అంజలీదేవిగారికీ, సావిత్రిగారికి రెండు శాతమే తేడా!: గిరిబాబు (పార్ట్ 17)

ABN , First Publish Date - 2021-05-19T04:34:39+05:30 IST

‘హీరోయిన్లలో అంజలీదేవి గొప్పా, సావిత్రి గొప్పా’ అనే అంశం మీద చర్చ మొదలైంది. ‘మీ అభిప్రాయం చెప్పండి ముందు’ అని నాగేశ్వరరావుగారిని అడిగారు గుమ్మడిగారు. ‘ఇద్దరూ మహానటీమణులే. ఇద్దరితోనూ ఎక్కువ సినిమాలు చేశాను. కాకపోతే నేను సావిత్రికి 51 శాతం, అంజలీదేవికి 49 శాతం మార్కులు వేస్తాను’ అన్నారాయన

అంజలీదేవిగారికీ, సావిత్రిగారికి రెండు శాతమే తేడా!: గిరిబాబు (పార్ట్ 17)

హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత దాదాపు ప్రతిరోజూ నేను, గుమ్మడిగారు, సత్యనారాయణగారు కలుస్తుండేవాళ్లం. మాతో పాటు హాస్యనటుడు సారథి, దర్శకుడు భాస్కరరావుగారు (ఇటీవల చనిపోయారు) కూడా ఉండేవారు. మేమందరం భాగస్వాములుగా ‘ట్విన్‌ సి క్లబ్‌’ ఏర్పాటు చేశాం. సాయంత్రమైతే చాలు అక్కడ కానీ, గుమ్మడిగారి ఇంట్లో కానీ కలుస్తుండేవాళ్లం. అప్పుడప్పుడు నాగేశ్వరరావుగారు కూడా వస్తుండేవారు. ఆయన, గుమ్మడిగారు సమకాలికులు కనుక చాలా సన్నిహితంగా ఉండేవారు. సాయంత్రం పూట ఎప్పుడైనా ఆయనకి ఏ కార్యక్రమం లేకపోతేనో, ఇంట్లో ఒక్కడే ఉండి బోర్‌ కొడితేనో ‘గుమ్మడిగారూ.. మీ ఇంటికి వస్తున్నా’ అని ఫోన్‌ చేసి వచ్చేసేవారు. అయితే ఆయన ఒక కండీషన్‌ పెట్టేవారు. ‘మీరు, నేను, సత్యనారాయణగారు, గిరిబాబుగారు తప్ప మరెవరూ ఉండకూడదు’ అని. అందుకే నాగేశ్వరరావుగారు వచ్చే సమయానికి మిగిలిన వారెవరూ లేకుండా గుమ్మడిగారు చూసేవారు.

 

నాగేశ్వరరావుగారు రాగానే మేం నలుగురం కూర్చునేవాళ్లం. దాదాపు రెండు గంటల సేపు రకరకాల కబుర్లతో కాలక్షేపం చేసేవాళ్లం. ఎక్కువగా సినిమాలకు సంబంధించిన విషయాలే మాట్లాడుకునేవాళ్లం. పాత సినిమా కబుర్లు, చరిత్ర విశేషాలు ముచ్చటించుకునేవాళ్లం. ఆయన నటించిన చిత్రాల గొప్పతనం గురించి, అందులో విశేషాల గురించి నేను వివరంగా చెబుతుంటే చిరునవ్వుతో వింటుండేవారు నాగేశ్వరరావుగారు. మధ్య మధ్య ‘అబ్బో మీకు చాలా విషయాలు తెలుసునే’ అనేవారు. ఇలా ఒకరోజు మేం నలుగురం కూర్చుని ఉండగా, ‘హీరోయిన్లలో అంజలీదేవి గొప్పా, సావిత్రి గొప్పా’ అనే అంశం మీద చర్చ మొదలైంది. ‘మీ అభిప్రాయం చెప్పండి ముందు’ అని నాగేశ్వరరావుగారిని అడిగారు గుమ్మడిగారు. ‘ఇద్దరూ మహానటీమణులే. ఇద్దరితోనూ ఎక్కువ సినిమాలు చేశాను. కాకపోతే నేను సావిత్రికి 51 శాతం, అంజలీదేవికి 49 శాతం మార్కులు వేస్తాను’ అన్నారాయన. ఆయన మాటతో గుమ్మడిగారు ఏకీభవించారు. తన అభిప్రాయం కూడా అదేనని చెప్పారు. ఆ తర్వాత నా అభిప్రాయం చెప్పమన్నారు. ‘సార్‌.. మీరు చెప్పినదాన్ని రివర్స్‌ చేస్తున్నాను’ అన్నాను. ‘ఎట్లా?’ అని ప్రశ్నించారు నాగేశ్వరరావుగారు.


