కోపంతో కొడితే భరిస్తా.. తిడతారా తిట్టనీ! అని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లా: కోట (పార్ట్ 16)
ABN , First Publish Date - 2021-09-05T02:24:47+05:30 IST
‘మతిపోయిందా? నువ్వు చేసిన పనికి ఆయన కోపంతో మండిపడుతుంటారు. ఇప్పుడు వెళ్లి పలకరిస్తావా?’ అంటూ నన్ను వారించాలని చూశారు. ‘దగ్గరికి వెళితే ఆయన కాదు.. పక్కనున్నవాళ్లే నిన్ను చంపేస్తారయ్యా’ అని కూడా అన్నారు. కానీ నేను వినిపించుకోలేదు. ఏదో మొండిధైర్యం నన్ను ఆవరించింది. ‘ఇలా భయపడుతూ ఎంతకాలం ఉంటామండీ..

అదెలాగంటే...
రామారావుగారు ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’కు డబ్బింగ్ చెప్పడానికి అనుకుంటా, ఓ సారి చెన్నై వచ్చారు. అప్పటికి సీఎం హోదాలో ఉన్నారు. రామారావుగారు ఆజానుబాహుడు. పంచె కట్టుకుని, కిర్రు చెప్పులు వేసుకుని ఎయిర్‌పోర్టులో రాజసంతో నడిచి వస్తుంటే పక్కన ఓ యాభై, అరవైమంది జనం, టైట్ సెక్యూరిటీ... పెద్ద హడావిడిగా ఉండేది. రామారావుగారిలో గొప్పతనం ఏమిటంటే గంభీరమైన ఆయన విగ్రహం చూడగానే ఎటువంటి వాడికైనా వణుకు మొదలవుతుంది. ఇక ఆయనతో మాట్లాడాలంటే చెప్పేదేముంది. ఆ వేళ హైదరాబాద్‌లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్ ఏదో జరిగింది. ఆ మీటింగ్ కోసమని దాసరి నారాయణరావుగారు, రామానాయుడుగారు ఇలా పెద్ద పెద్ద వాళ్లందరూ ఫ్లయిట్ కోసం ఎదురుచూస్తూ చెన్నై ఎయిర్‌పోర్టులోనే ఉన్నారు. నేను కూడా ఔట్‌డోర్ వెళ్లడం కోసం ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాను. నా పక్కనే విజయచందర్ కూడా ఉన్నారు. రామారావుగారిని చూడగానే మెరుపులా నాకు ఓ ఆలోచన వచ్చింది.
నా సూట్‌కేస్ విజయచందర్‌కి అప్పగించి, ‘కాస్త చూస్తుండండి... ఇప్పుడే వస్తాను’ అని అన్నా. ‘ఎక్కడికెళ్తున్నావ్’ అని అడిగారు విజయచందర్. ‘పెద్దాయన రామారావుగారి దగ్గరికి’ అన్నా. ఈ సమాధానం వినగానే నా పక్కనున్న వాళ్లు తెల్లబోయారు. ‘మతిపోయిందా? నువ్వు చేసిన పనికి ఆయన కోపంతో మండిపడుతుంటారు. ఇప్పుడు వెళ్లి పలకరిస్తావా?’ అంటూ నన్ను వారించాలని చూశారు. ‘దగ్గరికి వెళితే ఆయన కాదు.. పక్కనున్నవాళ్లే నిన్ను చంపేస్తారయ్యా’ అని కూడా అన్నారు. కానీ నేను వినిపించుకోలేదు. ఏదో మొండిధైర్యం నన్ను ఆవరించింది. ‘ఇలా భయపడుతూ ఎంతకాలం ఉంటామండీ.. ఆయన్ని వెళ్లి కలుస్తాను. కోపంతో ఒకటి కొడితే, భరిస్తాను. తిడతారా... తిట్టనీ. మహానుభావుడాయన. తిట్టినా, కొట్టినా బాధ లేదు. దీనివల్ల ఎవరెవరితోనో మాటలు పడే బాధ తగ్గుతుంది’ అని చెప్పి రామారావుగారి దగ్గరకు బయలుదేరాను. మంచో, చెడో, తప్పో, ఒప్పో చేసేశాను. దానికి ఆయనకి కోపం రావడం సహజమే! వాళ్ల పిల్లలు నా మీద ఆగ్రహించడం కూడా తప్పేమీ కాదు. మా నాన్నని ఏమైనా అంటే నేను మాత్రం ఊరుకుంటానా? రామారావుగారు, ఆయన పిల్లలు నా మీద కోపంగా ఉన్నారని ఎన్నాళ్లు వాళ్లని తప్పించుకొని తిరుగుతాను?
