ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ‘బాహుబలి’ని బీట్ చేసేది: కోట (పార్ట్ 12)

ABN , First Publish Date - 2021-08-29T03:10:33+05:30 IST

అలా తెలుసుకున్న జనాలు ఆ సినిమా చూడటం, బ్యాంకుకు రావడం, క్యాష్‌ సెక్షనలో నన్ను చూడాలని ఉబలాటపడటం. సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోకపోవడం, బ్యాంక్‌ అంతా కిటకిటలాడటం... ఇదీ తంతు. బాగా అల్లరి, గోల, హడావిడి ఉండేవి. ‘నువ్వు క్యాష్‌ డిపార్ట్‌మెంట్‌ వదిలేసెయ్‌. నిన్ను చూడ్డానికి..

ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే ‘బాహుబలి’ని బీట్ చేసేది: కోట (పార్ట్ 12)

నన్నుచూసే జనంతో మా బ్యాంక్‌ కిటకిటలాడేది

నారాయణగూడ చౌరస్తాలో నేను పనిచేసే స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉండేది. దాన్ని ఆనుకునే దీపక్‌మహల్‌. అందులో 1985 అక్టోబర్‌ 11న ‘ప్రతిఘటన’ సినిమా రిలీజైంది. ఆ సినిమాతో సినీ నటుడుగా నా జీవితం మొదలైంది. అక్కడి నుంచి మిడ్‌నైట్‌ స్టార్‌నైపోయానండీ. అంటే 12వ తారీఖు నేను స్టార్‌ని. ‘ప్రతిఘటన’ చూసిన వారందరికీ నేను బ్యాంకులో పనిచేస్తానని తెలియసాగింది. ఆనోటా ఈనోటా వింటుంటారు కదా. అలా తెలుసుకున్న జనాలు ఆ సినిమా చూడటం, బ్యాంకుకు రావడం, క్యాష్‌ సెక్షనలో నన్ను చూడాలని ఉబలాటపడటం. సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోకపోవడం, బ్యాంక్‌ అంతా కిటకిటలాడటం... ఇదీ తంతు. బాగా అల్లరి, గోల, హడావిడి ఉండేవి. ‘నువ్వు క్యాష్‌ డిపార్ట్‌మెంట్‌ వదిలేసెయ్‌. నిన్ను చూడ్డానికి విపరీతంగా జనం వస్తున్నారు. మాకు తలకాయనొప్పిగా ఉంది’ అని మా మేనేజర్‌ గారు నన్ను వెనకాల కూర్చోపెట్టేవారు. ఆయన్ని నేనేం తప్పు పట్టలేదు. అంటే అది క్యాష్‌ కదా.. ఇప్పట్లాగ పెద్ద సెక్యూరిటీ ఉండేదికాదు కాబట్టి ఆయన జాగ్రత్తల్లో ఆయన ఉండటం తప్పుగా అనిపించలేదు.


సినీ జీవితం ప్రారంభం

‘ప్రతిఘటన’ విడుదలైనప్పటి నుంచి వరుసగా సినిమాలు రావడం మొదలుపెట్టాయి. స్పెషల్‌గా సెలవులు పెట్టడానికి బ్యాంకువాళ్ళ పర్మిషన్ లేదు. బ్యాంకు రూల్స్‌ స్ట్రిక్ట్‌గా ఉండేవి. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే ఐదారు సినిమాలకు అవకాశాలు వచ్చాయి. బ్యాంక్‌ వాళ్ళకి తెలిసీ తెలియకుండా చేయడానికి ప్రయత్నించేవాణ్ణి. రిక్వెస్ట్‌లు మీద రిక్వెస్టులు పెట్టగా పెట్టగా, జనవరిలోనో, ఫిబ్రవరి లోనో పర్మిషన్ ఇచ్చారు. అదీ ఏమనీ... ‘నువ్వు సినిమాల్లో యాక్ట్‌ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రత్యేక సెలవులు ఇవ్వం. ఫెసిలిటీస్‌ ఉండవు. నీకున్న సెలవుల్లో నువ్వు యాక్ట్‌ చేసుకోవచ్చు’ అని. సరే అనుకుని యాక్ట్‌ చేయడం మొదలుపెట్టా.


రామోజీరావుగారి ఆశీర్వాదం

సరిగ్గా ఆ సమయంలో ‘ప్రతిఘటన’ వంద రోజుల వేడుక జరిగింది. తొలిసారి రామోజీరావుగారితో పరిచయమైంది. అప్పటిదాకా ఆయన గురించి వినడమేగానీ ఎప్పుడూ చూడలేదు. శతదినోత్సవంలో రామోజీరావుగారిని చూశా. ఆయన ఆనందపడి నన్ను చాలా అప్రిషియేట్‌ చేశారు. ‘బాగా చేశారండీ. సినిమా చూసిన వారందరూ మీ గురించి అడుగుతున్నారు. మంచిపేరు వచ్చింది మీకు. ఫ్యూచర్‌లో తప్పకుండా చక్కటి అవకాశాలు వస్తాయి. బాగా బిజీ అవుతారు. మనం ఫస్ట్‌ టైమ్‌ కలిశాం. మీతో పరిచయం బావుంది’ అని ఆనందంగా చెప్పారు. ఆయన వాక్కులు ఫలించాయి నాకు. ఆ సినిమా జనాల్లోకి మౌత్ టాక్‌తో వెళ్ళింది. దానికి తోడు రామోజీరావుగారు కూడా బాగా పబ్లిసిటీ చేశారు. అదే గనుక ఇప్పుడు విడుదలై ఉంటే ‘బాహుబలి’ సక్సెస్‌ని మించిపోయేది. ఎందుకంటే అప్పట్లో రూపాయి వాల్యూ వేరు. ఇప్పుడు వేరు. కంపేర్‌ చేస్తే ఆ సినిమా ఆ లెవల్‌ హిట్‌ అన్నమాట.


