అమితాబ్‌ సంస్కారం ప్రత్యక్షంగా చూశా: కోట (పార్ట్ 24)

ABN , First Publish Date - 2021-09-16T03:04:07+05:30 IST

అమితాబ్‌ నన్ను చూడగానే, ‘హా.. కోటాజీ. నమస్తే. ఆప్‌ కైసాయేజీ’ అని ఆప్యాయంగా భుజం మీద చెయ్యేశారు. అంతకు ముందెప్పుడూ నేను ఆయన్ను చూడలేదు. కానీ తొలి పరిచయంలోనే అమితాబ్‌ పట్ల పాజిటివ్‌ స్పందన కలిగింది. ఆ సినిమా చేసినన్నాళ్లూ అంతే సౌకర్యవంతంగా ఫీలయ్యా. ఇండియన్ సినిమా..

అమితాబ్‌ సంస్కారం ప్రత్యక్షంగా చూశా: కోట (పార్ట్ 24)

గుర్తుండిపోయే సన్నివేశాలు

‘గాయం’లో రేవతితో ఒక ఇంటర్వ్యూ సీన్‌ ఉంది. ‘చెప్తున్నాను కదా ఖండిస్తున్నా’ అంటాను. ‘ప్రతిదానికీ కారణం మీరే అంటున్నారు’ అంటుంది రేవతి. ‘అందుకే ఖండిస్తున్నా’ అంటాను నేను. ‘ప్రతిదానికీ అలా ఖండిస్తే ఎలాగండీ’ అంటుంది రేవతి. ‘చెప్తున్నాను కదా ఖండిస్తున్నా’ అంటాను నేను. అందరూ నవ్వుతారు ఆ సీన్‌ చూసి. ఎన్నిసార్లు చూసినా ఇప్పటికీ నాకు నవ్వు వస్తూనే ఉంటుంది. మరో సందర్భంలో... టీవీలో మైకెల్‌ జాక్సన్‌ డ్యాన్సులు చేస్తుంటే ‘ఎయ్‌ నీ తల్లి ఎయ్‌’ అని ముచ్చటపడి పోతుంటా. ‘కోటి రూపాయలు ఇస్తారయ్యా ఆ డ్యాన్సులకు’ అంటారు భరణిగారు. ‘అంత అయితే నా కొడుకు పాలిటిక్స్‌కి ఎందుకు? సుబ్బరంగా డ్యాన్సులు నేర్పించేవాణ్ణి’ అంటా. ఇవన్నీ ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోయే సన్నివేశాలు. హైదరాబాద్‌ కోఠి పోలీస్ స్టేషన్‌‌ దగ్గర్లో మార్కెట్‌ పక్కన మూతపడిన ఒక థియేటర్‌లోనే ఈ చిత్రంలోని ఎక్కువ భాగం తీశారు. ఆ హౌస్‌ ఆ తర్వాత ‘గాయం’ హౌస్‌ పేరుతోనే చలామణి అవుతోంది. కెమెరామేన్ రసూల్‌గారు చాలా బాగా చేశారు. ఆ సినిమా ఒక వింత. వర్మగారికి నేను నటించిన వేషాల్లోకెల్లా ‘మనీమనీ’ లో నా వేషం చాలా ఇష్టం. ఎప్పుడు ఎక్కడ కనిపించినా ‘అదేంటండీ కోటగారూ.. మనీమనీలో అట్టా చేసేశారు’ అంటుంటారు. ఈ మధ్య వచ్చిన ‘రక్తచరిత్ర’లోనూ సూపర్‌ వేషం ఇచ్చారు. ఆశిష్‌ విద్యార్థిని మానసికంగా ప్రిపేర్‌ చేసే సీన్‌ ఉంది. ఆ సన్నివేశాన్ని మెచ్చుకుంటూ నాకు ఎంతో మంది ఫోన్లుచేసి అభినందించారు.


మా అబ్బాయి ఎంతో ఆనందించాడు

వర్మగారు నాకు ఇచ్చిన పాత్రలన్నీ ఒక ఎత్తు. ‘సర్కార్‌’ చిత్రంలో పాత్ర ఒక్కటీ ఒక ఎత్తు. మా అబ్బాయి ఉన్నాడండీ అప్పుడు. ఒకరోజు నేను షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి రాగానే ‘నాన్నగారూ, రామ్‌గోపాల్‌వర్మగారు ఒకసారి రమ్మని ఫోన్ చేశారు’ అని చెప్పాడు. మర్నాడు నేనూ, మా అబ్బాయి వెళ్లాం. ‘రండి కోటగారూ. కూర్చోండి. ఒక గుడ్‌ న్యూస్‌ చెబుదామని పిలిపించాను’ అన్నారు. ‘ఏంటండీ’ అన్నా. ‘మీరు అమితాబ్‌ బచ్చన్‌తో యాక్ట్‌ చేయబోతున్నారండీ’ అన్నారు. ఇంత పాపులారిటీ వచ్చేసింది. ఆర్టిస్ట్‌గా పేరు వచ్చింది. అప్పటికే నందులు వచ్చాయి. అయినా అమితాబ్‌ బచ్చన్‌తో సినిమా అనేది నేనెప్పుడూ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. ‘ఐ నెవర్‌ డ్రెమ్ట్‌ ఇట్‌’. ‘ఏంటీ.. ఆశ్చర్యంగా ఉందా? నిజమండీ. సర్కార్‌ అని ఒక పిక్చర్‌ చేస్తున్నాను. అందులో ఆయనతో పాటు వాళ్లబ్బాయి కూడా యాక్ట్‌ చేస్తున్నారు’ అన్నారు వర్మగారు. ఆ సమయంలో నాకన్నా మా అబ్బాయి ఎక్కువ ఆనందపడ్డాడు. ఎంతో ఆశ్చర్యపోయాడు. బాంబేలో షూటింగ్‌. అప్పుడు మేకప్‌మాన్ మోహన్ అని ఉండేవాడు. అతను ఈ మధ్యే చనిపోయాడు. అప్పుడు నాతో బాంబేకి వచ్చాడు.


