వాదనకు దిగుతారనుకున్నా..కానీ, కొడతారని ఊహించలేదు: కోట (పార్ట్ 17)

ABN , First Publish Date - 2021-09-07T02:28:15+05:30 IST

ఒరేయ్‌.. కోటగాడు ఈ ఫ్లాట్‌ఫారం మీదే ఉన్నాడట. పట్టుకోండిరా... అని అరిచాడు ఇంకొకడు. ఆ రోజుతో ఇక నా పని అయిపోయిందనుకున్నాను. జనం అంతా నన్ను చుట్టుముట్టేశారు. కదలకుండా దిగ్బంధనం చేసి, స్టేషన్ వెనక్కి నన్ను లాక్కెళ్లారు. నేనేం చెప్పినా..

వాదనకు దిగుతారనుకున్నా..కానీ, కొడతారని ఊహించలేదు: కోట (పార్ట్ 17)

ఒరేయ్‌.. కోటగాడు ఈ ఫ్లాట్‌ఫారం మీదే ఉన్నాడట. పట్టుకోండిరా... అని అరిచాడు ఇంకొకడు. ఆ రోజుతో ఇక నా పని అయిపోయిందనుకున్నాను. జనం అంతా నన్ను చుట్టుముట్టేశారు. కదలకుండా దిగ్బంధనం చేసి, స్టేషన్ వెనక్కి నన్ను లాక్కెళ్లారు. నేనేం చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు. అంతా ఆవేశంతో ఉన్నారు. ‘కళాకారుడి మీద చెయ్యి చేసుకోకూడదు. ఇందులో అతని తప్పేమీ లేదు’ అని ఒక్కరైనా ఆలోచించి ఉంటారని నేననుకోను. ‘మన అన్నగారిని అనుకరించి, అవమానపరిచాడు. ఇతని అంతు చూడాల్సిందే’ అనుకొని అందరూ కలబడి నా మీద తలో చెయ్యీ వేశారు. ఇది నేను ఊహించని ఘటన. నాతో వాదనకు దిగుతారని అనుకున్నాను కానీ, ఇలా కొడతారని ఊహించలేదు. ఇంతలో ఎవరో వచ్చి జోక్యం చేసుకోవడంతో జనం నన్ను వదిలిపెట్టారు. అవమానభారంతో రూమ్‌కి చేరుకున్నా. దారి వెంబడి ఒకటే ఆలోచన. ఇందులో నేను చేసిన తప్పేమిటి? రామారావుగారంటే నాకు అమితమైన గౌరవం ఉంది. నాకు ఇచ్చిన పాత్ర చేశాను తప్ప ఆయన్ని కించపరచాలని అనుకోలేదు. అయినా ఇలాంటి పర్యవసానాల్ని ఆలోచించకుండా చేసేశాను. దానికి తగ్గ ఫలితాన్ని అనుభవించాను. ‘కొన్ని గాయాలను కాలమే మాన్పుతుంది’ అని సర్ది చెప్పుకున్నా. అదే జరిగింది. ఇది జరిగిన కొంతకాలానికి నిర్మాత త్రివిక్రమరావుగారిని వారి ఆఫీసులో కలిశాను. మాటల మధ్యలో ‘ఆకుకూరల ఆనందరావు అనే ఓ పాత్ర గురించి చెప్పాను. అది ఆయనకు బాగా నచ్చింది. ఆ క్యారెక్టర్‌ గురించి ఆయన పరుచూరి బ్రదర్స్‌తో చెప్పి చక్కగా డిజైన్ చేయమన్నారు. అలా పుట్టిన పాత్ర కరణం కాసయ్య అనే హోం మినిస్టర్‌ పాత్ర. నందమూరి బాలకృష్ణగారు హీరోగా నటించిన రౌడీ ఇన్‌స్పెక్టర్‌ చిత్రమది. త్రివిక్రమరావుగారు నిర్మించారు. ఆ చిత్రంలోనే కరణం కాసయ్య అనే పాత్ర నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది. మరో విషయమేమిటంటే ‘మండలాధీశుడు’ తర్వాత నేను మరలా నందమూరి కాంపౌండ్‌లో చేసిన సినిమా ఇదే! ఆ విషయంలో త్రివిక్రమరావుగారిని సదా గుర్తుంచుకుంటాను.