‘నేను అంజలీదేవిగారికి 51 శాతం, సావిత్రిగారికి 49 శాతం ఇస్తున్నానండీ’ అని చెప్పాను. ‘ఎలాగో వివరంగా చెప్పు’ అని అడిగారు నాగేశ్వరరావుగారు, గుమ్మడిగారు. ‘సావిత్రిగారు మహానటే. ఎవరూ కాదనలేరు. అయితే అంజలీదేవిగారు కూడా తక్కువేమీ కాదు. వాంప్‌ పాత్రలతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె తర్వాత హీరోయిన్‌గా ఎదిగారు. సాంఘికాలు, జానపదాలు, పౌరాణికాలు, చారిత్రాత్మకాలు... ఒకటనేమిటి ఆవిడ చేయని సినిమాలంటూ లేవు. ముఖ్యంగా పౌరాణికాల్లో సీత పాత్ర పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే నటి అంజలీదేవిగారే. మీరు, రామారావుగారు నటించిన ‘చరణదాసి’ చిత్రం తీసుకోండి. అందులో అంజలీదేవిగారు, సావిత్రిగారు ఇద్దరూ నటించారు. కానీ అంజలీదేవిగారి పాత్ర హైలైట్‌ అయింది’ అని చెబుతుంటే నాగేశ్వరరావుగారు కల్పించుకుని ‘పాత్ర గొప్పతనాన్ని బట్టి ఆర్టిస్టులకు పేరు వస్తుంటుంది. అందులో అంజలీదేవి పాత్ర గొప్పది’ అన్నారు. 

 

‘మీరు చెప్పింది నిజమే సార్‌.. అయితే అంజలీదేవిగారు చేయని పాత్ర లేదు. హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఆవిడ తర్వాత తల్లి పాత్రల్లో కూడా చక్కగా ఒదిగారు. కన్నాంబగారి తర్వాత తల్లి పాత్రలు పోషించాలంటే అంజలీదేవిగారే చేయాలి అనే పేరు తెచ్చుకున్నారు. తనకు ఏ పాత్ర ఇచ్చినా ఎంతో ఉదాత్తంగా పోషించిన గొప్ప నటి ఆమె. ఇక సావిత్రిగారి విషయానికి వస్తే ఆవిడ మహానటి. సాంఘిక చిత్రాల్లో ఆవిడని అధిగమించేవాళ్లు ఎవరూ లేరు. కొన్ని పౌరాణికాల్లో ఆవిడ అద్భుతంగా నటించిన మాట వాస్తవమే. ఇద్దరూ గొప్పవాళ్లే. కాకపోతే అంజలీదేవిగారికీ, సావిత్రిగారికి రెండు శాతమే తేడా ఉందని చెబుతున్నాను’ అని నేను విశ్లేషించేసరికి, నా మాటతో సత్యనారాయణగారు కూడా ఏకీభవిస్తూ ‘గిరిబాబు చెప్పింది కరెక్టే. నా అభిప్రాయం కూడా అదే’ అన్నారు. ఇలా మా మధ్య ఆసక్తికరమైన చర్చలు జరిగేవి.


మా ఇంట్లో చేసే గారెలు అంటే నాగేశ్వరరావుగారికి చాలా ఇష్టం. అందుకే ఆయన వచ్చినప్పుడు గారెలు చేయించి తీసుకెళ్లేవాడిని. నాగేశ్వరరావుగారు ఎక్కువగా తినేవారు కాదు. రుచి చూడటం కోసం రెండు గారెలు మాత్రం తినేవారు. దాదాపు ప్రతి రోజూ మేం ముగ్గురం కలిసేవాళ్లం కానీ నాగేశ్వరరావుగారితో మాత్రం నెలకోసారి మీటింగ్‌ ఉండేది. మొదట్లో గుమ్మడిగారింట్లో కలిసినా తర్వాత ఆయన ఇంటికి పిలిచేవారు. వరండాలో కూర్చుని నలుగురం కబుర్లు చెప్పుకునేవాళ్లం. అన్నపూర్ణమ్మగారు వీల్‌ ఛైర్‌లో అక్కడికి వచ్చి మాతో కలిసేవారు. చర్చల్లో తను కూడా పాలుపంచుకొనేవారు. ఆ తర్వాత అందరం కలిసి భోజనాలు చేస్తుంటే ఆవిడ పక్కనే కూర్చుని కొసరికొసరి వడ్డించేవారు.

(ఇంకా ఉంది)

-వినాయకరావు

Updated Date - 2021-05-19T04:34:39+05:30 IST