ఆ పాట విషయంలో నాకు ధైర్యం పవన్‌కల్యాణ్‌గారే: కోట (పార్ట్ 57)

ABN , First Publish Date - 2021-12-23T03:32:37+05:30 IST

‘ఇలా జరిగిందండీ... నేను పాడటమేంటి?’ అని ఆయనకు అంతా చెప్పా. ‘ఓహ్‌.. మీరు పాడితే బానే ఉంటుందండీ. అందులోనూ మందు పాట అంటున్నారు.. దేవిశ్రీ ప్రసాద్‌ ఏదీ ఊరికే చేయడు. చేశాడంటే విషయం ఉండే ఉంటుంది. రండి చూద్దాం’ అని..

ఆ పాట విషయంలో నాకు ధైర్యం పవన్‌కల్యాణ్‌గారే: కోట (పార్ట్ 57)

‘దేవి పాడితే మీ ఏజ్‌కి సరిపోయినట్టు, పెద్దవాళ్ళు పాడినట్టుగా రావడం లేదు. నా మాట విని పాడండి బాబాయ్‌ మీరు’ అని హరీశ్‌ కూడా అన్నాడు. ‘బావుండదండీ నేను పాడితే’ అని సర్దిచెప్పబోయా. కానీ వాళ్ళిద్దరూ ఒప్పుకుంటేనా?.. ‘లేదు లేదండీ.. మీకు తాళజ్ఞానం ఉంది. మీరు పాడగలరు’ అని ఇద్దరు కలిసి చెప్పారు. దేవి నన్ను ఇంకో రూమ్‌లోకి తీసుకెళ్ళి హెడ్‌ఫోన్స్‌ పెట్టారు. నా పక్కన నిలబడి ఒక్కోలైనూ పాడసాగారు. ఆయన పాడటం దాన్ని అందుకుని నేను పాడటం, ఆయన పాడటం, నేను పాడటం.... ఇదే వరస. ఎలా జరిగిందో, ఎప్పుడు రికార్డింగ్‌ అయిందో నాకు తెలియనేలేదు. రికార్డింగ్‌ పూర్తయింది అన్నారు. నా చెవిలో హెడ్‌ ఫోన్స్ తీస్తూ ‘చూడండి బాబాయ్‌.. ఈ పాట ఎంత ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తుందో’ అన్నారు దేవి.


‘ఏం జరుగుతోందో నాకేం అర్థం కాలేదు. నేనేంటి? పాడటమేంటి?’ అని అంటూ బయటికి వచ్చా. అప్పుడే లోపలికి వస్తూ కీరవాణిగారు కనిపించారు. ‘ఏంటి కోటగారు.. రికార్డింగ్‌ స్టూడియోకి వచ్చారు’ అని పలకరించారు. ‘ఇలా జరిగిందండీ... నేను పాడటమేంటి?’ అని ఆయనకు అంతా చెప్పా. ‘ఓహ్‌.. మీరు పాడితే బానే ఉంటుందండీ. అందులోనూ మందు పాట అంటున్నారు.. దేవిశ్రీ ప్రసాద్‌ ఏదీ ఊరికే చేయడు. చేశాడంటే విషయం ఉండే ఉంటుంది. రండి చూద్దాం’ అని నాతో పాటు ఆయన కూడా లోపలికి నడిచారు.


ఆయన్ని చూడగానే దేవిశ్రీప్రసాద్‌ నమస్కరించి, నేను పాడిన పాట వినిపించారు. విన్నాక ‘చాలా బావుంది కోటగారూ.. ప్రజల్లోకి వెళ్తుంది చూడండి’ అన్నారు కీరవాణిగారు. ఆయన సంగీతంలో దిట్ట. కీరవాణిగారు కూడా పాజిటివ్‌గా స్పందించడంతో ఇంకాస్త సౌకర్యంగా అనిపించింది. అసలు మొదటి నుంచీ ఆ పాట విషయంలో నాకు ధైర్యం పవన్‌కల్యాణ్‌గారే. ఆయన నటించిన సినిమా కాబట్టి కొన్ని విషయాలు ఎలా ఉన్నా చెల్లు బాటై పోతాయి. ఎందుకంటే అభిమానులు, ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆయనమీదే ఉంటుంది కనుక. ఆ ధైర్యంతోనే, నా పాట కూడా తోసుకుపోతుంది. కామెంట్లు చేసేవారు కూడా పెద్దగా ఉండరని పాడేశా. విడుదలయ్యాక మందు షాపుల్లో నా పాట హిట్‌ అయి మంచి పేరు తెచ్చిపెట్టిందనుకోండి... అది వేరే విషయం. 

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-12-23T03:32:37+05:30 IST

Read more