‘మా’ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం వద్దు -విష్ణు మంచు

ABN , First Publish Date - 2021-09-25T06:36:37+05:30 IST

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిండెంట్‌ పదవికి పోటీ చేస్తున్న బాబూమోహన్‌ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయింది. సంస్కారం, క్రమశిక్షణ తెలియని వ్యక్తులు చాలా మాట్లాడుతున్నారు. మా ప్రత్యర్థి గణాంకాలు చెపుతున్నాడు....

‘మా’ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం వద్దు  -విష్ణు మంచు

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిండెంట్‌ పదవికి పోటీ చేస్తున్న బాబూమోహన్‌ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు లేకుండా పోయింది. సంస్కారం, క్రమశిక్షణ తెలియని వ్యక్తులు చాలా మాట్లాడుతున్నారు. మా ప్రత్యర్థి గణాంకాలు చెపుతున్నాడు. చిత్ర పరిశ్రమను విభజించి, సంస్కార ం లేకుండా మాట్లాడుతున్నాడు. ‘మా‘కు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న విష్ణు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి.  ఇప్పుడున్న పరిస్థితుల్లో విష్ణు లాంటి  సమర్థుడైన వ్యక్తి, ఇలాంటి ప్యానల్‌ అవసరం ‘మా’కు ఉంది’’  అన్నారు. 


‘‘దయచేసి రాజకీయ పార్టీలు ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దు. ఇక్కడ జరిగేది మా ఎన్నికలు. ‘మా’ కార్యవర్గాన్ని ఎన్నుకునే  పూర్తి స్వేచ్ఛ సభ్యులకు ఉంది. ‘విష్ణును అధ్యక్షపదవి పోటీ నుంచి తప్పుకోమని చెప్పండి’ అని నాన్నకు ఫోన్‌ చేశారు. ఒక మంచి పని కోసం పోరాడుతున్న మేము పోటీ నుంచి ఎందుకు తప్పుకోవాలి’’ అని విష్ణు మంచు ప్రశ్నించారు. ‘మా’కు అక్టోబర్‌ 10న ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశ్‌రాజ్‌ అధ్యక్షుడిగా ‘సినిమా బిడ్డలు’ పేరుతో తన ప్యానల్‌ను ప్రకటించారు. పోటీగా విష్ణు తన ప్యానల్‌ను ప్రకటించారు. తొలిసారి తన ప్యానల్‌ సభ్యులతో శుక్రవారం మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...


‘‘నా ప్రత్యర్థి ప్యానల్‌లో ఉన్న నటీనటులు నిర్మాతగా నేను తీసిన సినిమాల్లో నటించారు. వాళ్లు బాగా నటించగలరు. భవిష్యత్తులోనూ నేను తీసే సినిమాల్లో వాళ్లను తీసుకుంటాను. కానీ వారు సినీ కార్మికుల సంక్షేమానికి ఏ మాత్రం పాటుపడలేరు. నాకంటే మెరుగ్గా పని చేయలేరు. ఆ విషయం పరిశ్రమలో అందరికీ తెలుసు. 


‘మా’కు అధ్యక్షుడిగా ఉండటం హోదా కాదు, అదొక పెద్ద బాధ్యత. ‘మా’కు సేవ చేయగలను అన్న నమ్మకం నాకుంది. సమర్థులతో ప్యానల్‌ను ఎన్నుకున్నాం. ఇందులో పదిమంది మహిళలు ఉన్నారు. పార్టీలు, పబ్బులకు వెళ్లేవాళ్లు లేరు. అంతా పని చేసేవాళ్లే. నా ప్యానలే నా బలం. 


సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల సమీకరణ చేయడానికి ఇళయరాజాను పిలిచి మ్యూజిక్‌ షోలు చేయాలంటున్నారు. ఎవర్నీ అడగాల్సిన అవసరం లేకుండానే చిత్ర పరిశ్రమ అంతా కలసి, ఆ పని చేయవచ్చు. తినడానికి తిండి లేకపోతే రెస్టారెంట్లలో డిస్కౌంట్‌ కూపన్లు ఇప్పిస్తామనడంలో ఔచిత్యం అర్థం కావడం లేదు. ఎన్నికల హామీలో ‘మా’కు సొంత భవనంతో పాటు నటీనటులకు పెన్షన్‌, ఇన్స్యూరెన్స్‌, ఎడ్యుకేషన్‌ పాలసీ అమలు చేయడమే నా ప్రాధాన్యం. ఏ అంశంపైన అయినా  చర్చకు నేను సిద్ధం. 


మా’ ఎన్నికలు జరుగుతున్న తీరుతో మేం ఎవ్వరం కూడా సంతోషంగా లేము. గతంలో ఎప్పుడూ ఇంత హోరాహోరీ పోరు లేదు. చిత్ర పరిశ్రమ రెండుగా చీలింది. పలు రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్నవారు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో మా ప్యానల్‌ తరపున బరిలో నిలిచారు. అయితే వారంతా నటులుగా సేవ చేసేందుకు మాత్రమే ‘మా’ కోసం ఇక్కడ నిలిచారు. 


పోటీ చేయమని నన్ను అడిగారు


గతంలో ‘మా’ ఎన్నికల సమయంలో స్వర్గీయ దాసరి నారాయణరావు గారు, మురళీమోహన్‌గారు నన్ను ‘మా’కు అధ్యక్షుడిగా ఉండమన్నారు. విష్ణు అయితే బాగా కష్టపడగలడు. మార్పు తీసుకురాగలడు అని వాళ్లు నా మీద పెట్టుకున్న నమ్మకం అది. కానీ అప్పట్లో సమయం కేటాయించలేనని చెప్పి తప్పుకొన్నాను. ఇప్పుడు కూడా కొందరు సినీ పెద్దలు ‘విష్ణును పోటీ చేయించండి’ అని మా నాన్నను అడిగారు కాబట్టే నేను అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను. అప్పటితో పోల్చితే ఇప్పుడు మరింత ఎక్కువ సవాళ్లు ఉన్నాయి. అయినా వాటిని అధిగమించగలిగే శక్తి నాకు ఉంది.’’ 

ఈ కార్యక్రమంలో విష్ణు ప్యానల్‌ సభ్యులు శివబాలాజీ, మాదాల రవి, గీతాసింగ్‌, కరాటే కల్యాణి, గౌతమ్‌రాజు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-25T06:36:37+05:30 IST