ఎన్టీఆర్‌‌ని ఇమిటేట్ చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నా: కోట (పార్ట్ 15)

ABN , First Publish Date - 2021-09-01T01:05:43+05:30 IST

మహానుభావుడు నందమూరి తారక రామారావుగారితో మాత్రం నటించలేకపోయా. సినిమా పేరు గుర్తు లేదు కానీ, ఓ సినిమాలో చేయాల్సింది. అదీ తప్పిపోయింది. ఆ తర్వాత ఆయన రాజకీయరంగ ప్రవేశం చేయడంతో ఇక అవకాశమే దొరకలేదు. ఈ జన్మకి ఇక ఇంతే అనుకున్నాను. అయితే అనుకోకుండా ‘మండలాధీశుడు’ చిత్రంలో రామారావుగారిని పోలిన..

ఎన్టీఆర్‌‌ని ఇమిటేట్ చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నా: కోట (పార్ట్ 15)

రామోజీగారిని కలిశా

ఖైరతాబాద్‌లో ఉండే ఈనాడు కాంపౌండుకి ప్రతిరోజూ రామోజీరావుగారు వస్తారని నాకు తెలుసు. ఆయన్ని కలిసి మాట్లాడాలంటే అదొక్కటే మార్గం కనుక ఈనాడు ఆఫీసుకు వెళ్లా. నన్ను వెయిటింగ్‌ రూమ్‌లో కూర్చోబెట్టి, నేను వచ్చిన విషయాన్ని ఆయనకి చెప్పారు సెక్యూరిటీ సిబ్బంది. కాసేపటికి ఆయన నుంచి కబురు వస్తే ఛాంబర్‌కు వెళ్లాను. తలుపు తీయగానే ఎదురుగా పెద్ద చెయిర్‌లో హుందాగా కూర్చుని ఉన్నారు రామోజీరావుగారు. నన్ను చూడగానే ‘రండి శ్రీనివాసరావుగారు... ఎలా ఉన్నారు? కుశలమేనా?’ అని అడుగుతూనే టీ తీసుకురమ్మని పురమాయించారు. వెంటనే బోయ్‌ మంచినీళ్ల గ్లాసులు, టీ కప్పులతో ప్రత్యక్షమయ్యాడు. టీ తాగాక చెప్పాల్సిన విషయమంతా వివరంగా చెప్పడం ప్రారంభించాను. ఏవో పేపర్లు పరిశీలిస్తూ నేను చెప్పినదంతా విన్నారు రామోజీరావుగారు. అంతా అయ్యాక ఒకసారి నా వైపు చూసి నవ్వి ‘నే మాట్లాడతాను లెండి. మంచి వేషం కాకపోతే డైరెక్టర్‌గారు వద్దని తిప్పి పంపరు కదా! అయినా నేను ఆయనతో ఒకసారి మాట్లాడతానులెండి’ అని అభయం ఇచ్చారు రామోజీరావుగారు. రెండు చేతులెత్తి నమస్కరించి నేను వెనక్కి వచ్చేశాను. ఆ తర్వాత రామోజీరావుగారు మధుసూదనరావుగారితో ఏం మాట్లాడారో ఏమో కానీ నా చేత ఆ సినిమాలో ఓ కామెడీ వేషం వేయించారు.


టి.కృష్ణగారి మాటే నిజమైంది

‘ప్రతిఘటన’ సినిమా సమయంలోనే జరిగిన ఓ సంఘటన మీకు చెప్పాలి. ఒకరోజు మద్రాసులోని రామానాయుడుగారి థియేటర్లో డబ్బింగ్‌ చెప్పేసి బయటకు వచ్చి క్యాంటీన్‌లో టీ తాగుతున్నాను. నాతోపాటు ఆర్టిస్ట్‌ వేలుగారు, టి.కృష్ణగారు కూడా టీ తాగుతున్నారు. టి.కృష్ణగారు కప్పులో టీని సిప్‌చేస్తూ ‘ఇంక నీకు హైదరాబాద్‌లో ఉండాల్సిన అవసరం లేదయ్యా! మద్రాసుకు దుకాణం మార్చెయ్‌. మంచి రోజు చూసుకొని ఫ్యామిలీని కూడా షిఫ్ట్‌ చెయ్‌’ అని అన్నారు. తథాస్తు దేవతలు అని అంటారే అలాగే ఆ మహానుభావుడు ఏ క్షణాన అలా అన్నారో కానీ కొన్ని రోజులకు అదే నిజమైంది. 87లో నా ఫ్యామిలీని మద్రాసుకు షిఫ్ట్‌ చేశా. పెద్దమ్మాయి పావని ఏడో తరగతి, మా అబ్బాయి వెంకట ఆంజనేయప్రసాద్‌ ఐదు చదువుతున్నారు. మా రెండో పాప పల్లవి ఎన్నో తరగతిలో ఉందో గుర్తులేదు. పెళ్లాం, పిల్లలు కళ్లెదురుగా ఉంటే కావాల్సిందేముంటుంది? పిల్లల ముద్దు ముచ్చట్లు వింటూ హాయిగా నా పని చేసుకోవచ్చనుకున్నాను.


