MAA Controversy: కౌంటర్ వీడియో విడుదల చేసిన మంచు విష్ణు

ABN , First Publish Date - 2021-10-24T21:59:10+05:30 IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్(మా) ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ప్రకాశ్ రాజ్ ఆరోపించడం, అందుకు తగిన ఆధారాలు కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సంచలనంగా మారింది.

MAA Controversy: కౌంటర్ వీడియో విడుదల చేసిన మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్(మా) ఎన్నికల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ప్రకాశ్ రాజ్ ఆరోపించడం, అందుకు తగిన ఆధారాలు కూడా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. వైసీపీ కార్యకర్త సాంబశివరావు ‘మా’ ఎన్నికల సందర్భంగా మంచు ఫ్యామిలీతో కలిసి ఉన్న దృశ్యాలను ప్రకాశ్ రాజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ప్రశ్నలు సంధించారు. దీనిపై తాజాగా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ప్రకాశ్ రాజ్ వీడియోకు కౌంటర్ వీడియోను మంచు విష్ణు తాజాగా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పోటీ చేసి గెలిచిన శ్రీకాంత్ తనయుడు రోషన్ తిరుమల పర్యటనలోనూ వైసీపీ కార్యకర్త సాంబశివరావు కనిపించారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ఇటీవల ‘పెళ్లిసందD’ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ విడుదలకు ముందు హీరో రోషన్, హీరోయిన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సందర్భంలో వారి వెనుక వైసీపీ కార్యకర్త సాంబశివరావు కనిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. విష్ణు ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ప్రకాశ్ రాజ్ ప్యానల్‌‌లోని వారికి కూడా సాంబశివరావుతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గం ఆరోపిస్తోంది. దీనికి ప్రకాశ్ రాజ్ ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాలి.


అసలు ఎవరీ సాంబశివరావు?

నూకల సాంబశివరావు అలియాస్ సాంబ. కృష్ణాజిల్లా జగ్గయ్య పేటకు చెందిన సాంబ వైసీపీలో క్రియాశీలక కార్యకర్త. చిన్న చిన్న సెటిల్‌మెంట్స్ చేసే స్థాయి నుంచి భారీ సెటిల్‌మెంట్లు చేసే స్థాయికి ఎదిగాడు. ముందు నుంచి వివాదాస్పదుడైన సాంబపై రౌడీ షీట్ కూడా ఉంది. ఆలేటి రాజారావు హత్యకేసులో సాంబ కీలక నిందితుడు. గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను శిబిరంలో చేరిన సాంబ.. నందిగామ మండలం ఐతవరంలో జరిగిన మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు బంధువు పుల్లయ్య హత్యకేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. జగ్గయ్య పేట నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సాంబకు సినీరంగ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఫైనాన్స్ సంస్థల బకాయిల వసూళ్లకు సినీ రంగ ప్రముఖులు సాంబ, అతని అనుచరులను ఉపయోగించుకునేవారు. ఈ క్రమంలో మంచు మోహన్ బాబు కుటుంబంతో సాంబకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి.



Updated Date - 2021-10-24T21:59:10+05:30 IST