ఈ సినిమాలో నీ వేషం బాగోదని.. ఏడిపించి వెనక్కి పంపారు: కోట (పార్ట్ 14)

ABN , First Publish Date - 2021-08-31T02:18:36+05:30 IST

అందులో నా తప్పేం లేదు. నన్ను తీసుకెళ్లడానికి కారు రాకనో, ఏదో... మొత్తానికి ఆలస్యం జరిగింది. నేను లొకేషన్‌కి వెళ్లేసరికి విక్టరీ మధుసూదన్‌రావుగారు దూరంగా ఒక్కరే కూర్చుని ఉన్నారు. ఆలస్యం ఎవరి వల్ల జరిగిందన్నది కాదు.. నేను లొకేషన్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టానా? లేదా? అన్నది అక్కడ నన్ను చుట్టుముట్టిన సమస్య. దాని తీవ్రత

ఈ సినిమాలో నీ వేషం బాగోదని.. ఏడిపించి వెనక్కి పంపారు: కోట (పార్ట్ 14)

లెక్కలు చూసే తీరిక లేదు

ఆర్టిస్టుకి టైమ్‌ వస్తే టైమ్‌ ఉండదండీ, పని చేస్తూ వెళ్లడం తప్ప! చేస్తున్న పనికి ఎంత డబ్బు వస్తోంది? సకాలంలో అందుతోందా? లేదా? ఎవరిచ్చారు? ఎవరు ఎగ్గొట్టారు? ఎక్కడెక్కడ ఎంతెంత రావాలి? ఇలాంటి లెక్కలు వేసుకోవడానికి అస్సలు తీరికే ఉండేది కాదు. పక్కనున్న మేనేజర్‌ ఏం చెప్తే అంతే. ఎప్పుడో ఏ అర్థరాత్రో, తెల్లవారుజామునో ఏదైనా లెక్క గుర్తొచ్చి, అలా జ్ఞాపకం వచ్చిన విషయం మరలా ఆ నిర్మాతలు ఎదురుపడ్డప్పుడు సమయానికి తడితే ‘ఏవండీ మన సినిమా డబ్బులు’ అని అడిగే పరిస్థితులు ఉంటేనే అనేవాడిని. ‘అదేంటండీ అప్పుడే ఇచ్చేశాం కదా’ అని అనేవారు. మన దగ్గర పనిచేసేవారు మన దగ్గరే తింటారు. తినాలి కూడా. మనం ఒకరిని ఉద్యోగంలో పెట్టుకున్నామంటే వాళ్లకి కూడా కలిపి మనం సంపాదిస్తున్నామనే అర్థం. కానీ నా పక్కనున్న తను నన్ను ఆడుకుంటున్నాడనే విషయం నాకు బోధపడటానికి కాసింత సమయం పట్టింది. బ్యాంకులో క్యాష్‌ డీల్‌ చేసిన నేనే మేకప్‌, నటనలో బిజీ అయి ఇలా అయ్యానంటే మిగిలిన నటీనటుల పరిస్థితి ఏంటి? అని అనిపించింది? అతని వల్ల నేను ఇబ్బందుల్లో పడుతున్నాననే విషయం అర్థమై అతన్ని కొంచెం దూరం పెట్టా. ఆ తర్వాత్తర్వాత నేనే కొన్నాళ్లు డేట్లు చూసుకున్నా.


తొలిసారి భయపడ్డాను

‘ప్రతిఘటన’ రిలీజ్‌ అయిన తర్వాత రామోజీరావుగారికి వాళ్లకి కాస్త అర్థమైనట్టుంది... ‘వీడు కొంచెం నిలబడే ఆర్టిస్టు’ అని. ఆ తర్వాత వాళ్ల ‘మల్లె మొగ్గలు’లో అవకాశమిచ్చారు. వి.మధుసూదనరావుగారి దర్శకత్వంలో ఉషాకిరణ్‌ మూవీస్‌ తీసిన చిత్రమది. వి. మధుసూదన్‌రావుగారు చాలా సీనియర్‌ దర్శకుడు. అందుకే ఆయనంటే భయభక్తులతో ఉండేవాళ్లం. ఆయనకు కోపం ఎక్కువ. చాలా దడదడలాడించే వారు. ఆ సినిమాకు నవకాంత్‌గారు కెమెరామేన్‌గా పనిచేశారు. సాగరిక హీరోయిన్‌. రాజేశ్‌ అనీ శ్రీలక్ష్మి సోదరుడు హీరో. అన్నపూర్ణగారు హీరోయిన్‌ మదర్‌గా చేశారు. ఆ కుర్రాడు ఇప్పుడు లేడనుకోండి. కాలం చేశాడు. చెప్పొచ్చేదేమిటంటే... ఆ సినిమాలో నాకు వేషం ఇచ్చారు. కబురు చేస్తే రాజమండ్రికి వెళ్లా. మూడు, నాలుగు రోజులు యాక్ట్‌ చేశా. ఒకరోజు ఎయిర్‌పోర్టు దగ్గర షూటింగ్‌. హోటల్లోనే మేకప్‌ చేసుకున్నా. కారులో అక్కడికి తీసుకెళ్లారు. ఉదయం ఏడుకో, ఎనిమిదికో కాల్షీట్‌ వేశారు. నేనొక 15 నిమిషాలు ఆలస్యంగా వెళ్లా. నాకు ఇప్పటికీ బాగా గుర్తు.


