస్తే నేను చిన్నప్పటి నుంచీ రచయితనే కాదు. మాటతీరులో మనకు వెటకారం ఎక్కువ. పైగా త్రివిక్రమ్, పూరీ సినిమాల ప్రభావం ఉండనే ఉంది. సినిమాలే ముడిసరకు. జబర్దస్త్‌లో చేరాక మనసులో అనుకున్నది.. పేపర్‌మీద పెట్టానంతే. స్కిట్స్ కొడుతుంటే ధైర్యమొచ్చింది.
సుధీర్: శ్యాంప్రసాద్ రెడ్డిగారి కూతురు దీప్తిగారు ఏ ముహూర్తాన ప్రాంరంభించారో కానీ.. మాకు కలిసొచ్చింది. పదమూడు ఎపిసోడ్లు చేయాలనుకున్నారు.తొమ్మిదేళ్లయినా నడుస్తోంది. డ్యాన్స్ అంటే ఇష్టం. ఇక దర్శకులు ఇచ్చిన సుధీర్-రష్మి లవ్‌ట్రాక్ ఉండనే ఉంది. లవ్‌ట్రాక్‌తో పేరొచ్చింది. ఎంత అంటే.. మేమిద్దరం పెళ్లి చేసుకున్నామనేంతగా జనాల్లోకి వెళ్లిందా విషయం. ప్రేక్షకులను రంజింపచేయాలనే కోరికే ముడిసరుకు.
విడిపోకుండా ఉండే ఫెవికాల్ బంధమేంటీ?
గెటప్ శీను: ఆలోచనా ధోరణి, ఐడియాలజీ ఒక్కటే. ఇన్ని రోజులు కలిసి ఉండటానికి కారణం.. ఏదైనా బాధ, కోపం, ప్రేమ ఉన్నా చెప్పుకుంటాం. దాచుకోం. అందుకే మా స్నేహబంధం ఫెవికాల్ అంత గట్టిది(నవ్వులు). ముగ్గురం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. ‘నన్ను తొక్కేస్తున్నార’ని స్కిట్లో సింపతీ పొందే అల్పజీవి సన్నీ కూడా మాతో ఉంటాడు(నవ్వులు).
రామ్ ప్రసాద్: కొన్ని ఎందుకు కనెక్టవుతాయో తెలీదు. స్టిక్కవుతామలా. మా బంధమే ప్రత్యేకం. కోటా-బాబూ మోహన్, కోటా-బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ-సునీల్.. కాంబినేషన్స్ సినిమాల్లో హిట్. మా కాంబినేషన్ ప్రతివారం ‘జబర్దస్త్’లో ఉంటుంది. ఇప్పటికి ఐదు వందల పైగా జబర్దస్త్ స్కిట్స్ చేశాం. బయటి ఫంక్షన్లలో, ఇతర ప్రోగ్రామ్స్ కలిపి మొత్తం వెయ్యి స్కిట్స్ చేశాం.
సుధీర్: ఫ్రెండ్స్ కంటే.. ఫ్యామిలీ మెంబర్స్ అనాలి. శీను, రామ్ ప్రసాద్‌లు మా ఇంటికొస్తే పెద్దకొడుకు, రెండో కొడుకులా చూస్తారు. నన్నూ వాళ్ల పేరెంట్స్ కొడుకులా చూస్తారు. ఏదో మేజిక్ మమ్మల్ని కలిపింది.
ముగ్గురూ ఎక్కడ కలిశారు?ఎందుకు.. ఎలా?
