చేతి రాత.. నా రాత మార్చింది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 4)

ABN , First Publish Date - 2021-06-04T01:35:19+05:30 IST

నా అభిమాన నటి సావిత్రిగారిని తొలిసారిగా ఆ సెట్లోనే చూశాను. ఆమె కొడుకుగా హరనాథ్‌ నటిస్తున్నారు. సావిత్రిగారిని దగ్గరుండి చూడాలనీ, వీలైతే ఆమెతో మాట్లాడాలనీ తహతహ లాడాను కానీ అప్రెంటిస్‌ను కావడంతో నాకు ఆ అవకాశం

చేతి రాత.. నా రాత మార్చింది: ముత్యాల సుబ్బయ్య (పార్ట్ 4)

అక్కడికి వెళ్లే ముందు ఎందుకైనా మంచిదని గోపాలరెడ్డిని కలిశాను. నేను నాటకాల్లో నటిస్తాననే విషయం ఆయనకు తెలుసు. ‘‘అన్నా, మనోళ్లందరూ నన్ను సినిమా ఇండస్ట్రీలోకి వెళ్లమంటున్నారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజేంద్రకుమార్‌గారి రికమండేషన్‌ ఉంది. మన హోటల్‌లో ఉండి ట్రై చేసుకోమంటావా?’’ అని అడిగేశా. ఆయన నవ్వేసి ‘‘అలాగే రా..రా.. మన హోటల్‌లోనే ఉండు. నీ అదృష్టాన్ని పరీక్షించుకో’’ అంటూ ప్రొత్సహించారు. ఆ మాటతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. ఎందుకంటే మాది ఆర్ధికంగా అంత బాగున్న కుటుంబం కాదు. ఏదో కాస్త పొలం ఉంది. మా నాన్నది టైలరింగ్‌ వృత్తి కావడంతో తెలిసితెలియని వ్యవసాయం. ఈ కారణంచేత పొలం మీద ఆదాయం అంతంత మాత్రమే. అమ్మ దాన్నే జాగ్రత్తగా ఖర్చు పెట్టేది. ఆ డబ్బులోంచి నన్ను చెన్నై పంపాలంటే జరిగేపని కాదు. ఇంటి నుంచి నెలనెలా డబ్బు తెప్పించుకునే అవకాశం ఉండదు. నా తిప్పలేవో నేనే పడాలి. ‘ద్వారకా లాడ్జి’లో ఉండటంవల్ల సగం ఖర్చు నాకు కలసివచ్చినట్లే. ఆ రోజున గోపాలరెడ్డి ఆ మాట అని ఉండకపోతే నేను చెన్నై వెళ్లడానికి ఆలోచించేవాడినేమో! చెన్నైలో నాకు ఎవరు తెలుసు? ఎక్కడ ఉండాలి? అందుకే ‘నా హోటల్‌లో ఉండు’ అని చెప్పిన గోపాలరెడ్డి ఆ క్షణంలో నాకు దేవుడిలానే కనిపించాడు.


