ఆయన రుణం ఎలా తీర్చుకుంటానో నాకు తెలియదు: కోట (పార్ట్ 26)

ABN , First Publish Date - 2021-09-18T01:49:10+05:30 IST

ఏమాత్రం నా ప్రమేయం లేకుండా అక్కినేనిగారి పాత్రకు నేను షిఫ్ట్‌ అయ్యా. అయితే ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మాత్రం నేను చేయాలనుకున్నపాత్ర చేయలేకపోయాను. ఆ వేషాన్ని ఎలాగైనా నాతోనే వేయించాలని ఈవీవీ కూడా చాలా ప్రయత్నించాడు. కానీ..

ఆయన రుణం ఎలా తీర్చుకుంటానో నాకు తెలియదు: కోట (పార్ట్ 26)

ఈవీవీతో గట్టి బంధం

ఇప్పటికీ నన్ను కోటయ్యా అని ఎవరైనా పిలిస్తే వెంటనే ఈవీవీ సత్యనారాయణ గుర్తుకొస్తాడు. నా తొలి సినిమాకు ఆయనే కో-డైరెక్టర్‌. అంతకుముందు నుంచే మాకు పరిచయం. ఆయనలో ఉన్న గొప్పగుణం ఏంటంటే, ఎవరిలోనైనా ఏమాత్రం టాలెంట్‌ ఉన్నా సరే ఏదో విధంగా దాన్ని బైటికి లాగేస్తాడు. వాళ్లకునప్పే పాత్ర సృష్టించి లైఫ్‌ ఇస్తాడు. మన ఎం.ఎస్.నారాయణ అలా వచ్చినోడే కదా. ‘మా నాన్నకు పెళ్ళి’లో ఎం.ఎస్. నారాయణ వేసిన తాగుబోతు వేషాన్ని ముందు నాతో వేయిద్దామనుకున్నాడు ఈవీవీ. ‘కోటయ్యకైతే ఈ పాత్ర కాస్త వెరైటీగా ఉంటుంది. తాగుబోతుగా అతన్ని అందరూ అంగీకరిస్తారు. మన సినిమాలో ఈ వేషానికి కోటయ్య ఫిక్స్‌’ అని అసిస్టెంట్లతో కూడా చెప్పేశాడట. కానీ రాత్రికి రాత్రే అందులో మార్పులు జరిగాయి. అందులో నేను వేసిన వేషాన్ని అక్కినేని నాగేశ్వరరావుగారితో వేయిద్దామని అనుకున్నారు. ఆ మేరకు నాగేశ్వరరావుగారితో మాట్లాడారు కూడా. కానీ ఎందుకో ఆ తర్వాత అది కార్యాచరణకు రాలేదు. కారణాలు నాకు తెలియవనుకోండి.


కృష్ణంరాజుకు తండ్రి వేషం

ఒకరోజు ఈవీవీ ఫోన్ చేసి ‘కోటయ్యా ఇప్పుడు డేట్లు ఎవరు చూస్తున్నారయ్యా’ అని అడిగాడు. ‘నేనే చూసుకుంటున్నా’ అన్నా. ‘నీ మొహం నువ్వేం చూసుకుంటావయ్యా ఇంత బిజీగా ఉండి. అయితే అయింది ఒకసారి నువ్వు నోట్‌ చేసుకున్న డైరీ పట్రా’ అని పిలిచాడు. అప్పుడు నా దగ్గరే ఉండేది డైరీ. ఫిల్మ్‌నగర్‌లో మా పక్కింట్లోనే ఉండేవాడు ఈవీవీ. షూటింగ్‌ నుంచి వస్తూ వస్తూ ఇంటికి కూడా రాకుండా, నేరుగా వాళ్లింటికి వెళ్లా. ‘ఏంటి డేట్లిచ్చాను కదా? ఇంకేంటి?’ అన్నా. ‘అదిగాదయ్యా చిన్న చేంజ్‌. కృష్ణంరాజుగారికి ఫాదర్‌గా నీతో వేషం వేయిస్తున్నాను’ అన్నాడు. కృష్ణంరాజుగారి ఫాదర్‌ వేషం అనగానే నాకు అనుమానం వచ్చింది. ‘ఊరికే జోక్‌ చేయమాకయ్యా’ అన్నా. ‘కాదయ్యా. నిజమే. మేం పెద్దాయన నాగేశ్వరరావుగారిని అనుకున్నాం. ఏవో కొన్ని కారణాలవల్ల అక్కినేనిగారు చేయడం కష్టమవుతోంది. అందువల్ల నీతో చేయించుకుంటానని నేను అందరికీ చెప్పేశాను. నీకెందుకు? నేను చేయించుకుంటాను నీతో’ అన్నాడు. అంతటితో ఆగకుండా నా చేతిలో డైరీ లాక్కుని రెండు పేజీలుచించి వాటిలో అప్పుడో రెండు రోజులు, అప్పుడో రెండు రోజులు అంటూ 15-20 రోజుల దాకా డేట్లు రాశాడు. ‘ఇదిగో ఈ డేట్లు చూసుకో. ఈ డేట్లు ఎవరెవరికి ఇచ్చావో నాకు రాసివ్వు. వాళ్లతో మాట్లాడి నేను తీసుకుంటా. అడ్జస్ట్‌మెంట్‌ చేసుకుందాం’ అన్నాడు. ఇంక చేసేదేముంది, సరేనన్నా. ఫాదర్‌గా నేను ఫిక్స్‌.. మరి నేను చేయాల్సిన తాగుబోతు పాత్రకు ఎవర్ని తీసుకుంటారు? అనే ఆసక్తి నాక్కూడా మొదలైంది. రెండు రోజులకు ఆ విషయం కూడా క్లియర్‌ అయింది. అప్పటికి ఎం.ఎస్.నారాయణ రవిరాజా పినిశెట్టి తీసిన ‘యమ్‌ధర్మరాజు ఎం.ఎ’లో ఓ పాత్ర చేశాడు. ఆ సినిమా చూసిన వాళ్లెవరో ఈవీవీకి ఆ విషయం చేరవేశారు. వెంటనే అతన్ని పిలిపించి ఫైనలైజ్‌ చేసేశారు. ఆ సినిమాతో ఎం.ఎస్. నారాయణగారు ఓవర్‌నైట్‌ స్టార్‌ అయ్యారు.