రామ్ ప్రసాద్: ధనరాజ్ అన్న స్కిట్స్‌లో చేసేటోన్ని. అప్పుడప్పుడు వేణు అన్న అడిగితే లైన్స్ కోసం వెళ్లినపుడు శీనుతో మాట్లాడేటోన్ని. ‘బాగా రాస్తున్నా’వని శీను అనేవాడు. సడెన్‌గా సీనియర్లందరూ వెళ్లిపోయారు. మల్లెమాల వాళ్లు జూనియర్స్తో ‘జబర్ధస్త్’ చేయమన్నారు. ధనరాజ్ అన్న టీమ్ తీసేశారు. అక్కడ శీను, సుధీర్ ఒక టీమ్‌లో ఉన్నారు. ఇలా జరిగిందేందని.. డిప్రషన్‌లోకి వెళ్లా. అదే టైమ్‌లో శీను పిలవడంతో ఇటొచ్చా. మొదటి స్కిట్ మేమే కొట్టాం. అలా మా ప్రయాణం మొదలైంది.
గెటప్ శీను- వేణు అన్న దగ్గర పనిచేసేవాణ్ని. ఆ టీమ్ తీశాక బాధపడ్డా. కాన్ఫిడెన్స్ తగ్గింది. రామ్ ప్రసాద్ రైటింగ్‌పై నమ్మకం. కనెక్టయ్యాడు. ఇందాకా వచ్చామంటే.. మాకు ఆయువు పోసింది రామ్ ప్రసాదే.
రామ్‌ప్రసాద్: నేనూ అదే అనుకుంటా. శీను గెటప్స్, సుధీర్ లవ్‌ట్రాక్ వలే..్ల నా రైటింగ్‌కు పేరొచ్చిందని.
సుధీర్: జబర్దస్త్‌కు ముందునుంచే శీను ఫ్రెండ్. నేనప్పుడు చానెల్స్‌లో మేజిక్ షోలు చేసేవాణ్ణి. వాస్తవానికి శీనుకే తొలిసారి జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది. అయినా వేణు అన్నకు నన్ను రిఫర్ చేశారు. అలా టీమ్ లీడరయ్యాను. ఆ తర్వాత రామ్ ప్రసాద్ పరిచయం.
నవ్వించే మీ వెనకాల ఉండే కష్టాలు..
గెటప్ శీను: స్ట్రగుల్ కాదు.. అదొక ప్రాసెస్. కష్టాలు పడ్డాం. బాగా పనిచేసేవాళ్లం. జబర్దస్త్‌లో కాస్త నిలదొక్కుకుంటున్నామనే సమయంలో పెళ్లి చేసుకున్నా. కుటుంబాన్ని ఎలా పోషించాలనే టెన్షన్ ఉండేది. సుధీర్ వాళ్ల అమ్మనాన్నతో కలిసి ఉండేటోళ్లం. జబర్దస్త్‌లోకి వచ్చాక ఎలా రాయాలి? టీమ్‌ను నిలబెట్టుకోవాలని శ్రమించాం. నేనిలా ఉన్నానంటే మా ఆవిడ సుజాత కారణం. ఆమె అర్థం చేసుకుని ప్రోత్సహించింది.
రామ్ ప్రసాద్: నిజం చెప్పాలంటే.. స్ట్రగుల్స్ ఉంటేనే బాగుపడతాం. అలాగని మరీ తిండికి లేకపోవటం లాంటి కష్టాల్లేవు. వైజాగ్‌లో వ్యాపారం చేసేటోన్ని. మూడు రోజులు అక్కడ నాలుగు రోజులు హైదరాబాద్‌లో ఉండేటోన్ని. బస్సులెక్కి, లారీలెక్కి వచ్చేటోన్ని. వచ్చిన అవకాశాన్ని కాపాడుకోవాలని నిద్రపోని రోజులున్నాయి. ఉదయం ఏడు గంటలకు అన్నపూర్ణకు వెళ్తే అక్కడ ప్రాక్టీస్ చేసి షూటింగ్ పూర్తి అయ్యేసరికి అర్ధరాత్రి రెండుగంటలు దాటేది. మరుసటి రోజు ఇళ్లకు వెళ్లిపోయేవాళ్లం.
