పాత పాత్రలు ప్రత్యేక అతిథులు

ABN , First Publish Date - 2021-06-04T06:58:36+05:30 IST

ఒకసారి చేసిన పాత్రల్లో హీరోలు మళ్లీ క నిపించడం అరుదు. అయితే ఈ మధ్యన సీక్వెల్స్‌లో హీరోలు అదే పాత్రలో కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో నయాట్రెండ్‌ మొదలైంది....

పాత పాత్రలు ప్రత్యేక అతిథులు

ఒకసారి చేసిన పాత్రల్లో హీరోలు మళ్లీ క నిపించడం అరుదు. అయితే ఈ మధ్యన సీక్వెల్స్‌లో హీరోలు అదే పాత్రలో కనిపిస్తున్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో నయాట్రెండ్‌ మొదలైంది. ఏళ్లక్రితం హీరోలుగా తాము పోషించిన  పాత్రలతోనే  అగ్రహీరోలు మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.  ప్రత్యేక అతిథులుగా ప్రేక్షకులను అలరించడానికి సై అంటున్నారు.  ఈ పాత్రల నిడివి ఎక్కువైనా, తక్కువైనా పట్టించుకోవడం లేదు. ఆ వివరాలు ఏమిటో ఓ లుక్కేద్దాం.


పఠాన్‌ చిత్రంలో టైగర్‌గా

‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాల్లో ఇండియన్‌ గూఢచారిగా ప్రేక్షకులను అలరించారు సల్మాన్‌ ఖాన్‌. ఆయన మరోసారి టైగర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్వరలోనే టైగర్‌ ఫ్రాంచైజీలో మూడో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే దీంతోపాటు ఆయన మరో చిత్రంలోనూ టైగర్‌ పాత్రను పోషిస్తున్నారు.  ఆ చిత్రంలో షారూఖ్‌ఖాన్‌ హీరో. సల్మాన్‌ఖాన్‌ టైగర్‌గా అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే అది ఇలా వచ్చి అలా వెళ్లి పోయే పాత్ర కాదట! కథలో కీలక మైన సమయంలో సల్మాన్‌ ఎంట్రీ ఉంటుందట. . సల్మాన్‌ఖాన్‌ పరిచయ సన్నివేశాలను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.  ఓ వైపు కథానాయకుడుగా నటిస్తున్న చిత్రంలోని పాత్రతోనే  మరో చిత్రంలో అతిథిగా కనిపించడం విశేషం. ఇదే ఇప్పుడు ‘పఠాన్‌’ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 


లాల్‌సింగ్‌లో ప్రేమ్‌గా

‘మైనే ప్యార్‌ కియా’లో ప్రేమ్‌గా వెండితెరపై మ్యాజిక్‌ చేశారు సల్మాన్‌ఖాన్‌. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత ఆయన  ఆ పాత్రలో మరోసారి మెరవనున్నారు. ‘లాల్‌సింగ్‌ చద్దా’లో ప్రేమ్‌గా అతిథి పాత్రలో కనిపించనున్నారు. 


సూర్యవంశీతో సింగమ్‌, సింబా

‘సింగమ్‌’ సిరీస్‌లో వస్తున్న మూడో చిత్రం ‘సూర్యవంశీ’. అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడుగా నటించారు.  ‘సింగమ్‌’ సిరీస్‌లో తొలి రెండు చిత్రాల్లో కథానాయకులుగా నటించిన అజయ్‌ దేవగణ్‌, రణ్‌వీర్‌సింగ్‌  ఇప్పుడు ‘సూర్యవంశీ’లో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ‘సింగమ్‌’ చిత్రంలో అజయ్‌ దేవగణ్‌ , ‘సింబా’ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్‌ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఇదే పాత్రల్లో మరోసారి ‘సూర్యవంశీ’ అక్షయ్‌కుమార్‌కు అండగా ఉంటారట. వీరి ముగ్గురిపై వచ్చే పతాక సన్నివేశాలు సినిమాకు ప్రఽధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు. రణ్‌వీర్‌, అజయ్‌ పరిచయ సన్నివేశాలను కూడా భారీ ఎత్తున తెరకెక్కించారట. వీరిద్దరూ సినిమాలో 20 నిమిషాలకు పైనే కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 


ఆనాటి పాత్రలో ఆమిర్‌కోసం

1995లో వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే’. ఇందులో రాజ్‌ అనే ప్రేమికుడి పాత్రలో షారూఖ్‌ఖాన్‌ ప్రదర్శించిన నటన ఎప్పటికీ మరపురానిది. దాదాపు 30 ఏళ్ల తర్వాత షారూక్‌ మళ్లీ రాజ్‌ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రా బోతున్నారని సమాచారం. ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’ కోసం ఆయన మరోసారి రాజ్‌గా ఆ నాటి పాత్రను మళ్లీ పోషించనున్నారని సమాచారం. లాల్‌సింగ్‌ చద్దా జీవిత కథగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఆమిర్‌ టైటిల్‌ పాత్రలో కనిపిస్తున్నారు. కథలో భాగంగా 1990లో ‘దిల్‌వాలే...’ చిత్రం విడుదల సందర్భంగా లాల్‌సింగ్‌ వెళ్లి షారూఖ్‌ను కలుస్తారు. అలా రాజ్‌ పాత్రలో షారూఖ్‌ కనిపించనున్నారు. కథాపరంగా కూడా ఈ పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుందని బాలీవుడ్‌ వర్గాల కథనం. ఈ చిత్రంలో షారూఖ్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయిందని సమాచారం.  

Updated Date - 2021-06-04T06:58:36+05:30 IST