బ్యాంక్‌ ఉద్యోగానికి రాజీనామా

వరుసగా సినిమాలు రావడంతో బ్యాంకు కంటే ఇది బెటర్‌ కదా అనే ఫీలింగ్‌ నాలో మొదలైంది. పేరుప్రతిష్టలపరంగా గానీ, ఆర్థికంగా కానీ సినిమా పరిశ్రమే నాకు బెటర్‌ అనిపించింది. అయినా బ్యాంకును వదిలే ధైర్యం చేయలేదు. చూడబోతే నన్ను నమ్ముకుని ఇంట్లో మా ఆవిడ, ముగ్గురు పిల్లలున్నారు. బ్యాంక్‌ అంటే గవర్నమెంట్‌ ఉద్యోగం. నిలకడైన జీతం, గౌరవం. అందుకే గబుక్కున వదల్లేకపోయా. అలాగని రోజూ బ్యాంక్‌కి వెళ్ళే టైమ్‌ ఉండేది కాదు. ఆర్టిస్ట్‌ని కావడంవల్ల మారుపేరు పెట్టుకుని ఉద్యోగం చేయడం కుదరదు. పోనీ ఆరోగ్యం బాగోలేదనో, మరోటనో అబద్ధం చెప్పే పరిస్థితి లేదు. జనాన్ని అలరిస్తూ స్ర్కీన్ మీద కనిపిస్తుంటాను. అందువల్ల అబద్ధాలు చెప్పడం నాకిష్టం లేకపోయింది. ‘సినిమాల్లో ట్రై చేస్తున్నాను. అవకాశాలు ఆశాజనకంగా ఉన్నాయి, సెలవు గ్రాంట్‌ చేయాల్సిందిగా మనవి’ అని లెటర్లు పెట్టేవాణ్ణి. అలా నెలకి ఒకటీ, రెండు సార్లు సెలవులు పెట్టి మద్రాసు వెళ్ళేవాణ్ణి. రెండు పెద్ద సినిమాల్లో చేసేవాణ్ణి. తర్వాత్తర్వాత సినిమాలు పెరిగాయి. ఓ పక్కనేమో మా అన్నయ్యగారు వాళ్ళు ‘ఒరేయ్‌ నీకు చాలా పేరొచ్చింది. నువ్వు ఇంక బ్యాంకు వదిలేయొచ్చు. ప్రజల్లో చూస్తున్నాము కదా, నీకు తిరుగు ఉండదు. నటుడిగా నిలదొక్కుకుంటావ్‌’ అని చెప్పడం మొదలెట్టారు. నాకేమో భయం వేసేది. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. అప్పటికే బ్యాంకువాళ్ళు కూడా ఏడాదిపాటు చూశారు. నా పద్ధతిలో మార్పు రాలేదని వాళ్ళకు అర్థమైంది. అప్పటికి నేను బ్యాంకులో చేరి పందొమ్మిదిన్నర సంవత్సరాలు. 20 ఏళ్ళు పూర్తయితే నాకు పెన్షన్ ఇవ్వాలి. అందువల్ల ఒక ఉత్తరం రాశారు. ‘ఫలానా తారీఖులోపు జాయిన్ అవ్వాలి. లేకపోతే నీకు ఉద్యోగంమీద ఇంట్రెస్ట్‌ లేదనుకుని మేమే తీసేస్తాం..’ అన్నట్టు రాశారు. ఉత్తరం ఆలస్యంగా అందింది. వాళ్ళు చెప్పినడేటు దాటిపోయి అప్పటికి ఐదురోజులైంది. అప్పుడు బెంగళూరులో షూటింగ్‌లో ఉన్నట్టున్నా. సిల్క్‌ స్మిత సొంత పిక్చర్‌. ఆమే హీరోయిన్. వినోద్‌ హీరో. కాంబినేషన్ సీన్లు ఉండటం వల్ల వెంటనే హైదరాబాద్‌ రాలేకపోయాను. నేను వచ్చేసరికి పరిస్థితి చెయ్యి దాటిపోయింది. బ్యాంకు వాళ్ళు ఒప్పుకోలేదు. సరే అని రిజైన్ చేశా.

(ఇంకా ఉంది)

-డా. చల్లా భాగ్యలక్ష్మి

Updated Date - 2021-08-29T03:10:33+05:30 IST