అందులో నా తప్పేం లేదు. నన్ను తీసుకెళ్లడానికి కారు రాకనో, ఏదో... మొత్తానికి ఆలస్యం జరిగింది. నేను లొకేషన్‌కి వెళ్లేసరికి విక్టరీ మధుసూదన్‌రావుగారు దూరంగా ఒక్కరే కూర్చుని ఉన్నారు. ఆలస్యం ఎవరి వల్ల జరిగిందన్నది కాదు.. నేను లొకేషన్‌లోకి ఆలస్యంగా అడుగుపెట్టానా? లేదా? అన్నది అక్కడ నన్ను చుట్టుముట్టిన సమస్య. దాని తీవ్రత నాకు బాగా అర్థమైంది. చొక్కా సర్దుకుంటూ వెళ్లి ‘నమస్కారం సార్‌’ అని డైరెక్టర్‌గారికి విష్‌ చేశా. అంతే నావైపు కాసేపు తేరిపార చూశారు. అప్పుడు నాకు సినిమా పరిశ్రమ అంతా కొత్త కదా. ఎలా రియాక్ట్‌ అవుతారో, ఏమోనని దడ మొదలైంది. ‘రండి రండి! మీరు పెద్దవారు. మహానటులు. అరగంట నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నాం. మీరు ఎప్పుడొస్తే అప్పుడే షూటింగ్‌ పెట్టుకుంటాం. తమరి దయ’ అని అన్నారు.


అంతే నాకు గుండెల్లో రైళ్లు పరిగెట్టడం మొదలెట్టాయి. ‘రెడీ అయ్యే ఉన్నానండీ. నాకు కారు రావడానికి కాస్త లేటయింది. అంతేగానీ కావాలని చేసిన ఆలస్యం కాదండీ’ అన్నా. నేను చెప్పి ముగించేలోపే అందుకుని ‘ఎవరైతే ఏంటిలెండీ. పెద్ద ఆర్టిస్టు మీరు. బ్యాంకులో పనిచేశారు’ అని ఇలాగ నన్ను దెప్పడం మొదలుపెట్టారు. నాకేమో కళ్లెమ్మట నీళ్లు వచ్చేశాయి. ఏంటి ఇలా అంటున్నారీయన.. అనే ఫీలింగు మొదలైంది. ఎందుకంటే సినిమాల్లో చీవాట్లు పడి, కొట్టుకుని పైకి వచ్చినవాడిని కాదు నేను. ఏదో బ్యాంకులో పనిచేసుకుంటూ నాటకాల్లో పేరు తెచ్చుకుని, మొదటి సినిమా నుంచి కూడా గౌరవంగా ఉంటూ వచ్చినవాణ్ణి. ఈ రకంగా నన్ను అంతకుముందు ఎవరూ దెప్పలేదు.


అందుకే నాకు మొత్తం కొత్తగా అనిపించింది. చుట్టూ ఉన్నవాళ్లు చూస్తున్నారన్న ఫీలింగ్‌ ఒకటి. అయినా ‘నా తప్పేం లేదు సార్‌’ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అక్కడ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా ఉండేవారు బాపినీడుగారని, ఆయనా... అక్కడ ప్రసాద్‌ అని ఇంకొకాయనా ఉన్నారు. వీళ్లిద్దరూ ప్రొడక్షన్‌ చూస్తుండేవారు. అప్పుడు ‘ఏయ్‌ బాపినీడు.. ఇలా రావయ్యా’ అని పిలిచారు మధుసూదన్‌రావుగారు. ఈయనంటే అందరికీ కొంచెం భయమే కదా. ఆయన ఒద్దిగ్గా వచ్చి ‘ఏంటి సార్‌’ అని అన్నారు. ‘వీడికి పెట్టిన విగ్గు తీసి పంపించెయ్‌. వీడికి వేషం వద్దు. పంపించెయ్‌’ అని అరిచారు. ‘అదేంటి సార్‌? నేనేం చేశాను? నా కెరీర్‌ దెబ్బతింటుంది? పెద్ద సంస్థ. దాంట్లో నాకు వేషం పెట్టి నాలుగు రోజులు నేను చేసిన తర్వాత ఇప్పుడు తీసేస్తే నా కెరీర్‌ పాడైపోతుంది. ఏమనుకోవద్దు. క్షమించండి సార్‌. ఇంకెప్పుడూ ఇలా ఆలస్యంగా రాను. ఇప్పుడు కూడా నేనుగా చేసిన ఆలస్యం కాదిది. నా కెరీర్‌ గురించి ఒక్క క్షణం ఆలోచించండి. దయ తలచండి’ అని ఏడుస్తూ అంటున్నా. కానీ ఆయన వినిపించుకోలేదు. కాసేపు అయ్యాక ‘ఏడ్చింది చాలు కానీ కళ్లు తుడుచుకో’ అన్నారు. ఆ తర్వాత ఆయన నాతో ఏం చెప్పారు? ఇంతకీ మధుసూదన్‌రావుగారు అలా ప్రవర్తించడానికి అసలు కారణం ఏంటి? నాతో పాటు చుట్టూ చూస్తున్న వారికి తెలిసిన నిజం ఏంటంటే..


