దాసరిగారు ఒక సమస్య, కృష్ణంరాజుగారు మరో సమస్య తీర్చారు: కోట (పార్ట్ 13)

ABN , First Publish Date - 2021-08-30T02:42:42+05:30 IST

అంత తిని పడుకుంటే తెల్లారుజామునే మళ్ళీ షూటింగ్‌. బిజీగా మారానుగానీ, ఎంతైనా నాకు సినిమా వాతావరణం కొత్తగానే ఉండేది.. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. సినిమాలకు ఎలా డేట్లు ఇవ్వాలో చెప్పేవాళ్ళు లేరు. అందువల్ల చాలా ఇబ్బంది పడ్డమాట వాస్తవం..

దాసరిగారు ఒక సమస్య, కృష్ణంరాజుగారు మరో సమస్య తీర్చారు: కోట (పార్ట్ 13)

ఐదు నెలలు హోటల్‌ కాపురం

అలా బ్యాంక్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాక 1987 నుంచి సినిమానే నా వృత్తి. జాగ్రత్తగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. మద్రాసులో పామ్‌గ్రోవ్‌ హోటల్లో రూమ్‌ తీసుకున్నా. రూమ్‌ నెంబరు 305. నాకు బాగా గుర్తండీ. ఇంకెవరైనా అన్నిరోజులు ఆ రూమ్‌లో ఉన్నారోలేదో తెలియదుగానీ, ఐదున్నర నెలలు ఏకధాటిగా ఉన్నాను దాన్లో. చేతినిండా సినిమాలుండేవి. హైదరాబాద్‌ రావడం కుదిరేదికాదు. దాంతో అదే నాకు ఇల్లు ఐపోయింది. ఎప్పుడో అర్థరాత్రి రూమ్‌కి చేరుకునేవాణ్ణి. అంత తిని పడుకుంటే తెల్లారుజామునే మళ్ళీ షూటింగ్‌. బిజీగా మారానుగానీ, ఎంతైనా నాకు సినిమా వాతావరణం కొత్తగానే ఉండేది.. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. సినిమాలకు ఎలా డేట్లు ఇవ్వాలో చెప్పేవాళ్ళు లేరు. అందువల్ల చాలా ఇబ్బంది పడ్డమాట వాస్తవం.


ఒకేసారి ఐదారుగురు ప్రొడక్షన్‌ మేనేజర్లు వచ్చారు

రాజమండ్రి దగ్గర పూడిపల్లిలో షూటింగ్‌. దాసరి నారాయణరావుగారి దర్శకత్వం. గోపీకృష్ణా మూవీస్‌ సినిమా. కృష్ణంరాజుగారు హీరో. నాకు మంచివేషం ఇచ్చారు. ప్రాణ్‌గారి కాంబినేషన్‌లో సీన్లు చేయాలి. సరేనని మేకప్‌ వేసుకుంటున్నా. అప్పటికే కాస్తంత మంచిపేరు వచ్చింది. ఇటు కృష్ణంరాజుగారు, అటు దాసరి నారాయణరావుగారు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అంతా పద్ధతిగా ఉంది. అప్పుడు ఓ ఐదారుగురు ప్రొడక్షన్ మేనేజర్లు సెట్‌లోకి వచ్చారు. దాసరిగారు వాళ్ళను గుర్తుపట్టి పలకరించి టీ, కాఫీలు ఇచ్చి ‘ఏంటి ఇలా వచ్చారు’ అని అడిగారు. వారిలో ఒకరు ‘కోటగారి కోసమండీ’ అన్నారు. ఇంకొకరివైపు చూస్తే ఆయన కూడా అదే మాట. వరుసగా మిగిలిన ముగ్గురిదీ అదేమాట. ‘ఏంటి విషయం? అందరికీ కోటగారితో ఏం పని’ అని అడిగారు.