సుధీర్: కష్టాలు గట్టెక్కితేనే జీవితం విలువ తెలిసేది. ఇంటర్ ఫెయిలయ్యాక హైదరాబాద్ వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో మేజిక్ చేసేవాణ్ని. రెండేళ్ల తర్వాత అక్కడ మానేసి ఈవెంట్స్‌లో మేజిక్ చేయడం, గేమ్స్ ఆడించటం ఆరంభించా. తిండి తినటానికి డబ్లుల్లేని రోజులున్నాయి. సింక్‌లోని నీళ్లు తాగిన క్షణాలు ఉన్నాయి. కష్టాలొచ్చాయి కాబట్టే నిలదొక్కుకున్నా. నాలుగేళ్ల కిందట ఓ సర్జరీ జరిగింది. ఇలా కష్టాలు ఎప్పుడూ మనతో ఉంటాయి.
మీ నేపథ్యాలేంటీ..
గెటప్ శీను: నాకో అన్నయ్య, అక్క. నేనే చిన్నోడిని. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం కళింగగూడెం గ్రామం మాది. అమ్మనాన్నలు వ్యవసాయ కూలీలు. కూలి పనులకు వెళ్లేవాణ్ని. జీవితమేంటో తెలుసు. అక్క పెళ్లి చేశాక.. ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాం. పేదవాళ్లయ్యాం. అప్పులు తీర్చటం కోసం అన్నయ్య హైదరాబాద్‌కి వచ్చి కష్టపడుతోంటే.. నేనూ జాబ్ చేస్తూ నటించొచ్చని వచ్చా.
రామ్ ప్రసాద్: మాది వైజాగ్. నాన్న వంటలు చేసేవారు. అమ్మ గృహిణి. అక్కకు పెళ్లయింది. జబర్ధస్త్‌కు ముందు ఇండస్ర్టీకి వచ్చి వెళ్లిపోయా. పెళ్లి చేసుకున్నాక మళ్లీ వచ్చా.
సుధీర్: మాది విజయవాడ. నాన్న సినిమా హాల్ మేనేజర్‌గా పని చేసేవారు. అమ్మ గృహిణి. నాకో అక్క, తమ్ముడు. చిరంజీవిగారి స్ఫూర్తితో డ్యాన్స్ నేర్చుకున్నా. చిన్నప్పుడు మేనమామ దగ్గర మేజిక్ నేర్చుకున్నా. ఒక షోకి ఇరవై ఐదురూపాయలు ఇచ్చేవారు. గుంటూరు వెళ్తే 50 రూపాయలొచ్చేవి. మేజిక్‌లో ఆరుసార్లు రాష్ట్రస్థాయిలో, మూడు సార్లు నేషనల్ అవార్డులు గెలుచుకున్నా.
ముగ్గురి మధ్య ‘ఇగో’ల్లేవా?
గెటప్ శీను: ఇగోను మా మధ్య తొందరగా చంపేస్తాం. కొట్లాడుకున్నా. మహా అయితే గంట దూరంగా ఉంటాం.
రామ్ ప్రసాద్: ఇద్దరు గొడవపడితే.. మూడోవాడు కలపొచ్చు(నవ్వులు). అందుకే ముగ్గురు స్నేహితులుండాలి.
సుధీర్: ఇగోల్లేవు. అపార్థం చేసుకోం.
అసలు మీ కలలేంటీ..
గెటప్ శీను: క్యారెక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకోవాలి.
రామ్ ప్రసాద్: డైరక్టర్‌గా పేరు తెచ్చుకోవాలి.
సుధీర్: పేరు తెచ్చుకోవడం సక్సెస్ కాదు. పది మంది జీవితాలు నిలబెట్టే స్థాయికి రావటమే సక్సెస్. ముందు నటుడిగా నిలదొక్కుకోవాలి. ఓల్డేజ్ హోమ్స్. అనాథాశ్రమాలు ఏర్పాటు చేయాలన్నదే డ్రీమ్.
రాళ్లపల్లి రాజావలి