సీన్ రివర్స్‌

ఏమాత్రం నా ప్రమేయం లేకుండా అక్కినేనిగారి పాత్రకు నేను షిఫ్ట్‌ అయ్యా. అయితే ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మాత్రం నేను చేయాలనుకున్నపాత్ర చేయలేకపోయాను. ఆ వేషాన్ని ఎలాగైనా నాతోనే వేయించాలని ఈవీవీ కూడా చాలా ప్రయత్నించాడు. కానీ కాల్షీట్‌ కుదరలేదు. అప్పుడైతే ఒక వారం రోజులు హెక్టిక్‌ వర్క్‌తో మామూలుగా ఇబ్బందిపడలేదు. ఆ విషయాన్ని ఆయన కూడా దగ్గరుండి చూశాడు. ఆ ఒక్కటీ అడక్కు షూటింగ్‌ వైజాగ్‌లో చేయడంతో అసలు రాలేనని వాళ్లకు అర్థమైపోయింది. అదే హైదరాబాద్‌ లోకల్లో అయితే కనీసం హాఫ్‌డేలు హాఫ్‌డేలు అయినా అడ్జస్ట్‌ చేసేవాళ్లం. ఔట్‌డోర్‌ కాబట్టి ఛాన్సే లేకుండా పోయింది. అప్పుడు నాతో అనుకున్న వేషాన్ని మహానుభావుడు రావుగోపాలరావుగారితో వేయించారు. ఆయనకి అలాంటి వేషాలు వెన్నతోపెట్టిన విద్య కదా. సజావుగా చేసేశారంతే.


శ్రమజీవి ఈవీవీ

ఈవీవీ దగ్గర నాకు చాలా ఇష్టమైన మరో విషయం ఏంటంటే ఆయన చాలా శ్రమజీవి. రోజూ రాత్రి రెండు, రెండున్నర వరకు రాసేవాడు. రాయడమే కాదు ప్రతి సినిమాకీ ఇద్దరు, నలుగురు రైటర్లని పెట్టేవాడు. ఆయనా ఓ వైపు రాస్తూనే ఉండేవాడు. హెవీ డిస్కషన్స్ జరిగేవి. నలుగురు రాసిన వాటినీ చూడటం, వాటిలో ఏది బావుంటే అది తీసుకోవడం.. ఇలా ఫైనల్‌ చేసిన పేపర్‌ని ఉదయాన్నే స్పాట్‌లో తెచ్చిచ్చేయడం... ఇదీ వరస. ఆయన గురించి మోటుగా ఒక్క మాటలో చెప్పాలంటే గొడ్డులాగా కష్టపడతాడు. పనిరాక్షసుడు. పొద్దున్నే ఏడింటికి ఫైల్‌ చేతిలో పట్టుకుని యాక్షన్ అన్నాడంటే రాత్రి రెండింటికి షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పిన సందర్భాలు కూడా కోకొల్లలు. అయినా ఆ ఎనర్జీలో ఏమాత్రం తేడా ఉండేది కాదు. మరలా ఉదయం ఏడింటికి మా అందరికన్నా ముందే స్పాట్‌లో ఉండేవాడు. ‘420’ సినిమా చేస్తున్నప్పుడైతే ఉదయం ఏడుకి మొదలుపెడితే మర్నాడు పొద్దున తొమ్మిదిదాకా షూటింగ్‌ చేస్తూనే ఉన్నాం. ఆ సినిమాలో తెల్లవార్లూ డ్యాన్సులు చేయిస్తారు నాతో. ఎదురుగా జనాలు కూడా ఉండరు. ఒకే ఒక్క ప్రేక్షకుడు మాత్రమే ఉంటాడు. నేను డ్యాన్సు చేయడం పూర్తయ్యాక అతన్ని చూసి ‘నువ్వు మాత్రం ఎందుకున్నావయ్యా’ అని అడుగుతాను. ‘నేను ప్రేక్షకుడిని కాదండీ బాబూ. మైక్‌సెట్‌, షామియానా తీసుకెళ్లేవాణ్ణి’ అంటాడు. అలాంటి గొప్ప గొప్ప జోకులు రాసేవాడు ఈవీవీ. నాతో ఆయన చేయించిన వేషాలు తెలుగు సినిమా హాస్యం ఉన్నంతవరకూ అలా నిలిచిపోతాయి.


