రాజమౌళి సమాధానం విని నేనే షాకయ్యా..: కోట (పార్ట్ 58)

ABN , First Publish Date - 2021-12-29T03:46:26+05:30 IST

ఒకసారి ఒక టీవీ ఛానెల్‌ వాళ్ళు రాజమౌళిగారిని ఇంటర్వ్యూ చేశారట. అందులో ‘మీకు ఇష్టమైన హీరో ఎవరండీ’ అని అడిగారట. రాజమౌళిగారు చెప్పిన సమాధానం విని నేనే షాక్‌ అయ్యా. రాజమౌళి అసలేం తడుముకోకుండా..

రాజమౌళి సమాధానం విని నేనే షాకయ్యా..: కోట (పార్ట్ 58)

ఇక కీరవాణిగారి విషయానికి వస్తే, ఆయనకు నేను పాడిన పాటే కాదు.. నేనన్నా చాలా అభిమానమండీ. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయం చెప్పారు. మీకు నచ్చిన నటుడెవరు? అని విలేకరి అడిగితే ‘‘నాకు వాయిద్యాల్లో వేణువు ఎంత ఇష్టమో, నటుల్లో కోట శ్రీనివాసరావు అంటే అంత ఇష్టం’’ అని సమాధానమిచ్చారు. నా శ్రేయోభిలాషులు ఎవరో ఆ పత్రిక తెచ్చిస్తే చూసి చదివి ఆనందించి, కీరవాణిగారిని కలిసి మాట్లాడాను. ఆ తర్వాత కూడా ఆయన గురించి నాతో చాలా మంది చాలా విషయాలు చెప్పారు. అందులో ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా ప్రివ్యూలకు వెళ్తుంటారు కదా! అలాంటప్పుడు ఆ సినిమాల్లో నా వేషం ఉందనుకోండి. అది స్ర్కీన్‌ మీద వస్తే ‘ఏం ఇచ్చారయ్యా ఆయనకి. ఎంతిచ్చారు మీరు’ అని అడుగుతారట కీరవాణి. అవతలివాళ్ళు ఏదో సమాధానం చెబుతారు కదా.. అది విని ‘‘ఏమివ్వగలరు మీరు ఆయనకి? అలాంటి నటుడిని డబ్బుతో కొనగలరా? కోట తెలుగువాడవడం మన అదృష్టం’’ అని అంటుంటారట. కీరవాణిగారే కాదు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాకు బాగా పరిచయం. రాజమౌళిగారితోనూ రెండు మూడు సినిమాలు చేశాను.


ఒకసారి ఒక టీవీ ఛానెల్‌ వాళ్ళు రాజమౌళిగారిని ఇంటర్వ్యూ చేశారట. అందులో ‘మీకు ఇష్టమైన హీరో ఎవరండీ’ అని అడిగారట. రాజమౌళిగారు చెప్పిన సమాధానం విని నేనే షాక్‌ అయ్యా. రాజమౌళి అసలేం తడుముకోకుండా ‘కోట శ్రీనివాసరావుగారు’ అని చెప్పారట. ఈ విషయం నాతో చెప్పింది కూడా రాజమౌళిగారే. ఆ క్షణం ఒకరకమైన భావోద్వేగానికి గురయ్యానంటే నమ్మండి. అందగాణ్ణి కాదు, కమర్షియల్‌ హీరోని కాదు, మరొకటి మరొకటి కాదు.. అయినా ‘బాహుబలి’లాంటి సినిమాకు దర్శకత్వం చేసిన వ్యక్తి, ఆయనకు నచ్చిన హీరో అని నా పేరు చెప్పడం మామూలు విషయమా? అలాగని రాజమౌళిగారి ఫ్యామిలీని నేను తరచూ కలుస్తూ ఉంటాననుకుంటే పొరపాటే. కలిసేది తక్కువే కానీ మానసికంగా మాకు ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, అభిమానాలు మెండు. ఈ మధ్యనే ఒకసారి కీరవాణిగారితో ‘మీ తమ్ముడు రాజమౌళిగారికి ఒకసారి చెప్పండి. నాకు మంచి వేషం ఇవ్వమని’ అన్నాను. దానికి ఆయన ఏమన్నారో తెలుసా? ‘వాడి బాధేంటో... తాతకి దగ్గునేర్పడానికి వాడికున్న ఇబ్బందులేమిటో’ అని. ఆ మాట నాకు వెయ్యి సినిమాల అవకాశం వచ్చినంత బలాన్నిచ్చింది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-12-29T03:46:26+05:30 IST