అదేమి చిత్రమో కానీ మద్రాసుకు షిఫ్ట్‌ అయిన తర్వాత నేను మరింత బిజీ అయ్యా. మరో విషయమేమిటంటే నా వాళ్లంతా హైదరాబాద్‌లో ఉంటే, నేను మాత్రం ఒంటరిగా ఒక్కడినే షూటింగ్స్‌ కోసం మద్రాసులో ఉండాల్సి వచ్చేది. అలా కాదనుకునే ఫ్యామిలీని మద్రాసుకు షిఫ్ట్‌ చేశాను. అయితే అప్పటిదాకా మద్రాసులోని స్టూడియోల్లో జరిగిన షూటింగ్స్‌ రాయితీల పుణ్యమాని ఔట్‌డోర్స్‌లో ఎక్కువగా జరుగుతుండటంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. భార్యాపిల్లల్ని వదిలి రాజమండ్రి, వైజాగ్‌, తిరుపతి తిరగడం ఎక్కువైంది. పిల్లల చదువులు పట్టించుకునే తీరిక లేదు. అంతా మా శ్రీమతి మీదే భారం వేశా. పిల్లలు కూడా నా పరిస్థితిని అర్థం చేసుకొని క్రమశిక్షణతో మెలుగుతూ చక్కగా చదువుకున్నారు. మా పెద్ద పాప పావని పదో తరగతి పాస్‌ అయింది. ప్లస్‌ టూ చదివించా. ‘పిల్ల పెద్దదయింది కనుక పెళ్ళి చేసేస్తే మంచిది’ అని మావాళ్లు సలహా ఇవ్వడంతో ఆ పనే చేశా. మా పెద్ద మేనమామగారి పెద్దమనవడు ప్రభాకర్‌కి ఇచ్చి పెళ్ళి చేశాం. ఆయనిప్పుడు గీతా ఆర్ట్స్‌లో వర్క్‌ చేస్తున్నారు. వాళ్లకి కవల పిల్లలు... ప్రదీప్‌, ప్రమోద్‌. ఒకడు గాలి, ఒకడు నీరు.


ఇబ్బందులు ఎదుర్కొన్నా

పరిశ్రమలోకి ప్రవేశించిన అతి తక్కువ కాలంలోనే గొప్పగొప్ప నటులందరితోనూ నటించాను. కానీ నా దురదృష్టం ఏంటంటే మహానుభావుడు నందమూరి తారక రామారావుగారితో మాత్రం నటించలేకపోయా. సినిమా పేరు గుర్తు లేదు కానీ, ఓ సినిమాలో చేయాల్సింది. అదీ తప్పిపోయింది. ఆ తర్వాత ఆయన రాజకీయరంగ ప్రవేశం చేయడంతో ఇక అవకాశమే దొరకలేదు. ఈ జన్మకి ఇక ఇంతే అనుకున్నాను. అయితే అనుకోకుండా ‘మండలాధీశుడు’ చిత్రంలో రామారావుగారిని పోలిన పాత్ర వేయాల్సి వచ్చింది. హీరో కృష్ణగారు, విజయనిర్మలగారు, ఆదిశేషగిరిరావుగారు, హనుమంతరావుగారు పట్టు బట్టి నాతో ఆ వేషం వేయించారు. ఎన్టీఆర్‌ సినిమాలు అప్పటికే బాగా చూసేవాడిని కదా, ఆయన హావభావాలన్నీ ఆకళింపు చేసుకున్నా! అది ‘మండలాధీశుడు’కి పనికొచ్చింది. అన్ని పాత్రల్లాగే దాన్ని కూడా ఒక పాత్రగానే భావించి అందులో నటించా. ఎక్కడా పిచ్చి వేషాలు వెయ్యకుండా ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆ వేషం చేశా. రామారావుగారు ఎవరినైనా తిడితే ఎలా తిడతారు? ఆయన ఎలా నడుస్తారు? అన్నది ఇమిటేట్‌ చేశాను తప్ప ఆయన ఇమేజ్‌ని డామేజ్‌ చేయాలని ప్రయత్నించలేదు. కానీ ‘మండలాధీశుడు’ చిత్రం విడుదలయ్యాక దాని ప్రభావం నా కెరీర్‌ మీద బాగా పడింది. ముఖ్యంగా రామారావుగారిని అభిమానించే నిర్మాతలు నాకు అవకాశాలు ఇవ్వలేదు. ఆయన్ని అభిమానించే దర్శకులు నన్ను దూరం పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశ్రమలో ఒక వర్గం నన్ను బ్యాన్ చేసింది. నాతో మాట్లాడటమే తప్పుగా భావించేవారు. ఇది ఊహించని పరిణామం నాకు. అప్పుడప్పుడే ఎదుగుతున్న నాకు ఇబ్బందికరమైన పరిస్థితి! దీని ప్రభావం ఓ ఏడాదిన్నర పాటు కనిపించిందనే చెప్పాలి. వేషాలు తగ్గిపోయి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. భవిష్యత్తు అయోమయంగా కనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఓ రోజు రామారావుగారిని ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకోవాల్సి వచ్చింది.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-09-01T01:05:43+05:30 IST