‘ఆయన డేట్లు కావాలండీ. కాల్షీట్లు ఎవరు చూస్తున్నారో అర్థం కావడంలేదు. అందుకే కలిసి వెళ్దామని వచ్చాం. బిజీగా ఉన్నట్టున్నారు. మేం మళ్ళీవచ్చి కలుస్తాం’ అని చెప్పి వెళ్ళారట. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. వాళ్ళు మర్నాడు రాలేదు. మూడో రోజు వచ్చి నన్ను కలిశారు. ‘ఏం చేయాలి?’ నాకేం తోచలేదు. కంగారుగా అనిపించింది. ‘మీ డేట్లు కావాలండీ. ఎన్నాళ్ళిస్తారు? ఎప్పుడిస్తారు’ అని అడిగారు. అంతమంది ఒకేసారి అడిగితే ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు దాసరిగారు ఓ సాయం చేశారు. అక్కడ జ్యోతి ప్రసాద్‌ అని ఒకడున్నాడు. దాసరిగారు అతన్ని పిలిచి ‘రేయ్‌ జ్యోతీ. ఏమనుకోకుండా ఆయన డేట్లు నువ్వు చూడరా. పైకెదిగే ఆర్టిస్టు. డేట్లు చూసేవాళ్లు లేకపోతే కష్టమవుతుంది. చాలా ఇబ్బందులు పడతాడు. పొరపాటు జరిగిందంటే నేనూరుకోను. జాగ్రత్త’ అని చెప్పి నా వైపు తిరిగి షేక్‌హ్యాండ్‌ ఇచ్చి ‘ఇక ఈ టెన్షన్‌ మీకు ఉండదు శ్రీనివాసరావుగారు. అంతా మంచే జరుగుతుంది. కాల్షీట్‌ సమస్య లేకుండా మీరు నింపాదిగా నటన మీద ఏకాగ్రత పెట్టుకోవచ్చు’ అని చెప్పి విష్‌ చేశారు. పక్కనే ఉన్న కృష్ణంరాజుగారు కూడా ‘ఏం కంగారులేదయ్యా. అంతా బానే జరుగుతుంది’ అన్నారు.


అతడు చెప్పడం, నేనెళ్ళి చేయడం

ఆ రోజు సాయంత్రం జ్యోతి ప్రసాద్‌ నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు. నా కోసం వచ్చిన ప్రొడక్షన్‌ మేనేజర్లు సాయంత్రం మరలా కలిస్తే జ్యోతికే అప్పజెప్పా. వాళ్లతోనూ తనే మాట్లాడాడు. అలా నా ప్రమేయం లేకుండానే నా కాల్షీట్లు చూడటానికి ఒక వ్యక్తి సిద్ధమయ్యాడు. అప్పటి నుంచి అతను ఏ షూటింగ్‌ ఉందంటే అక్కడికి వెళ్లేవాడిని. ఒక రకంగా అప్పుడు నా పరిస్థితి ఏంటంటే ‘రేపటి నుంచి ఇదండీ. ఎల్లుండి నుంచీ ఇదండీ’ అని అతను చెప్పడం, నేనెళ్లి చేయడం... రావడం. అంతే ఇక. అలా దాసరిగారి వల్ల డేట్ల విషయం ఓ కొలిక్కి వచ్చింది. కాల్షీట్ల సమస్య తీరింది. కానీ ఏ సినిమాకు ఎంత పారితోషికం తీసుకోవాలి? అప్పటిదాకా ఎవరు ఎంతిస్తే అంతే తీసుకున్నా. కానీ అప్పుడప్పుడే అందరూ ‘ఎంత తీసుకుంటారండీ’ అని అడగడం మొదలుపెడుతున్నారు. మరి ఈ సమస్య తీరేదెలా? ఇక్కడ కూడా మరలా కృష్ణంరాజుగారి సమక్షంలోనే సమస్య తీరింది.


అదెలాగంటే..?