జాగ్రత్తగా చేసుకోమన్నారు

మండలాధీశుడు సినిమా చూసి కార్యకర్తలకే కాదు మా బెజవాడ ఎమ్మెల్యే నెహ్రూగారికి కూడా కోపం వచ్చింది. ఒకసారి ఎక్కడో, ప్రాంతం గుర్తులేదు కానీ ఇద్దరం కలిశాం. ‘ఏమయ్యా... నీకేం ఒళ్లు బలిసిందా? రామారావుగారి సినిమా చేశావట? విషయం తెలిసి నీ మీద పీకలదాకా కోపం వచ్చింది.. చంపేద్దామనుకున్నాం’ అని కోపంగా కేకలేశారు. అంతలోనే తేరుకుని ‘అసలు ఏం చేశావో.. ఎలా చేశావోనని, రాత్రి సినిమా చూశా. చూసిన తర్వాత తెలిసింది. నీ దుంపతెగ... ఎంత బాగా చేశావయ్యా.. అచ్చం పెద్దాయన్ని చూసినట్టు అనిపించింది. అందుకే నిన్ను ఇంకేం అనలేకపోతున్నా. ఇప్పటికైతే చేస్తే చేశావు? సరే... ఇంకెప్పుడూ అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయబాక. నీ వేషాలు నువ్వు జాగ్రత్తగా వేసుకో’ అని అన్నారు. ఆయన మాటల్ని కూడా అంత తేలిగ్గా మర్చిపోలేనండీ.


అలా టైమ్‌పాస్ చేశా

నేను మిమిక్రీ బాగా చేస్తానని చాలామందికి తెలుసు. కానీ ‘టైమ్‌పాస్‌’ అనే పేరుతో ఓ క్యాసెట్‌ రిలీజ్‌ చేశాననే విషయం ఈ జనరేషనకి అంతగా తెలియదనుకుంటా! తెలంగాణ యాస మాట్లాడితే నన్నందరూ తెలంగాణ నేటివ్‌ అనుకునేవారు. ‘మాది కృష్ణాజిల్లా బాబూ’ అన్నా కొంతమంది నమ్మేవారు కాదు. అలాంటి వ్యక్తి ఒకాయన నాకు మద్రాసులో తారసపడ్డాడు. కనిపించిన ప్రతిసారీ ‘తెలంగాణాలో రామాయణం’ చెప్పండీ అనేవాడు. ‘అస్తమానం ఏం చెప్తామయ్యా’ అని ఒకసారి విసుక్కున్నట్టే అన్నా. ‘అయితే క్యాసెట్‌ చేసిచ్చేయండి. నేను వింటుంటా’ అన్నాడు. ఐడియా బాగానే అనిపించింది. వెంటనే ‘టైమ్‌పాస్‌’ అని పేరుపెట్టి ఒక క్యాసెట్‌ చేశా. 45 నిమిషాల పాటు సాగే క్యాసెట్‌ అది. అందులో తెలంగాణ యాసలో రామాయణంతో పాటు పాండవ వనవాసం, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలను కూడా చెప్పా. రాత్రి సినిమా చూసొచ్చిన వ్యక్తి, దాని గురించి తన యాసలో ఎలా చెప్పాడనేది విషయం. అప్పట్లో ప్రతి కారులోనూ ఈ క్యాసెట్‌ ఉండేది. రిపీటెడ్‌గా పెట్టుకుని వినేవారు. సూపర్‌హిట్‌ అయింది. కానీ నా దగ్గర మాత్రం చివరికి ఒక్క క్యాసెట్‌ కూడా మిగల్లేదు. అప్పట్లో నేను చేసిన సినిమాల గురించి ఎంత గొప్పగా ప్రశంసించేవారో, ఈ టైమ్‌పాస్‌ గురించి కూడా అంతే ఆత్మీయంగా నవ్వుతూ చెప్పేవారు. టైమ్‌పాస్‌ అనే పేరు వినగానే ఎదుటివ్యక్తి ముఖంలో నవ్వులు విరబూసేవంటే అది ఎంత ఫేమస్‌ అయి ఉంటుందో ఊహించుకోండి. ఆ తర్వాత కూడా అలాంటివి కొన్ని చేద్దామనుకున్నా కానీ, టైమ్‌ పర్మిట్‌ చేయలేదు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-09-07T02:28:15+05:30 IST