‘సర్కార్‌’లో నా డైలాగ్‌కి వర్మ థ్రిల్లైపోయారు!

బాంబేలో ‘సర్కార్‌’ సెట్‌లోకి వెళ్లాం. తొలి రోజు సందడి ఎక్కువగా అనిపించింది. అది కాస్త సద్దుమణిగాక వర్మగారు నా దగ్గరకు వచ్చి ‘సౌత్‌ఇండియన్ పొలిటీషియన్ బాంబేలో సెటిలవుతాడు. మీ పాత్ర అదే’ అన్నారు. ఏదో ఆలోచిస్తూ మధ్యలో నన్ను చూసి ‘ఏం లేదండీ.. నేను సౌత్ వాడిలాగా కనిపిస్తాను, కానీ నా పనంతా నార్త్‌ వాడిలానే ఉంటుంది. అనేది అతని మేనరిజం. దానికి ఏదైనా ఒక వాక్యం కుదిరితే బాగుంటుందండీ’ అన్నారు. చెట్టు కింద ఇద్దరం ఎదురెదురుగా కూర్చుని ఉన్నాం. అప్పుడు గభాల్న నాకు ఓ వాక్యం తట్టింది. ‘మేరా స్టైల్‌ సౌత్.. ఆపరేషన్ కంప్లీట్‌ నార్తే బై’ అన్నా. వర్మగారు థ్రిల్‌ అయిపోయారు. వెంటనే అసిస్టెంట్లను పిలిచి, ‘ఆయన చెప్పేది కరెక్ట్‌గా రాయండి. ఆయనకు మళ్లీ ఓసారి చూపించండి. భలే ఉంది. భలే అన్నారు సార్‌’ అని హ్యాపీగా చెప్పారు. పాత్రకు తగ్గట్టు నేను చెప్పిన మేనరిజం డైలాగ్‌ విని వర్మగారు థ్రిల్లైపోయారు. వెంటనే అసిస్టెంట్లను పిలిచి ఆ డైలాగ్‌ రికార్డ్‌ చేసుకోమన్నారు. వాళ్ళు వచ్చి నన్ను ఇంకోసారి చెప్పమన్నారు. చెప్పా. వినయంగా రాసి చూపించా. ‘ఇంతేనా సార్‌’ అన్నారు. ‘అంతేనయ్యా’ అన్నా. అప్పటికే సెట్లోకి అమితాబ్‌ బచ్చన్ వచ్చారు. పెద్దవారుకదా, నేనే వెళ్లి పలకరించా. ‘నమస్కారమండీ’ అన్నా.


