సత్యసాయి బాబా ముందే చెప్పారు..!

ABN , First Publish Date - 2021-01-18T15:36:41+05:30 IST

ఒకసారి సత్యసాయి బాబాను లక్నోలో కలుసుకున్నానని...

సత్యసాయి బాబా ముందే చెప్పారు..!

ముంబై: భజన్ సామ్రాట్‌గా పేరొందిన అనూప్ జలోటా నటించిన ‘ఓం శ్రీ సత్యసాయి బాబా’ చిత్రం జనవరి 22న విడుదల కానుంది. ఈ సినిమాలో అనూప్ జలోటా లీడ్ రోల్‌లో కనిపించనున్నారు. హిందీలో నిర్మితమైన ఈ సినిమా విడుదల సందర్భంగా అనూప్ జలోటా మీడియాతో మాట్లాడారు. తాను చిన్నప్పుడు అనేక నాటకాల్లో వేషాలు వేసేవాడినని, తరువాతి కాలంలో సినిమాల్లో పనిచేశానని తెలిపారు.


‘బిగ్‌బాస్’లో అవకాశం రావడంతో దానిలో కూడా పాల్గొన్నానన్నారు. బిగ్‌బాస్‌లోకి వెళ్లాక మంచి పేరు వచ్చిందని తెలిపారు. ఇప్పుడు సత్యసాయి బాబా సినిమా చేస్తున్నానన్నారు. సత్యసాయి బాబా బతికివున్న రోజుల్లో ఆయనను కలిశానని, తనను ఆయన ‘ఛోటా బాబా’ అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. అలా ఎందుకు పిలుస్తున్నారని బాబాను అడగగా... తాను భవిష్యత్‌లో సత్యసాయి బాబా రోల్ పోషిస్తానని ఆనాడే చెప్పారన్నారు. ఒకసారి సత్యసాయి బాబాను లక్నోలో కలుసుకున్నానని, బాబా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారని, ఎన్నోఅద్భుతాలు కూడా చేశారని అనూప్ తెలిపారు. పుట్టపర్తి, బెంగళూరులలో ఆసుపత్రులు కట్టించిన మహనీయుడు బాబా అని కొనియాడారు. ఎటువంటి ఫీజు తీసుకోకుండా అక్కడ ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తారని తెలిపారు. పండ్లున్న చెట్లుకు రాళ్ల దెబ్బలు తగలడం సహజమని, బాబా విషయంలో అదే జరిగిందన్నారు. తాను ఈ సినిమాలో బాబా గెటప్ కోసం ప్రతిరోజూ ఒక గంటపాటు వెచ్చించాల్సివచ్చిందన్నారు. పుట్టపర్తిలోనే ఈ సినిమా షూటింగ్ జరిగిందని తెలిపారు.

Updated Date - 2021-01-18T15:36:41+05:30 IST