రాజేంద్రప్రసాద్.. ‘మావా ఈ సారి నంది కొట్టేశావ్‌’ అన్నారు: కోట (పార్ట్ 40)

ABN , First Publish Date - 2021-10-21T03:33:40+05:30 IST

‘ఆ నలుగురు’ సినిమా నా కెరీర్‌లో తప్పకుండా చెప్పుకోవాల్సిన చిత్రం. ఆ సినిమా విడుదలైన నాలుగు రోజులకు అనుకుంటా. అటు వైజాగ్‌ నుంచి, ఇటు తిరుపతి నుంచి ఒకటే ఫోన్లు. అయితే వారిలో ఎక్కువమంది విద్యావంతులే. అటు తిప్పి, ఇటు తిప్పి వారందరూ

రాజేంద్రప్రసాద్.. ‘మావా ఈ సారి నంది కొట్టేశావ్‌’ అన్నారు: కోట (పార్ట్ 40)

‘ఆ నలుగురు’ టాప్‌..

‘ఆ నలుగురు’ సినిమా నా కెరీర్‌లో తప్పకుండా చెప్పుకోవాల్సిన చిత్రం. ఆ సినిమా విడుదలైన నాలుగు రోజులకు అనుకుంటా. అటు వైజాగ్‌ నుంచి, ఇటు తిరుపతి నుంచి ఒకటే ఫోన్లు. అయితే వారిలో ఎక్కువమంది విద్యావంతులే. అటు తిప్పి, ఇటు తిప్పి వారందరూ అడిగిన ప్రశ్న ఒకటే.‘క్లైమాక్స్‌ మీరు ఎలా చేశారు? తెరమీద మిమ్మల్ని చూస్తుంటే మాకు కూడా ఉద్రిక్తంగా అనిపించిందండీ’ అని. నిజమే. ఇప్పుడు నేను ఆ సినిమా చూసినా ఆ సీన్ మాత్రం మిస్‌ కాకుండా చూస్తాను. అందులో రాజేంద్రప్రసాద్‌ పాత్ర చనిపోతుంది. శవాన్ని కాటికి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. అంతలో నేను వచ్చి ‘ఆగు’ అని ఆపుతా. రాజేంద్రప్రసాద్‌ కొడుకు పాత్రను ఉద్దేశించి ‘మీ నాన్న తలనరికి నా చేతిలోపెట్టి అప్పు తీర్చు’ అంటా. అసలు అలాంటి మాటలు నా నోటినుంచి ఎవరూ ఊహించరు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారు. నేను మాత్రం...‘తలయినా తాకట్టుపెట్టి అప్పు తీరుస్తానన్నాడు మీ నాన్న. ఇప్పుడు తల నరికి చేతిలో పెట్టు’ అని రెట్టిస్తాను.


చాలా గమ్మత్తైన సీన్‌ అది. చూసేకొద్దీ ఒక మయసభ గుర్తుకొస్తుందండీ. అంత బాగా తీశారు డైరెక్టర్‌ చంద్రసిద్దార్థగారు. ఆయన మొదటి నుంచి నాకు చెబుతూనే ఉన్నారు. ‘కోటగారూ.. ఇదేదో మామూలు సినిమా అని, మీది సాదాసీదా పాత్ర అని అనుకోకండి. మొత్తం సినిమా ఎస్సెన్స్‌ చెప్పేది క్లైమాక్స్‌. ఆ పతాక సన్నివేశాలకు మీ పాత్ర ప్రాణం పోస్తుంది. మదన్‌ కూడా చాలా మంచి డైలాగులు రాశాడు’ అన్నారు. ఆయన చెప్పినట్టే జరిగింది. రామానాయుడుగారి నానక్‌రామ్‌గూడ స్టూడియోలో క్లైమాక్స్‌ షూటింగ్‌ జరిగింది. నానక్‌రామ్‌గూడ స్టూడియోకి ఎదురుగా చెరువులా ఉంటుంది. ఆ చెరువుగట్టు మీద ఓ షాట్‌ పెట్టారు. దాదాపు 300-400 మంది జూనియర్‌ ఆర్టిస్టులు ఉన్నారు స్పాట్‌లో.


మెయిన్‌ ఆర్టిస్టులు రాజేంద్రప్రసాద్‌గారు, ఆమనిగారు.. ఇక ఒకరేంటి మొత్తం యూనిట్‌ అంతా ఉంది స్పాట్‌లో. డైరెక్టర్‌గారు నా దగ్గరకు వచ్చి ‘లైట్‌ తగ్గిపోతోందండీ... మరలా ఇంతమంది కాంబినేషన్ దొరకడం కష్టం. కాస్త ఇదిగా ఉండండీ’ అని చెప్పారు. ‘అలర్ట్‌గా చేయండీ’ అని చెప్పలేక, నా సీనియారిటీని కాస్త గౌరవించినట్టుగా ‘ఇదిగా ఉండండీ’ అని చెప్పారు. లైట్‌ ఫెయిల్‌ అవుతుందంటే ఎలాంటి ఆర్టిస్టు అయినా అర్థం చేసుకుంటాడు. నేనూ అదే చేశా. అప్పుడే కాదు ఎప్పుడైనా డైరెక్టర్‌ చెప్పింది వినడమే నా ప్రధాన బాధ్యత అందుకే జెన్యూన్‌గా విన్నా.


‘ఓకే అండీ. అలాగే చేద్దాం’ అన్నా. ‘ఇంత పెద్ద సీన్‌ పెట్టి ఇప్పుడు ‘ఇదిగా ఉండండీ’ అంటే ఎలా?’ అని చిరాకుపడలేదు. అలా ఒకవేళ ఎవరైనా ముఖం చిట్లించుకున్నా నాకు నచ్చదు. పైగా అలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన వారిని చూసి నేను చిరాకుపడతాను. నటరాజును గౌరవించాలన్నది నా పాలసీ. ఆ పాలసీని ఇంకోసారి గుర్తుచేసి సాయంత్రం అయ్యేలోపు ఎలాగో సీన్‌ పూర్తి చేశాం. డైరెక్టర్‌గారు షాట్‌ ఓకే అన్నారు. అప్పటిదాకా అవతల కుర్చీలో కూర్చుని మానిటర్‌ని చూస్తున్న రాజేంద్రప్రసాద్‌ ఒక్కసారి లేచి గట్టిగా ‘మావా ఈ సారి నంది కొట్టేశావ్‌’ అన్నారు. నిజంగా ఆయన నోటి వాక్కు, అదృష్టం ఆ సంవత్సరం నాకు నంది వచ్చింది. 


ఆ పాత్ర చేయించిన చంద్రసిద్దార్థగారితో పాటు రైటర్‌ మదన్‌గారిని కూడా గుర్తుంచుకోవాలి నేను. ఎంతో బాగా తీర్చిదిద్దారు కథను. ఆ తర్వాత మదన్‌ డైరెక్టర్‌ అయినప్పుడు ‘పెళ్ళైన కొత్తలో’ అనే సినిమా చేశారు. అందులో గీతాంజలిగారి పక్కన నటించా. నాకన్నా ఆవిడ సీనియర్‌ నటి. వయసులో నాకన్నా కాస్త చిన్నదే అయినా నటనలో సీనియర్‌ కదా. అందుకే ఆవిడ పక్కన నటించాను అంటున్నాను. ఆ చిత్రం క్లైమాక్స్‌లో నా మీద ఒక పాట కూడా ఉంటుంది. అదో గొప్ప అనుభూతి.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-10-21T03:33:40+05:30 IST