‘మా’లో ‘మంచు’ కురిసింది
ABN , First Publish Date - 2021-10-11T03:40:53+05:30 IST
వెరసీ ‘మా’ యుద్ధం ముగిసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో మంచు కుటుంబాన్ని విజయం వరించింది. పాతికేళ్ల చరిత్ర ఉన్న ‘మా’ అసోసియేషన్‌లో ఈ రకంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. సాఽధారణ ఎన్నికలను తలపించేలా జరిగిన ‘మా’ ఎన్నికలు ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించాయి. ఇరు ప్యానళ్లలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అందరూ అనుకున్నట్లుగానే విష్ణుపై మంచు కురిసింది.

విమర్శలు.. ప్రతి విమర్శలు.
ఆరోపణలు... ప్రత్యారోపణలు
మాటకు మాటగా కౌంటర్లు...
విమర్శల నుంచి వ్యక్తిగత దూషణలు..
నువ్వా? నేనా? అన్నట్లు పోటాపోటీ ప్రచారాలు
విందు – తదితర పార్టీలు..
చివరి క్షణం వరకూ రకరకాల ట్విస్టులు
‘మా’ అధ్యక్ష పీఠం కోసం మూడు నెలలుగా ఇరు ప్యానళ్ల కసరత్తులు...
వెరసీ ‘మా’ యుద్ధం ముగిసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో మంచు కుటుంబాన్ని విజయం వరించింది. పాతికేళ్ల చరిత్ర ఉన్న ‘మా’ అసోసియేషన్‌లో ఈ రకంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు. సాఽధారణ ఎన్నికలను తలపించేలా జరిగిన ‘మా’ ఎన్నికలు ప్రతి ఒక్కరి దృష్టినీ ఆకర్షించాయి. ఇరు ప్యానళ్లలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. అందరూ అనుకున్నట్లుగానే విష్ణుపై మంచు కురిసింది. ఫైనల్‌గా అధ్యక్షుడిగా మెరిశారు. అఽత్యధిక మెజారిటీతో అధ్యక్ష పదవి మంచు విష్ణుని వరించింది. ఆఫీస్ బ్యారర్స్లో విష్ణు ప్యానల్‌కు ఆరు సీట్లు దక్కితే.. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు రెండు సీట్లు లభించాయి. ఈసీ సభ్యుల్లో 11 మంది ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందగా, ఏడుగురు విష్ణు ప్యానల్ నుంచి గెలిచారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకూ జరిగింది. స్టార్ హీరోలంతా ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకు ముందు ప్రచార కార్యక్రమాల్లో మాటల తూటాలు పేల్చుకున్న ఇరు ప్యానల్ సభ్యులు పోలింగ్ కేంద్రంలో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. కుటుంబాలను దూషించేకునే వరకూ వెళ్లిన ప్యానళ్లు ఉన్నయాన్నే ఆలింగనం చేసుకుని జనాల్ని ఆశ్చర్యపరిచాయి. ఓటింగ్ ప్రక్రియలో ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ రెండు ప్యానళ్లు సంయమనం పాటించాయి.
విష్ణుకు కలిసొచ్చిన అంశాలు...
మొదట ‘మా’ ఎన్నికల పట్ల అంత ఆసక్తి చూపించని మోహన్‌బాబు చిరంజీవి సపోర్ట్ ప్రకాశ్రాజుకి ఉందని తెలిసి ప్రెస్టీజీయస్‌గా తీసుకుని విష్ణుకు అండగా నిలబడ్డారు. స్వయంగా ఆయనే రంగంలో దిగి చక్రం తిప్పారు. తనకు సపోర్ట్‌గా నిలిచిన నరేశ్ లోకల్.. నాన్ లోకల్ అనే అంశాన్ని లేవనెత్తడం, తెలుగువారి ఆత్మగౌరవం అంటూ చేసిన క్యాంపెయిన్, మ్యానిఫెస్టోలో చెప్పిన విద్యా, ఉపాధి తదితర అంశాలు కూడా విష్ణుకు కలిసొచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్టిస్ట్‌లను సైతం ఫైట్ టికెట్స్ వేసి ఓట్ల కోసం రప్పించడం కూడా విష్ణుకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఫలితంగా విష్ణు ‘మా’ అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకోనున్నారు.