Review 2021 : అనుకున్నది జరగలేదు..

ABN , First Publish Date - 2021-12-22T18:03:41+05:30 IST

సాధ్యమైనంతవరకు ఓ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాక మళ్ళీ రీ షెడ్యూల్ చేసిన సందర్భాలు చాలా తక్కువే ఉంటాయి. ఎందుకంటే కొన్ని సినిమాలను ఓపెనింగ్ రోజునే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆ తేదీకే పక్కా ప్రేక్షకులముందుకు

Review 2021 : అనుకున్నది జరగలేదు..

సాధ్యమైనంతవరకు ఓ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాక మళ్ళీ రీ షెడ్యూల్ చేసిన సందర్భాలు చాలా తక్కువే ఉంటాయి. ఎందుకంటే కొన్ని సినిమాలను ఓపెనింగ్ రోజునే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆ తేదీకే పక్కా ప్రేక్షకులముందుకు తీసుకువచ్చిన దర్శక, నిర్మాతలు ఉన్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దాని ప్రకారమే షూటింగ్ షెడ్యూల్స్, పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్, ప్రమోషన్స్ ..ఇలా అన్నీ ప్లాన్ చేసుకుంటారు. ప్రకటించిన తేదీకి గనక సినిమాను రిలీజ్ చేయకపోతే ఎక్కువగా ఇబ్బందుల్లో పడేది నిర్మాతే. అయితే, 2020 నుంచి కరోనా వేవ్స్ వెంటాడటంతో చాలా సినిమాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి. కొన్ని రిలీజ్ వరకు వచ్చి ఆగిపోతే.. కొన్ని సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకున్న తర్వాత నిలిచిపోయాయి. దాదాపు 2021లో చాలా సినిమాలది ఇదే పరిస్థితి. అందుకే ఏ ఒక్క సినిమాను అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోయారు.


‘ఆర్ఆర్ఆర్’: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ఎన్నోసార్లు పోస్ట్‌పోన్ అయింది. గత ఏడాది ఎట్టిపరిస్థితుల్లో రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. గత సంక్రాంతికి రిలీజ్ అన్నారు. ఆ తర్వాత సమ్మర్..దాని తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో.. అని వార్తలు వచ్చాయి. ఇవన్నీ కాదని మేకర్సే అఫీషియల్‌గా ఈ ఏడాది అక్టోబర్ 13న దసరా పండుగ సందర్భంగా రిలీజ్ అని ప్రకటించారు. కానీ, కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి మళ్ళీ పోస్ట్‌పోన్ అయి వచ్చే ఏడాది జనవరి 7న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.


‘ఆచార్య’: మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ 'ఆచార్య' సినిమా గత ఏడాది రిలీజ్ అనుకున్నది కాస్త ఈ ఏడాది సమ్మార్ కానుకగా మే 13న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, కరోనా వేవ్స్.. అలాగే, చరణ్ 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్న కారణంగా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి కాక వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు. 


‘రాధే శ్యామ్’: రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన రాధే శ్యామ్ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా సెగ గట్టిగా తగిలి 2022 కి పోస్ట్ పోన్ అయింది. మధ్యలో హీరోయిన్ పూజా హెగ్డే ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల కూడా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ఆగిపోయింది. వచ్చే నెల 14న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.


‘సర్కారు వారి పాట’: సూపర్ స్టార్ మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, మహేశ్ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేయలేకపోయాడు. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతున్న సర్కారు వారి పాటకు కరోనా ఒక్కటే కాదు..వీసా సమస్య ఇబ్బంది పెట్టింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరిదశ షూటింగ్‌లో ఉంది. 2022, సంక్రాంతికి రిలీజ్ అనుకొని కూడా మళ్ళీ ఏప్రిల్ 1కి రీ షెడ్యూల్ చేశారు.


‘ఎఫ్ 3’: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్. సూపర్ హిట్ చిత్రం ‘ఎఫ్ 2’ కి ఈ సినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ డబుల్ ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే చెప్పారు. సునీల్, సోనాల్ చౌహాన్ ఓ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఈ మూవీ కరోనా కారణంగా ఇప్పటికి రెండు సార్లు విడుదల తేదీ వాయిదా పడింది. సంక్రాంతికి రిలీజ్ అని 'నారప్ప' సినిమా సక్సెస్ మీట్‌లో వెంకీ చెప్పారు. కానీ, తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు. 


‘అఖండ’ - ‘ఖిలాడి’ : నట సింహం నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ, మాస్ మహారాజ డ్యూయల్ రోల్‌లో నటిస్తున్న ఖిలాడి సినిమాలను ఈ ఏడాది మే 28న ఒకేరోజు రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే, రిలీజ్ డేట్ మారినా బాలయ్య వచ్చి భారీ హిట్ అందుకున్నారు గానీ.. రవితేజ మాత్రం రాలేకపోయాడు. ఖిలాడి సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంగా వచ్చే ఏడాదికి పోస్ట్‌పోన్ అయింది. ఇలా పోస్ట్‌పోన్ అయిన సినిమాలలో రానా నటించిన విరాటపర్వం, వరుణ్ తేజ్ నటించిన గని, పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా లైగర్, అడవి శేష్ నటించిన మేజర్ సహా పలు చిత్రాలు సోలో డేట్ కోసం ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాదికి రీ షెడ్యూల్ అయ్యాయి. 

-గోవింద్ కుంచాల

Updated Date - 2021-12-22T18:03:41+05:30 IST