‘తాండ్ర పాపారాయుడు’కి 12 రోజులో, 13 రోజులో పనిచేశా. గోపీకృష్ణా ఆఫీసుకు నన్ను పిలిచారు. కృష్ణంరాజుగారి బ్రదర్‌ ఉండేవారు సూర్యనారాయణరాజుగారని. (ఆయనిప్పుడు లేరనుకోండి. ఈ మధ్యే పోయారు). ఆఫీసుకు వెళ్లా. అక్కడున్న ఆఫీసు బోయ్‌ మర్యాదలు చేసి కూర్చోపెట్టి, తినడానికి పకోడి తెచ్చిపెట్టి వేడివేడి కాఫీ ఇచ్చాడు. అతిథులను సత్కరించడంలో గోపీకృష్ణ మూవీస్‌ పెట్టింది పేరు. ఆఫీసు గడప తొక్కిన వారిని చాలా బాగా సత్కరించేవారు. మర్యాదలన్నీ అయ్యాక నన్ను తీరిగ్గా కూర్చోబెట్టి ‘శ్రీనివాసరావు.. మా సినిమాకు పనిచేశావ్‌. ఏమివ్వమంటావయ్యా నీకు’ అని అడిగారు సూర్యనారాయణరాజుగారు. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. అటూ ఇటూ చూస్తున్నా. అప్పుడే కృష్ణంరాజుగారు ఆ రూమ్‌లోకి అడుగుపెట్టారు. నన్ను చూడగానే ‘మ్‌.. రావయ్యా. ఎలా ఉన్నావ్‌? చాలా బాగా చేస్తున్నావని అంతా అంటున్నారు. ఇంకేమైనా సినిమాలు ఒప్పుకున్నావా? లేదా? ఎలా ఉంది జీవితం.. సినిమా పరిస్థితులు ఒంటబట్టాయా?..’ ఇలా వరుసగా ప్రశ్నలు కురిపించారు.


ఆయన ప్రశ్నలకు ఏదో సమాధానంగా నవ్వుతున్నానే కానీ నా మనసులో సంశయం మొహంలో కనిపించిందేమో... ఆయనే చొరవదీసుకుని ‘ఏంటి కంగారు...’ అని అడిగారు. నేను సమాధానం చెప్పేలోగా అక్కడే కూర్చుని ఉన్న ఆయన సోదరుడు ‘‘ఏం లేదు. ఇదీ సంగతి.. ‘తాండ్ర పాపారాయుడు’కి సంబంధించి ఇంతవరకూ మనం అతనికేమీ ఇవ్వలేదు. డబ్బులివ్వాలి. చెక్కు రాయాలి. ఏమివ్వమంటావంటే నసుగుతున్నాడు’’ అని అన్నాడు. ‘ఏమిటయ్యా, నువ్వు పనిచేసినవాడివి డబ్బులు తీసుకోకపోతే ఎట్లా? బాగా నటించి మాకు మేలు చేస్తున్నావు. దానికి తోడు డబ్బులు కూడా తీసుకోవాలి కదా’ అని కృష్ణంరాజుగారు అందుకున్నారు. 


ఇంక తటపటాయిస్తే బావుండదని, ఏదయితే అదవుతుందని ‘అదిగాదండీ ఏం తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? ఏ వేషానికి ఎంత చెప్పాలి? నాకేం అర్థం కావట్లేదు. పెద్దవారు కదా మీరు. సీనియర్‌ ఆర్టిస్టు. పెద్ద పేరున్నవారు. మీ నోటితో చెప్పండి. ఇదిగో ఇన్ని రోజులు పనిచేశావ్‌. ఇంత తీసుకో అని చెప్పండి. ఇక అది స్టాండర్డ్‌గా తీసుకుని, అందరికీ దాని ప్రకారమే చెబుతా’ అన్నాను. మరి ఆయన ఏ గుణాన ఉన్నాడో ఏమో తెలియదు కానీ ‘‘రూ. 20 వేలు తీసుకోవయ్యా. 12 నుంచి 15 రోజుల మధ్య అయిందంటున్నావు కదా? అయినా ఇది పేమెంట్‌గా అనుకోవద్దు. ఆర్టిస్టుగా నువ్వంటే ముచ్చటపడ్డాం, చాలా బాగా చేశావని. మిగిలిన చోటయితే ఖాయంగా రూ.15 వేలు తీసుకోవచ్చు’’ అని అన్నారు. ఇక అప్పటి నుంచి సినిమాకు 10 రోజులు డేట్లిస్తే రూ.15 వేలు తీసుకోవడం మొదలుపెట్టా. డేట్లు పెరిగినా, తగ్గినా దానికి తగ్గట్టు ఈ 15 వేలను అటూ ఇటూ మారుస్తుండేవాడిని. అదీ లెక్క. ఇక అక్కడి నుంచి నా మేనేజర్‌ ఈ వ్యవహారాన్నంతా చూసుకునేవాడు.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-08-30T02:42:42+05:30 IST