నాకు పేరు తెచ్చిన దర్శకుడు

‘హలో బ్రదర్‌’, ‘చెవిలో పువ్వు’. ‘ఆమె’, ‘మా నాన్నకు పెళ్ళి’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ఇలా పదీ, పదకొండు సినిమాలున్నాయి. నాలో ఉన్న జీల్‌ని బైటకుతెచ్చిన వ్యక్తి ఈవీవీ. కోట శ్రీనివాసరావు అనే యాక్టర్‌ ఈ తరంలో వచ్చాడ్రా అనే పేరు నాకు తెచ్చాడు. ఆయన రుణం ఎలా తీర్చుకుంటానో నాకు తెలియదు. ఆయన కాలం చేయడంవల్ల నిజంగా తెలుగు పరిశ్రమ గ్రేట్‌ డైరెక్టర్‌ని మిస్‌ అయింది. ఈవీవీ ఆఖరి సినిమా ‘కత్తికాంతారావు’ లోనూ నేను చేశాను. అప్పుడు నిజంగా చాలా ఇబ్బందిలో ఉన్నా. అబ్బాయి పోవడం... అప్పటికి మా అబ్బాయి పోయి 20-25 రోజులు అయింది. ‘కోటయ్యా, ఏమీ అనుకోకు. ఇలా నేను నీ కోసమే ఓ పాత్ర రాసుకున్నానయ్యా. ఆ వేషంలో నిన్ను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేకపోతున్నాను. అబ్బాయి పోయాడు. నాకు తెలుసు. ఇలా ఉంటే నువ్వు కోలుకోలేవు. కాస్త బైటకి రా. నీకూ కాస్త చేంజ్‌ ఉంటుంది. నేన్నిన్ను చాలా బాగా చూసుకుంటానయ్యా’ అని నచ్చజెప్పి తీసుకెళ్లాడు. ఆయన సినిమా అంటే చుట్టూ అంతా తెలిసినవాళ్లేగా.. నిజంగానే అప్పుడు వాళ్లందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు.


ఈవీవీది ఒక ఎరా

జంధ్యాలగారి రచన ఎంతగొప్పగా ఉంటుందో అంతగొప్పగా ఉంటుంది ఈవీవీ థాట్‌ ప్రాసెస్‌. జంధ్యాల బాణీని ఈవీవీ చాలా బాగా పట్టుకున్నారు. దాన్ని ఆయన తనకు తగ్గట్టుగా మలుచుకుని, మరికాస్త జనరంజకం చేసుకోగలిగారు. ఈవీవీది ఒక ఎరా. అలాంటివారి దగ్గర నటించడం నా అదృష్టం. ఆయనకు ఎవరిమీదైనా కోపం వచ్చినప్పుడు ‘కోటయ్యను చూడండ్రా గొడ్డులా పనిచేస్తాడు. పొద్దున్నే ఏడింటికి వచ్చినా, రాత్రి రెండింటిదాకైనా అలాగే ఉంటాడు. అలుపూ సొలుపూ అనడు. నేర్చుకోండి. పనిచేయండి’ అని కేకలేసేవాడు. ‘ఆరు తర్వాత కూడా షూటింగ్‌ ఏంటయ్యా’ అని అనేవారుంటారుగా... వాళ్లను చూసి! ‘ఆర్టిస్టుకి టైమ్‌ వస్తే టైమ్‌ ఉండదు. కానీ ఆ టైమ్‌ అందరికీ రాదు. రెండు షిఫ్ట్‌లు, మూడు షిఫ్ట్‌లు ఎవరు చేస్తారు? అని విసుగు చెందకండి’ అని నేను కూడా తోటివారితో చెప్పేవాణ్ణి. నేను అనుభవంతో అన్న మాటలవి.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-09-18T01:49:10+05:30 IST