అమితాబ్‌ సంస్కారం ప్రత్యక్షంగా చూశా

అమితాబ్‌ నన్ను చూడగానే, ‘హా.. కోటాజీ. నమస్తే. ఆప్‌ కైసాయేజీ’ అని ఆప్యాయంగా భుజం మీద చెయ్యేశారు. అంతకు ముందెప్పుడూ నేను ఆయన్ను చూడలేదు. కానీ తొలి పరిచయంలోనే అమితాబ్‌ పట్ల పాజిటివ్‌ స్పందన కలిగింది. ఆ సినిమా చేసినన్నాళ్లూ అంతే సౌకర్యవంతంగా ఫీలయ్యా. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం బిగ్‌బీని గౌరవిస్తుంది. అంతటి గౌరవానికి కారణం నాకు అప్పుడే అర్థమైంది. డిసిప్లిన్, సిన్సియారిటీకి ప్రాణమిస్తారాయన. సెట్లో ఉన్నప్పుడు కూడా ఆయన పద్ధతులు, వ్యవహారం గొప్పగా ఉంటుంది. ‘సర్కార్‌’ షూటింగ్‌ జరుగుతుండగా ఆయన కుమారుడు అభిషేక్‌ మధ్యలో జాయిన్ అయ్యాడు. అతను సెట్లోకి రాగానే, వాళ్లబ్బాయిని పిలిచి ‘హి ఈజ్‌ మిస్టర్‌ కోటా శ్రీనివాసరావు. వెరీ గుడ్‌ ఆర్టిస్ట్‌. నువ్వు ఇలాంటి వారితో యాక్ట్‌ చేయడం నీ అదృష్టం’ అని పరిచయం చేశారు. ఆ మాట విన్న వాళ్లందరూ ఆశ్చర్యపోయారు. సహ నటుణ్ణి గౌరవించడం ఆయన సంస్కారం. అమితాబ్‌ సంస్కారవంతుడు. ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో కూడా ‘‘వర్మగారి దర్శకత్వంలో నటించడమే థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అందులోనూ కోట శ్రీనివాసరావుగారితో నటించడం మరింత థ్రిల్‌గా అనిపించింది’’ అన్నారట. వర్మగారు ఫోన్ చేసి మా అబ్బాయికి చెప్పారు. ‘అమితాబ్‌ మాటలు విన్నాక మీకేమనిపించిందండీ’ అని అడిగారు ఇక్కడ మన విలేకరులు. అందుకు సమాధానంగా ‘‘అమితాబ్‌గారు నేషనల్‌ స్టేచర్‌ దాటిన ఇంటర్నేషనల్‌ ఫిగర్‌. అంత పేరున్న నటుడితో నటించాలంటే జనరల్‌గా భయం ఉంటుంది. కానీ మా మీద కంపోజ్‌ చేసిన తొలి షాట్‌లోనే ఆ భయం లేకుండా నటించాను. ఆయన ఆశ్చర్యపోవడానికి కారణం అదేనేమో’’ అని చెప్పాను. అప్పట్లో చాలా పత్రికలు ఈ విషయం ప్రచురించాయి.


రాష్ట్రపతి భవన్‌లో అమితాబ్‌, అభిషేక్‌ ప్రశంస

నాకు పద్మశ్రీ పురస్కారం వచ్చినప్పుడు రాష్ట్రపతి భవన్‌కి వెళ్లాం. ముందుగానే అక్కడికెళ్లి కూర్చున్నాం. నాతో పాటు మా పెద్ద మనవడు, పెద్ద అల్లుడు వచ్చారు. పక్కనే నా అసిస్టెంట్‌ కూడా ఉన్నాడు. పద్మశ్రీ వచ్చిన వారిని ఒక పక్కన, ప్రధానమంత్రిగారి పక్కనేమో పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ వచ్చినవారినీ కూర్చోబెట్టారు. కాసేపటికి ‘అమితాబ్‌ బచ్చన్‌గారు వచ్చారు’ అని అక్కడ అందరూ చెప్పుకుంటున్నారు. అటు చూశా. అందరూ ఆయన్ని చుట్టుముట్టేశారు. సరేనని కాసేపు ఆగి ఆయనచుట్టూ జనం తగ్గిన తర్వాత వెళ్లి పలకరించా. పక్కన ఉన్న ప్రధానమంత్రి చూస్తూనే ఉన్నారు. అమితాబ్‌ నన్ను చూసి టక్కున కుర్చీలోనుంచి లేచి ఎదురొచ్చి కౌగలించుకుని ‘హలో కోటాజీ.. హౌ ఆర్‌ యూ’ అన్నారు. ఆయనే మరలా. ‘కంగ్రాచ్యులేషన్స్. ఇప్పటికే లేటయింది. ఎప్పుడో రావాల్సింది. ఎనీవే కంగ్రాట్స్‌’ అన్నారు. మా మనవణ్ణి చూపించి ‘మా గ్రాండ్‌సన్ సర్‌’ అన్నా. ఆయన షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు.


అమితాబ్‌గారి మైండ్‌లో నేను ఎంతగా గుర్తులేకపోతే నన్ను అందరిలో అంత గౌరవంగా పలకరిస్తారూ. ఆ రోజు నామీద ఆయనకున్న అభిమానాన్ని మరోసారి ప్రత్యక్షంగా చూశా. అవార్డుల ప్రదానోత్సవం తర్వాత అక్కడే టీ అరేంజ్‌ చేశారు. నేనక్కడ సమోసా తినబోతుంటే అభిషేక్‌ బచ్చన్ ఎదురుగా నిలబడి ఉన్నాడు. పలకరిద్దామనుకున్నా. తను అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. చూసి సరేలే తర్వాత మాట్లాడదామని అటుగా వెళ్లబోయా. అంతలో అతను నన్ను చూశాడు. అమాంతం దగ్గరకువచ్చి, ‘హలో సార్‌’ అంటూ కౌగలించుకున్నాడు. ‘టూ లేట్‌ సార్‌. ఇప్పటికైనా వచ్చింది. కంగ్రాచ్యులేషన్స్ సార్‌’ అని తండ్రి చెప్పినట్టే చెప్పాడు. పక్కనే వాళ్లమ్మగారు ఉంటే పిలిచి ‘హి ఈజ్‌ మిస్టర్‌ కోటాజీ’ అని పరిచయం చేశాడు. మా మనవడు ఆ సంఘటనని ఎన్నిసార్లు తలుచుకున్నాడో. 

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-09-16T03:04:07+05:30 IST