కొత్త కొత్త రూల్స్‌‌కి వ్యతిరేకంగా నిరాహార దీక్ష: కోట (పార్ట్ 59)

ABN , First Publish Date - 2021-12-30T04:10:24+05:30 IST

మన సినిమా పరిశ్రమకి సరిపోదు. ఇక్కడైనా, ఎక్కడైనా కొత్త కొత్త రూల్స్‌గా కాకుండా, పాత ప్రకారం వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. దానికి ఏదో ఒకటి చేయాలి. అనామకులు చేస్తే ప్రయోజనం ఉండదు.. అందుకే నేనే నిరాహార దీక్ష..

కొత్త కొత్త రూల్స్‌‌కి వ్యతిరేకంగా నిరాహార దీక్ష: కోట (పార్ట్ 59)

సత్పురుషుడి నోటి నుంచి వచ్చిన మాట, ఒక సత్సంకల్పంతో చేసే పోరాటం ఎప్పుడైనా మనకు బలాన్నిస్తాయి. ఆ ఉద్దేశంతోనే ఒకసారి నేను కార్మికుల కోసం నిరాహారదీక్ష చేశా. ఇది ఇప్పటి మాట కాదు. పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కి తరలి వస్తున్న రోజుల నాటి మాట. మద్రాసులో ఫెప్సీ విజయన్‌ మాస్టర్‌ సారథ్యంలో బాగా హడావిడిగా ఉండేది. వాళ్లేంటంటే హైదరాబాద్‌లో షూటింగ్‌లకు కూడా అక్కడివాళ్ళనే తీసుకురావాలని, లేకుంటే మద్రాసులోనే షూటింగ్‌లు పెట్టుకోవాలని.. లాంటి రూల్స్‌ అప్పట్లో చాలా పెట్టారు. దాంతో ఇండస్ర్టీలో ఒకరకమైన అనిశ్చితి ఏర్పడింది. ఎక్కడైనా నలుగురూ బతకాల్సిందే, మద్రాసులో ఉండగా తెలుగువారు తమిళ సినిమాలకు పనిచేసేవారు. పరిశ్రమ హైదరాబాద్‌ తరలి వచ్చిన తర్వాత ఇక్కడివారికి ఉపాధి కలుగుతుంది.


అలా కాకుండా అక్కడివాళ్ళే చేయాలనడం ఏంటి? అందరం కలిసి అన్నిచోట్లా పనిచేయాలి. కొన్ని చోట్లే పనిచేస్తామని అనడం మన సినిమా పరిశ్రమకి సరిపోదు. ఇక్కడైనా, ఎక్కడైనా కొత్త కొత్త రూల్స్‌గా కాకుండా, పాత ప్రకారం వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. దానికి ఏదో ఒకటి చేయాలి. అనామకులు చేస్తే ప్రయోజనం ఉండదు. నాకు అప్పటికే అంతోకొంతో పేరుంది. ఆ పేరు జనాలిచ్చిందే. ఆ పేరును నలుగురి కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నా. నిరాహార దీక్ష చేద్దామనుకున్నా. ఎందుకో ఒకరోజు మధ్యాహ్నం ఆ ఆలోచన వచ్చింది. అటు చూస్తే జగపతి రాజేంద్రప్రసాద్‌గారు కనిపించారు. ఆయన కూడా అయ్యప్ప దీక్షలో ఉన్నారు. నేనూ దీక్షలోనే ఉన్నా. సరేనని ఆయన దగ్గరకు వెళ్ళి ‘పరిశ్రమ కోసం ఇలా కూర్చుంటున్నానండీ’ అన్నా.


‘అందరం ఉన్నాం.. మీరు సడెన్‌గా కూర్చుంటానంటే ఎలా.. ఉండండీ! అందరం కలిసి మాట్లాడుకుందాం’ అన్నారు. ‘అలా కాదులెండి. ఏదో చేయాలనిపిస్తోంది. చేస్తాను. మీతో చెప్పాలనిపించింది’ అని ఆయనతో అని వెళ్ళి కూర్చున్నా. నాకు అప్పుడప్పుడే డయాబెటిక్‌ అటాక్‌ అయింది. కానీ దీక్ష ఎలా చేశానో నాకే తెలియదు. అయ్యప్ప దీక్షలో ఉన్నాను కాబట్టి ఆ స్వామి దయతోనే పూర్తిచేయగలిగానేమో అనిపిస్తుంది. రామానాయుడుగారు, కృష్ణంరాజుగారు, జగపతి రాజేంద్రప్రసాద్‌గారు, తమ్మారెడ్డి భరద్వాజగారు, కె.ఎస్‌.రామారావుగారు, సురేశ్‌బాబుగారు, వెంకటేశ్‌గారు, నాగార్జునగారు.. ఇలా అందరూ నాకు బాగా సపోర్ట్‌ చేశారు. అప్పుడప్పుడే పరిశ్రమ చెన్నై నుంచి తరలి రావడం కదా... జనాల్లో సినిమా వాళ్లంటే విపరీతమైన క్రేజ్‌ ఉండేది.


నేను దీక్ష చేసినన్నాళ్ళూ విపరీతమైన జనం ఉండేవారు చుట్టూ. కృష్ణంరాజుగారు ఒక రోజు దీక్ష దగ్గరకు వచ్చి ‘పరిశ్రమ సమస్యలు ఏమో కానీ, నువ్వు మాత్రం జనాల్లో హీరో అయిపోతున్నావు శ్రీనివాసరావూ’ అన్నారు. ‘ఊరుకోండి సార్‌.. భలే చెప్తారు. మనకి కొత్తగా రావాల్సిన పేరు ఏముంది? ఏదో నలుగురికోసం కూర్చున్నాను’ అన్నా. నాగార్జునగారు, వెంకటేశ్‌గారు తలా ఒకరోజు వచ్చి కూర్చుంటామని కబురంపారు. కానీ నేనే ‘వద్దు బాబూ.. ఇప్పటికే జనాలు విపరీతంగా వస్తున్నారు. మీరు కూడా వస్తే వాళ్ళను అదుపుచేయడం కష్టమవుతుంది. మీరు ఆ మాటన్నారు అదే చాలు’ అని చెప్పా. అంటే వాళ్ళు రావడం నాకేమీ ఇష్టం లేకకాదు, కాసేపు నాగార్జునగారు వచ్చి నాకు తోడుగా కూర్చుంటే నాకు బాగానే ఉంటుంది. కానీ పబ్లిక్‌ కంట్రోల్‌లో ఉంటారా? వెంకటేశ్‌బాబును చూస్తే ఊరుకుంటారా? నా అనుమానం అదే. వాళ్ళు కూడా సహృదయంతో అర్థం చేసుకున్నారు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-12-30T04:10:24+05:30 IST