సావిత్రిగారిని చూశాను

రాజేంద్రకుమార్‌గారి బంధువు రాసిచ్చిన రికమండేషన్‌ లెటర్‌ బాగానే పనిచేసింది. ఆయన నన్ను బాగానే రిసీవ్‌ చేసుకున్నారు. ఆ సమయంలో రాజేంద్రకుమార్‌గారు ‘మాతృమూర్తి’ అనే సినిమా తీస్తున్నారు. మానాపురం అప్పారావుగారు డైరెక్టర్‌. ఆ సినిమా డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో నన్ను అప్రెంటిస్‌గా చేర్పించారు రాజేంద్రకుమార్‌. యూనిట్‌లో నేను చేరిన రెండు నెలలకు షూటింగ్‌ మొదలైంది. నా అభిమాన నటి సావిత్రిగారిని తొలిసారిగా ఆ సెట్లోనే చూశాను. ఆమె కొడుకుగా హరనాథ్‌ నటిస్తున్నారు. సావిత్రిగారిని దగ్గరుండి చూడాలనీ, వీలైతే ఆమెతో మాట్లాడాలనీ తహతహ లాడాను కానీ అప్రెంటిస్‌ను కావడంతో నాకు ఆ అవకాశం కలగలేదు. మా దర్శకుడు మానాపురం అప్పారావుగారు చాలా మంచివ్యక్తేగానీ అసోసియేట్‌ డైరెక్టర్‌ మాత్రం చండశాసనుడు. సెట్‌లో ఎదురుగా కనిపించడానికి వీల్లేదు. అటూ ఇటూ తిరగకూడదు. చెప్పిన చోటే నిలబడి చెప్పిన పని చేయాలి. ఇదంతా చూశాక కొంత బాధగా అనిపించినా ‘మనం పని నేర్చుకోవడానికి వచ్చాం. తప్పదు, సర్దుకు పోవాలి’ అని నాకు నేనే నచ్చజెప్పుకొని మౌనంగా నా పనేదో నేను చేసుకునేవాణ్ణి. ఈ కారణం వల్ల ఆర్టిస్టుల్ని దూరంనుంచి చూడటం, వీలైతే నమస్కారం పెట్టడంతప్ప వారిని కలిసి మాట్లాడే అవకాశం ఉండేది కాదు. ఇదిలా ఉంటే ఒక షెడ్యూల్‌ మాత్రమే జరిగిన తర్వాత ‘మాతృమూర్తి’ షూటింగ్‌ ఆగిపోయింది. ఆర్థిక పరిస్థితులే కారణమని ఎవరో అనుకుంటుంటే విన్నాను. రాజేంద్రకుమార్‌గారి పరిస్థితి ఎలా ఉందో తెలీదు కానీ నాకు మాత్రం తొలి సినిమానే అలా ఆగిపోయినందుకు ప్రాణం ఉసూరుమంది. నా టైమ్‌ బాగోలేదని మనసులో బాధపడ్డాను.


చేతి రాత నా రాత మార్చింది

‘మాతృమూర్తి’ చిత్రం ఆగిపోవడంతో మళ్లీ నా పరిస్థితి మొదటికి వచ్చినట్టైంది. చిత్ర పరిశ్రమలో నాకు ఓ దారి దొరికిందని సంతోషించిన నా స్నేహితుడు శ్రీనివాసరెడ్డికి ఈ విషయం చెప్పగానే వాడూ బాధపడ్డాడు. అయినా ‘‘నువ్వేం వర్రీ అవకు రా, మరో ప్రయత్నం చేద్దాం’’ అని ధైర్యం చెప్పాడు. పార్లపల్లిలో శ్రీనివాసరెడ్డి ఇంటిపక్కనే అరుణ అనే అమ్మాయి ఉండేది. చెన్నైలో ఉండే జితేంద్రరెడ్డితో ఆమెకు వివాహమైంది. జితేంద్రరెడ్డి బాగా తెలిసిన వ్యక్తి కావడంతో శ్రీనివాసరెడ్డి నన్ను అతని దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశాడు. జితేంద్రరెడ్డికి సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు బాగా క్లోజ్‌. ఆయన దగ్గరకు తీసుకెళతానని చెప్పాడు. సరేనన్నాను. చలపతిరావుగారు టి.నగర్‌లోని జి.ఎన్‌.చెట్టి రోడ్‌లో ఉండేవారు. ఆ మర్నాడు ఉదయం ఆయన దగ్గరకు నన్ను తీసుకెళ్లారు. రవీంద్ర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఆ సమయంలో ‘సిసింద్రీ చిట్టిబాబు’ సినిమా తీస్తోంది. ఆ సినిమాకు చలపతిరావు సంగీత దర్శకుడు. అక్కినేని సంజీవి దర్శకుడు. శోభన్‌బాబు, శారద హీరోహీరోయిన్లు. సంజీవిగారితో మాట్లాడి ఆ సినిమాకు అప్రెంటీస్‌గా నన్ను చేర్పించారు. నా హ్యాండ్‌ రైటింగ్‌ బాగుంటుంది. నాకు ఆ సంస్థలో ఉద్యోగం దొరకడానికి కారణం నా హ్యాండ్‌రైటింగ్‌ బాగుండటమే. ఇప్పుడైతే కంప్యూటర్లు, ల్యాప్‌ ట్యాప్‌లు వచ్చాయిగానీ ఆ రోజుల్లో పొద్దస్తమానం అన్ని సీన్లూ రాయడమే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పని. అందుకే చేతి రాత బాగున్నవాళ్లనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తీసుకునేవారు.