రామారావుగారిని కలుసుకోవాలని చెప్పగానే సెక్యూరిటీ వాళ్లు నన్ను చెక్ చేసి పంపించారు. రామారావుగారి ముందుకెళ్లి నిలుచుని ‘నమస్కారం సార్’ అని రెండు చేతులెత్తి నమస్కారం పెట్టా. ఆయన ఒక్కక్షణం పాటు ఎవరా అని చూసి, ‘ఆ ఆ గుర్తుపట్టాం బ్రదర్. హౌ ఆర్ యు. విన్నాం మీ గురించి. చాలా మంచి యాక్టర్ అవుతున్నారని. ఆరోగ్యమే మహాభాగ్యం. చూశారు కదా మమ్మల్ని. ఎంత ఆరోగ్యంగా ఉన్నామో. కీప్ గుడ్ హెల్త్. గాడ్ బ్లెస్ యు’ అని భుజం తట్టారు. అంతే... గబుక్కున వంగి ఆయన కాళ్లకు దణ్ణం పెట్టి అక్కడి నుంచి వచ్చేశా. ‘అదేమిటయ్యా.. అలా వెళ్లావు...ఆయన కొట్టుంటే?’ అనడిగారు విజయచందర్. ఆయన పక్కనున్న వాళ్ల మొహాల్లోనూ అదే సందేహం కనిపించింది. ‘‘దిక్కుమాలిన వాళ్లందరితో రోజూ తిట్లు తినే బదులు, పెద్దాయనకి ఎదురెళ్లడమే కరెక్ట్ అండీ. ఆయనకి నిజంగా నా మీద కోపం ఉందనుకోండి... లాగి ఒక్కటి పీకేవారు. దాంతో అకౌంట్ క్లోజ్ అయ్యేది. ఆ తర్వాత మనం ప్రశాంతంగా ఉండవచ్చు. ఎందుకంటే ఈ రంగంలో నాకంటూ ఎవరూ లేరు. అలాంటి మహానుభావుడితో నాకు వైరం ఏంటండీ. చిన్నప్పుడు తప్పు చేస్తే మా నాన్న, మా టీచర్, మా పక్కింటాయన ఒక దెబ్బ కొడితే పడనా? ఇదీ అలాంటిదే’ అని చెప్పా. ‘వార్నీ... ఏదైనా నీ ధైర్యం మెచ్చుకోవాల్సిందేనయ్యా’ అని వాళ్లు కూడా భుజం తట్టారు. అంతలో మా ఫ్లయిట్ అనౌన్స్మెంట్ రావడంతో అందరం సెక్యూరిటీ చెక్కి బయలుదేరాం. రామారావుగారితో ఎయిర్పోర్ట్ ఎపిసోడ్ అలా ముగిసింది. కానీ అంతకంటే ముందు బెజవాడ రైల్వేస్టేషన్లో ఒక ఘటన జరిగింది. దాని గురించి తప్పక చెప్పాలి.
అదేమిటంటే...
‘మండలాధీశుడు’ విడుదలైన రెండో రోజో, మూడో రోజో అది. నాకు సరిగా గుర్తులేదు. ఆ చిత్రంలో నేను ఎన్టీఆర్‌గారిని అనుకరిస్తూ నటించానని అప్పటికే అందరికీ తెలిసిపోయింది. ఆయన అభిమానులు నా మీద కారాలు, మిరియాలు నూరుతున్నారు. నేను ఎక్కడ దొరుకుతానా అని ఎదురుచూస్తున్నారు. ఆ విషయం నా చెవిన కూడా పడింది. ఎందుకైనా మంచిదని నా జాగ్రత్తలో నేనున్నాను. ఇటువంటి నేపథ్యంలో ఒకసారి రామారావుగారు బెజవాడలో కల్యాణమంటపం ప్రారంభోత్సవానికి వెళ్లారు. ఆ ముహూర్తం పూర్తయ్యాక తిరిగి రైల్లో హైదరాబాద్‌కి ప్రయాణమయ్యారు. ఆయన ఎక్కిన రైలు ఆ స్టేషన్లో బయలుదేరే సమయానికి నేనున్న రైలు బెజవాడ స్టేషన్‌కి చేరుకుంది. ఎదురెదురు ప్లాట్‌ఫామ్‌ల మీద రెండు రైళ్లున్నాయి. ఆయనది బయలుదేరింది. నేనున్నది స్టేషన్ చేరుకుంది. అప్పట్లో ఎన్టీఆర్‌గారు ఊర్లోకి వచ్చినా, వెళ్లినా అభిమానులతో రైల్వేస్టేషన్ కిటకిటలాడిపోయేది. ఇసకేస్తే రాలదంటారే! అంతమంది జనాలుండేవారు. ఆరోజు కూడా అంతే! చుట్టూ జనం, సైకిల్ గుర్తుతో పచ్చజెండాలు, పువ్వుల దండలు, జై జై నినాదాలు... వాతావరణమంతా కోలాహలంగా ఉంది. రైలు నుంచి దిగుతున్నవారు కూడా ఆ సందడి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ‘ఎన్టీఆర్‌గారు హైదరాబాద్ బయలుదేరినట్టున్నారు. స్టేషన్ నిండా తెలుగుదేశం పార్టీ వాళ్లే’ అని నా ముందున్న వాళ్లు అనుకోవడం నా చెవిలో పడింది. అంతే నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. స్టేషన్ నిండా రామారావుగారి మనుషులే. పైగా వాళ్లంతా నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు ట్రైన్ దిగాలా.. వద్దా.. ఒకటే ఆందోళన. వెనక్కి వెళ్లే పరిస్థితి లేదు కనుక .. ఎవరికంటా పడకుండా బయటపడదామనుకొని మెల్లిగా జనంలో కలిసిపోయా. అయితే నా టైమ్ బాగోలేదో ఏమో ఎవడో నన్ను పసికట్టేశాడు. రేయ్... అదిగోరా కోటగాడు.. అని కేక పెట్టాడు. అంతే. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు.
(ఇంకా ఉంది)
-డా. చల్లా భాగ్యలక్ష్మి