ఆయనతో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.. నా దురదృష్టం అదే..!

‘ఏడ్సావులే.. ఇంక ఏడవబాకా’ అన్నారు. అయినా నాకు కళ్ళ వెంట నీళ్ళు అలా ధారగా కారుతూనే ఉన్నాయి. రెండు చేతుల్తోనూ కళ్ళు తుడుచుకుంటూ ఆయన వంకే చూస్తున్నా. ‘ఆపవయ్యా బాబూ... ఏడుపాపు’ అని అన్నారు. ఈసారి మరికాస్త గొంతు పెంచి గట్టిగా అన్నారో ఏమో ఆటోమాటిగ్గా నా కళ్ళనీళ్ళు ఆగిపోయాయి. కూర్చున్నవాడల్లా లేచి నిలబడి, ఒకసారి చుట్టూ చూశారు మధుసూదనరావుగారు. ఆ చూపు గ్రహించి అప్పటివరకూ నా వంకే చూస్తున్నవాళ్లంతా కొంచెం దూరంగా వెళ్లారు. ‘ఇటురా’ అన్నట్లు చెయ్యెత్తి సైగ చేశారు మధుసూదనరావుగారు. చేత్తో ఒకసారి మొహాన్ని తుడుచుకొని చేతులు కట్టుకొని ఆయన దగ్గరకు వెళ్లాను. ‘‘ఏం లేదురా! రాత్రి ‘ప్రతిఘటన’ సినిమా చూశాను. ‘మంత్రి కాశయ్య’గా నీ నటన, తెలంగాణ యాస పలికిన తీరు అద్భుతం. అసలు నీ కేలిబర్‌ ఏంటనేది నాకు అర్థమైపోయింది. ఇన్నేళ్ల నా అనుభవంతో చెబుతున్నా... ఇంకో 15 సంవత్సరాలు నీకు తిరుగులేదురా అబ్బాయ్‌! క్షణం తీరిక లేని బిజీ ఆర్టిస్టువి అవుతావు. అందుకే ఆ సినిమా చూశాక నా మనసు మార్చుకున్నా! ఈ సినిమాలో వేషం అంత బాగుండదు. వద్దు.. చేయవద్దు. ‘ప్రతిఘటన’ తర్వాత నీ మీద అంచనాలు బాగా పెరిగాయి. ఇలాంటి చిన్న చిన్న వేషాలు వద్దే వద్దు. నీ కెరీర్‌ను తగ్గించుకోవద్దు. నీకు తగ్గ వేషం ఉన్నప్పుడు తప్పకుండా పిలుస్తా’ అని ఆప్యాయంగా నా భుజం తట్టారు. ఆయన పొగడ్తకి పొంగిపోవాలో, వేషం పోయినందుకు బాధపడాలో తెలియక ఒక నవ్వు నవ్వి, ఆయన దగ్గర సెలవు తీసుకున్నాను.

 

‘ప్రతిఘటన’ తర్వాత మళ్లీ ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థ సినిమాలో, అందులోనూ ది గ్రేట్‌ డైరెక్టర్‌ మధుసూదనరావుగారి దర్శకత్వంలో నటించే అవకాశం మిస్‌ అయిపోయిందే అనుకుంటూ భారంగా అడుగులు వేసుకుంటూ, రూమ్‌కి తిరిగి వచ్చేశా! రూమ్‌లో కూర్చున్నాను కానీ... మనసంతా ఒకటే ఆలోచనలు. ఇప్పుడేం చెయ్యాలి? వేషాన్ని మధ్యలో అలా వదిలేసి వెనక్కి తిరిగి వెళ్లిపోవడమా... లేక మధుసూదనరావుగారినే బతిమాలి ఆ వేషం కంటిన్యూ చెయ్యడమా? ఆ రాత్రంతా కలత నిద్రే నాకు. తెల్లారుతుండగా ఓ ఆలోచన వచ్చింది. వెళ్లి రామోజీరావుగారిని కలిస్తే...? అవును.. నేనంటే ఆయనకు అభిమానమే! ఆయన దగ్గరకు వెళ్లి పరిస్థితిని వివరించి, ఆయన ఎలా చెబితే అలా చేద్దామనుకున్నాను. ఈ ఆలోచన వచ్చాక నా మనసు తేలికయింది. ఆ సాయంత్రమే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యాను.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-08-31T02:18:36+05:30 IST