ఆ ఏజ్ కుర్రాళ్ళల్లో అంత బ్రిలియంట్ డైరెక్టర్ని చూడలేదు: కోట (పార్ట్ 41)
ABN , First Publish Date - 2021-10-22T03:55:09+05:30 IST
నాకూ, వెంకటేష్‌బాబుకు ఒక కెమిస్ట్రీ ఉంటుంది. ఒకరికి ఒకరం సన్నివేశంలో అల్లుకుపోతుంటాం. ఆ సీన్ విషయంలోనూ అదే జరిగింది. డైరెక్టర్ ఎక్కడా కట్ చెప్పడానికి వీల్లేకుండా సింగిల్ షాట్లో చేసేశాం. అది చూసి..

అతను బ్రిలియంట్
దర్శకుల్లో శ్రీరాఘవను నేను మర్చిపోకూడదు. కస్తూరి రాజాగారి అబ్బాయి. శ్రీరాఘవ తమ్ముడు ధనుష్ కూడా హీరో. శ్రీరాఘవ దర్శకత్వంలో నేను తొలిసారి చేసిన చిత్రం ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’. ఒకరోజు రామానాయుడుగారు ఫోన్‌చేసి ‘శ్రీరాఘవ అని డైరెక్టర్. వెంకటేశ్‌బాబు హీరో. తండ్రి వేషం ఉంది. కాల్షీట్లు అవీ మేనేజర్ వచ్చి మాట్లాడతాడు. నువ్వు చెయ్యి కోటయ్యా. బాగుంటుంది’ అన్నారు. నాకే కాదు ఆయన సినిమాలో ప్రతి ఆర్టిస్టుతోనూ ఆయన పర్సనల్‌గా అలాగే మాట్లాడేవారు. అంతటి సంస్కారవంతుడు. నాయుడుగారు చెప్పినట్టే డైరెక్టర్ శ్రీరాఘవ వచ్చి కలిశారు. తెలుగు కూడా అతను బాగానే మాట్లాడుతారు. భావాన్ని చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. నేను ఆ ఏజ్ కుర్రాళ్ళల్లో అంత బ్రిలియంట్ డైరెక్టర్ని చూడలేదు. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రంలో తండ్రి కేరెక్టర్ని ఆయన చెప్పడం మొదలుపెట్టినప్పుడు ‘ఏంట్రా ఇంత ఫన్నీగా ఉంది’ అనుకున్నా. కానీ చెప్పేకొద్దీ దాని తీవ్రత తెలిసింది. తండ్రీ కొడుకులకు మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా చెప్పారు.
ఎదిగిన కొడుక్కి ఉద్యోగం లేకపోతే, వాడికి పెళ్ళి కాకపోతే ఓ మధ్య తరగతి తండ్రి పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో, అతని ప్రవర్తన ఎలా ఉంటుందో చాలా ఎక్స్‌లెంట్‌గా వివరించారు నాకు. ‘నాకు ఇప్పటికే చూపు ఆనడం లేదు. నెలకి ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నానో ఆలోచించావట్రా’ అనే డైలాగ్ ఉంటుంది. ఆ సినిమాలో నా పాత్రకు ఆయువుపట్టు అదే. నిజానికి ఆ సీన్‌ని రెండు, మూడు షాట్లుగా డివైడ్ చేసి తీద్దామనుకున్నారు. కానీ నాకూ, వెంకటేష్‌బాబుకు ఒక కెమిస్ట్రీ ఉంటుంది. ఒకరికి ఒకరం సన్నివేశంలో అల్లుకుపోతుంటాం. ఆ సీన్ విషయంలోనూ అదే జరిగింది. డైరెక్టర్ ఎక్కడా కట్ చెప్పడానికి వీల్లేకుండా సింగిల్ షాట్లో చేసేశాం. అది చూసి శ్రీరాఘవగారు ఆశ్చర్యపోయారు. నా దగ్గరకు వచ్చి ‘కోటగారు మిమ్మల్ని అందుకే పెట్టుకున్నానండీ సినిమాలో. వెంకటేశ్‌గారు కూడా చాలా బాగా రియాక్షన్ ఇచ్చారు. సీన్ అద్భుతంగా వచ్చింది. రేపు సినిమాలో చూసుకోండి’ అన్నారు.
అప్పటికే మధ్యాహ్నం అయింది. లంచ్ బ్రేక్ చెప్పేశారు. భోజనాలు చేసి అందరం మరలా లొకేషన్లోకి రాగానే వెంకటేశ్‌బాబు పర్సనల్ మేకప్‌మేన్ రాఘవ నా దగ్గరకు వచ్చాడు. ‘సార్... ఇంత సేపూ మా సారు మిమ్మల్నే అనుకుంటూ కూర్చున్నారండీ’ అన్నాడు. ‘ఏం రాఘవ.. ఏమైంది’ అని అడిగా. రాఘవ చెప్పింది ఏమిటంటే, ‘తినేశాడురా కోట. అబ్బబ్బబ్బా! ఏం నటన.. ఆయన గురించి ఏం చెప్తాంలే. అంత గొప్పగా చేశాడు. నాకే కళ్ళెమ్మట నీళ్ళు వచ్చాయి’ అని వెంకటేష్‌బాబు అన్నారు. రాఘవ అలా చెప్పగానే నాకు లోపల్లోపల కొంచెం ఆనందంగానూ, ఇంకేదోగానూ అనిపించింది. కళాకారుడికి అన్నాహారాలు అక్కర్లేదు. ‘బాగా చేశావు’ అని ఎవరైనా ఒక్క ముక్క అంటే చాలు. ఈ మాట వాళ్లూ వీళ్లూ చెబితే నేను అంటున్నది కాదు. నాకు చాలా సార్లు అనుభవంలోకి వచ్చింది. జీవితంలో ఎన్ని ఒడుదొడుకులున్నా వాటిని దాటుకుని కూడా వెళ్లి నిలబడి సినిమాలు చేసేది ఆ ఆత్మతృప్తి కోసమే.
(ఇంకా ఉంది)
-డా. చల్లా భాగ్యలక్ష్మి