‘సిసింద్రీ చిట్టిబాబు’ చిత్రానికి పూర్తిగా పనిచేసినా సెట్లో ఉన్న సందర్భాలు తక్కువ. ఎందుకంటే సీను పేపర్లు కాపీ చేయడమే పెద్ద ఉద్యోగంగా ఉండేది. ఎప్పుడన్నా క్లాప్‌ కొట్టడానికి అవకాశం ఇచ్చేవారు.. అంతే. శోభన్‌బాబుగారినీ, శారదగారినీ దూరంనుంచి చూడటంతప్ప దగ్గరకువెళ్లి మాట్లాడే అవకాశమే కలగలేదు. ఆ సినిమా టైటిల్స్‌లో వేయాల్సిన పేర్లు లిస్ట్‌ తయారవుతుంటే నాలో అలజడి మొదలైంది. అందరితో పాటు నా పేరు కూడా వేస్తారా? లేదా.. నేను అప్రెంటిస్‌ను కనుక నా పేరు వేయరేమో! ‘నా పేరు కూడా వెయ్యండి సార్‌’ అని అడిగితే..? అమ్మో! ఏమన్నా అంటే....ఇలా నాలో ఆలోచనలు సాగుతున్న తరుణంలో మా అసోసియేట్‌ డైరెక్టర్‌ పిలిచి ‘‘నీ పూర్తి పేరు ఏమిటయ్యా’’ అనడిగాడు. అంతే. నా మొహం ఆనందంతో వెలిగిపోయింది. అంటే నా పేరు కూడా టైటిల్స్‌లో వేస్తారన్నమాట. ఆ ఆనందాన్ని అణచుకుని, ‘‘ముత్యాల సుబ్బయ్య సార్‌’’ అన్నా. ‘‘ఓకే.. ఎం. సుబ్బయ్య’’ అని పేపరు మీద రాసుకొన్నాడు. ‘ముత్యాల సుబ్బయ్య’ అని టైటిల్స్‌లో ఉంటే మా ఊరివాళ్లకు తెలుస్తుంది కానీ ఎం. సుబ్బయ్య అంటే ఎవరు గుర్తుపడతారు.. ‘నా పూర్తిపేరు వెయ్యండి సార్‌’ అని అడిగే ధైర్యం కూడా ఆ రోజుల్లో నాకు ఉండేది కాదు. అడిగితే ఏమనుకుంటారో అనే భయంతో మౌనంగా ఊరుకొన్నాను. ‘సిసింద్రీ చిట్టిబాబు’ టైటిల్స్‌లో ‘ఎం. సుబ్బయ్య’ అని కనిపించిన నా పేరు చూసుకున్నాక ఆనందం కలిగింది.. కానీ పూర్తిపేరు వేసి ఉంటే బాగుండేదన్న అసంతృప్తి మాత్రం ఉంది. ఆ సినిమా తర్వాత మళ్లీ ఖాళీ! పొద్దున్నే లేచి పాండీ బజార్‌ వెళ్లడం, తెలిసినవాళ్లు కనిపిస్తే కబుర్లు చెప్పుకుని తిరిగి రావడం... ఇదే పని.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Updated Date - 2021-06-04T01:35:19+05:30 IST